Heavy Rains Forecast: బలపడిన అల్పపీడనం.. పలుచోట్ల భారీ వర్షాలు

సాక్షి, అమరావతి: ఒడిశా తీరంలో అల్పపీడనం మరింత బలపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6కి.మీ ఎత్తులో విస్తరించి ఉన్నట్లు తెలిపింది. వీటి ప్రభావంతో కోస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం అల్లూరి సీతారామరాజు, పల్నాడు, అనకాపల్లి, నెల్లూరు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురిశాయి.
ఎస్‌డీఆర్‌ఎఫ్ సహాయక చర్యలు
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందాలు చురుగ్గా పనిచేస్తున్నాయి. మంగళవారం పలు గ్రామాల నుంచి 1,125 మందిని బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. కూనవరం మండలం టేకులముండి నుంచి 275 మంది, రాజుపేట, వడ్డిగూడెం గ్రామాల నుంచి 200 మంది, టేకులబోరు, కూనవరం, గిన్నెల బజార్, రేఖపల్లి గ్రామాల నుంచి 300 మంది, ధర్మతులగూడెం నుంచి 350 మందిని బోట్ల ద్వారా బయటకు తీసుకువచ్చి షెల్టర్లకు తరలించారు.