ఆయన భార్య అధికార పార్టీ నేత కావడంతో అకృత్యాలు
చంద్రగిరి పోలీసులకు మహిళల ఫిర్యాదు
చంద్రగిరి: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలానికి చెందిన ఓ ఏఆర్ కానిస్టేబుల్ ఆగడాల నుంచి తమను కాపాడాలంటూ పలువురు మహిళలు పోలీసులను కోరారు. ఈ మేరకు గురువారం ఏఆర్ కానిస్టేబుల్ పెద్ద రెడ్డప్పపై చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ అకృత్యాలకు సంబంధించిన వాయిస్ రికార్డులను కూడా పోలీసులకు అందజేశారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు... ఎ.రంగంపేటకు చెందిన పెద్ద రెడ్డప్ప కల్యాణి డ్యామ్ సమీపంలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్(పీటీసీ)లో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
ఆయన పోలీసు యూనిఫాంలోనే మద్యం తాగి రంగంపేట బస్టాండ్ వద్ద తరచూ స్థానికులు, మహిళలను బూతులు తిడుతూ దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని చెప్పారు. ఆయన ఆగడాలను ప్రశ్నిస్తే తుపాకీతో కాల్చి చంపుతా.. అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. మీరు మాట్లాడే భాష సరిగా లేదంటే... మరింత అసభ్యకంగా మాట్లాడుతూ వాటిని వాట్సాప్ స్టేటస్‌గా పెట్టి తీవ్రంగా అవమానిస్తున్నాడని తెలిపారు.
‘‘మీ కుటుంబాల్లో ఎంత మంది మహిళలు ఉంటే అంతమందిని అనుభవిస్తారా.. నా కొడకల్లారా’’ అంటూ అతడ్ని ఎదిరించినవారికి వాయిస్ మెసేజ్‌లు పంపి బెదిరిస్తూ మనోవ్యధకు గురిచేస్తున్నాడంటూ మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. గతంలోనూ పెద్ద రెడ్డప్ప ఇలానే ప్రవర్తించాడని, అప్పట్లో అతనిపై కేసు నమోదు కావడంతో కోర్టులో విచారణ జరుగుతున్నట్లు వివరించారు. కాగా, ఏఆర్ కానిస్టేబుల్ పెద్ద రెడ్డప్ప భార్య అధికార పార్టీ మహిళా విభాగం నాయకురాలిగా ఉండటం వల్లే ఆయన రెచ్చిపోయి అనుచితంగా వ్యవహరిస్తున్నాడని స్థానికులు మండిపడుతున్నారు.


