
సాక్షి, అమరావతి: రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా డిసెంబర్ 5వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. ఆమె ఐదో తేదీ విజయవాడలో పర్యటిస్తారు. విజయవాడలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడంతోపాటు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ రాష్ట్రంలో నిర్మించిన మూడు జాతీయ రహదారులను వర్చువల్‌గా ప్రారంభిస్తారు. మరో జాతీయ రహదారి నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి భవన్ సమాచారం ఇచ్చింది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర పర్యటన పూర్తి షెడ్యూల్‌ను ఖారారు చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆర్ అండ్ బీ శాఖ రాష్ట్రపతి పర్యటన కోసం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం రాయచోటి–అంగల్లు సెక్షన్ జాతీయ రహదారిని, జాతీయ రహదారి–205పై నాలుగు లేన్ల ఆర్వోబీ–అప్రోచ్ రోడ్లను, కర్నూలులోని ఐటీసీ జంక్షన్ వద్ద నిర్మించిన ఆరు లేన్ల గ్రేడ్ సెపరేటెడ్ నిర్మాణాలను రాష్ట్రపతి ప్రారంభిస్తారు. ముదిగుబ్బ–పుట్టపర్తి రహదారి విస్తరణ పనులకు భూమి పూజ చేస్తారు.