
హంతకులు బావ, బావమర్ధులు
ఫంక్షన్ హాల్ ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణం
పలువురు చూస్తుండగానే కత్తితో పొడిచిన వైనం
ఉదయగిరి(నెల్లూరు): ఉదయగిరిలోని ఆర్టీసీ డిపో సమీపంలో ఉన్న ఆల్‌ఖైర్ కల్యాణ మండపంలో శుక్రవారం రాత్రి జనం చూస్తుండగానే ఓ దారుణ హత్య జరిగింది. కల్యాణ మండపం ఆర్థిక లావాదేవీల విషయంలో బావ, బావమర్ధుల మధ్య నెలకొన్న విభేదాలే ఈ హత్యకు కారణంగా మారింది. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు.. ఉదయగిరికి చెందిన హానిఫ్, కొండాపురం మండలం గరిమెనపెంటకు చెందిన హమీద్ (38) (హతుడు) పెద్దమ్మ కూతురును వివాహం చేసుకున్నాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న హామీద్ ఉదయగిరిలో వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో హానిఫ్, అతని సోదరుడు ఉమర్‌తో కలిసి హమీద్ ఫంక్షన్ హాల్ నిర్మించారు. కొన్నేళ్ల పాటు అందరూ కలిసి సజావుగానే నిర్వహించారు.
ఈ క్రమంలో ఏడాది క్రితం నుంచి హమీద్‌కు తన బావమర్ధులు ఉమర్, హానిఫ్‌తో ఆర్థిక పరమైన వివాదాలు తలెత్తాయి. ఈ పంచాయితీ పోలీసుల వద్దకు చేరింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు పోలీసులు పలుమార్లు పంచాయితీ నిర్వహించారు. కానీ వివాదం పరిష్కారం కాలేదు. దీంతో హమీద్ తాను చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి ఈ విషయమై తాడోపేడో తేల్చుకునేందుకు కొద్ది రోజులుగా సొంతూరు గరిమనపెంటలో ఉంటున్నాడు. అయితే ఫంక్షన్ హాల్‌ను నిర్వహించేందుకు పోలీసులను మధ్యవర్తులుగా పెట్టుకుని నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆస్తి వివాదమై కోర్టులో కేసు కూడా కొనసాగుతోంది.
శనివారం ఫంక్షన్ హాల్‌లో ఓ కార్యక్రమం జరుగుతున్న విషయం తెలుసుకున్న హమీద్ శుక్రవారం సాయంత్రం ఉదయగిరికి వచ్చి తన స్నేహితులతో కలిసి ఫంక్షన్ హాల్‌కు తాళం వేశాడు. ఈ విషయం తెలుసుకున్న హానిఫ్, ఉమర్ కత్తి, ఇనుపరాడ్‌తో ఫంక్షన్ హాల్ చేరుకున్నారు. లోపలికి పరిగెత్తూ కుంటూ వెళ్లి ఒక్కసారిగా దాడి చేసి రాడ్, కత్తితో దారుణంగా హత్య చేశారు. దీంతో హమీద్ వెంట ఉన్న మిత్రులు భయభ్రాంతులతో పరుగులు తీశారు. అందులో ఒక యువకుడు ఈ హత్యను తన సెల్‌లో చిత్రీకరించారు. ఈ దారుణ హత్యతో ఉదయగిరి ఒక్కసారిగా ఉలికిపడింది. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.