‘అమరావతి’ ఆందోళనకారుల ర్యాలీ

Rally of protesters in the capital Amaravati without permission led to tensions - Sakshi

ముందస్తు అనుమతులు లేకుండా దుర్గమ్మ దర్శనం పేరిట విజయవాడకు ర్యాలీ

30 పోలీస్‌ యాక్ట్, ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో అడ్డుకున్న పోలీసులు

పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట

సాక్షి, గుంటూరు/తాడికొండ: ముందస్తు అనుమతులు లేకుండా రాజధాని అమరావతి ఆందోళనకారులు ర్యాలీ చేపట్టడం ఉద్రిక్తతలకు దారి తీసింది. గుంటూరు జిల్లాలోని అమరావతి రాజధాని ప్రాంతంలో 144వ సెక్షన్, 30 పోలీస్‌ యాక్ట్‌ అమల్లో ఉంది. ఇక్కడ నిరసనలు, ర్యాలీలు, ఆందోళనలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి. అయితే ఈ నిబంధనలన్నింటినీ పక్కనపెట్టి ఆందోళనకారులు సోమవారం విజయవాడలోని దుర్గమ్మ గుడి దర్శనానికంటూ ర్యాలీగా బయల్దేరారు. ఓవైపు విజయవాడ కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంది.

ఈ నేపథ్యంలో పాదయాత్రగా ఆందోళనకారులు విజయవాడకు వెళ్లడానికి వీల్లేదని పోలీసులు అడ్డుకున్నారు. ప్రకాశం బ్యారేజీ, మందడం, రాజధాని గ్రామాల్లో ఎక్కడికక్కడ అనుమతులు లేవని పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆందోళనకారులు విజయవాడకు బయల్దేరతామని పట్టుబట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు తమను అడ్డుకున్నారని తుళ్లూరు మండలం వెలగపూడిలోని సచివాలయం ముట్టడికి యత్నించారు. మల్కాపురం జంక్షన్‌ వద్ద పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన తోపులాటలో పోలీసులకు గాయాలయ్యాయి. పలువురు పోలీస్‌ సిబ్బందిని పిడిగుద్దులు గుద్దడం, గోళ్లతో రక్కడం చేశారు. 

ప్రకాశం బ్యారేజీ దిగ్బంధానికి యత్నం
దుర్గ గుడి దర్శనం పేరిట ఆందోళనకారులందరూ ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుని బ్యారేజీని దిగ్బంధించాలని ప్రణాళిక రచించుకున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని నిఘా వర్గాలు ఆదివారమే గుర్తించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామునే ఎక్కడికక్కడ బారికేడ్లు, పికెట్‌లు ఏర్పాటు చేశారు. ఆందోళనకారుల ముసుగులో టీడీపీ నేతలే ఈ కుట్రలకు తెరలేపినట్టు విమర్శలొస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ప్రతిపక్ష నేత చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు ముందస్తు అనుమతులు లేకుండా ఆందోళనకారులు ర్యాలీలకు దిగడం చూస్తుంటే బుధవారం జరిగే ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగించేలా కుట్రలు పన్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top