
వైఎస్ కుటుంబం నుంచి పులివెందుల ప్రజలను వేరు చేయలేరు
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి
పులివెందుల: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలో వైఎస్సార్‌సీపీని ఎలాగైనా ఓడించాలని టీడీపీ కూటమి నాయకులు అన్ని రకాల కుట్రలూ పన్నుతున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. శనివారం పులివెందులలో ఆయన మీడియాతో మాట్లాడారు. వారం రోజులుగా పులివెందులలో జరుగుతోంది ఎన్నికల కార్యక్రమం కాదని, దాడులు, హింస, రక్తపాతం జరుగుతోందన్నారు.
పోలీసులతో తప్పుడు కేసులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై బెదిరింపులకు పాల్పడుతున్నారని, చివరికి రిగ్గింగ్ కూడా ఉండబోతుందని వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌సీపీ నేతలు రామలింగారెడ్డి, హేమాద్రిరెడ్డిలతోపాటు మరో 50మందిపై అట్రాసిటీ, 307 సెక్షన్ కింద తప్పుడు కేసులు బనాయించారన్నారు. ఎన్నికల నాటికి వైఎస్సార్‌సీపీ ఉండకుండా చేయాలన్నదే టీడీపీ నేతల దురుద్దేశమన్నారు. పోలీసులు ఉన్నది టీడీపీకి ఓట్లు వేయించేందుకేనా అని ప్రశ్నించారు.
వైఎస్ పేరు చెరిపేందుకు కుట్ర..
వైఎస్ పేరుకు పులివెందుల తాలుకాలో ఓటమి లేదని, దానిని చెరిపేందుకు టీడీపీ అడ్డదారులు తొక్కుతుందన్నారు. పోలింగ్ బూత్‌లను మార్చి కుట్రపూరితంగా గెలిచేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఒకవేళ రిగ్గింగ్ చేసి గెలిచినా, వైఎస్ జగన్‌కు ఆవగింజంత అవమానాన్నిగాని, భయాన్నిగాని పరిచయం చేయలేరన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ఇప్పుడు ఉన్న జగన్ 2029–34 మధ్య ఉండరని, మరో జగన్‌ను చూస్తారని హెచ్చరించారు. ఈనెల 12న పోలింగ్ ప్రశాంతంగా జరిగితే పోలీసులను అభినందిస్తామని, ఆ ఒక్కటి కూడా సమర్థంగా చేయలేకపోతే ప్రజాస్వామ్యం పోలీసులను క్షమించదని అన్నారు.