
లబ్బీపేట(విజయవాడతూర్పు): పుట్టుకతోనే కుడివైపు ముక్కులో మాస్ పెరుగుదల ఉన్న 22 రోజుల శిశువుకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ జీజీహెచ్ ఇఎన్‌టీ విభాగ వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఆ శిశువుకు ఎముకల ఫైబ్రోమా వ్యాధిగా నిర్ధారించిన వైద్యులు, ఆస్పత్రిలో ఉన్న అత్యాధునిక ఎండోస్కోపీ పరికరంతో శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించి కుడి నాసల్‌లోని మాస్‌ను తొలగించారు.
ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రిలో అత్యాధునిక పరికరాలతో పాటు, నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉండడంతో క్లిష్టతరమైన, అరుదైన శస్త్ర చికిత్సలను సైతం విజయవంతంగా నిర్వహించగలుగుతున్నారు.
ముక్కులో మాస్‌తో ఇబ్బంది పడుతున్న శిశువును పాత ప్రభుత్వాస్పత్రి నుంచి ఇక్కడికి రిఫర్ చేయగా, ఆమెకు పుట్టుకతోనే ఉన్న వ్యాధి నిర్ధారించి శస్త్ర చికిత్స నిర్వహించినట్లు ఇఎస్‌టీ విభాగాధిపతి డాక్టర్ రవి తెలిపారు. ఇఎన్‌టీ వైద్యులు డాక్టర్ లీలాప్రసాద్, డాక్టర్ ఆదిత్య, ఎనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ టి సూర్యశ్రీ, డాక్టర్ కిరణ్‌కుమార్, డాక్టర్ సుధారాణి పాల్గొన్నారు.