నాటి పల్లెలు.. నేడు సరికొత్త హంగులతో.. 

The Population Of Towns And Cities In Guntur Join District Increase Significantly - Sakshi

పట్నవాసంపై ప్రజల మక్కువ

రోజురోజుకూ పెరుగుతున్న పట్టణ జనాభా

విద్య, వైద్యం, ఉపాధి కోసం పురాల బాట

కూలి కోసం.. ఉపాధి కోసం.. ఎదిగిన బిడ్డ చదువు కోసం.. కుటుంబ సభ్యుల అవసరాల కోసం పట్టణంలో బతుకుదామని పల్లెవాసి వలస బాట పడుతున్నాడు. ఫలితంగా పట్టణీకరణ పెరుగుతోంది. గత 20 ఏళ్లలో పుర/నగరాల జనాభా గణనీయంగా పెరగడమే దీనికి  నిదర్శనం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2001 నుంచి 2011 మధ్య 29 శాతం పట్టణ జనాభా పెరిగిందంటే ఆశ్చర్యం కలగకమానదు.  ఈ పదేళ్లలో ఇది ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.  

సాక్షి, గుంటూరు: ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తం జనాభా 2001 జనæ గణన ప్రకారం.. 44,65,144. 2011 నాటికి ఇది 48,87,813కి పెరిగింది. ఆ పదేళ్ల కాలంలో జిల్లా మొత్తం జనాభా 9.46 శాతం అంటే 4,22,669 పెరిగింది. అదే సమయంలో పట్టణ జనాభా ఏకంగా 29 శాతం అంటే 3,67,158 పెరగడం విశేషం. 2001లో జిల్లాలో మొత్తం 12 పట్టణాలు ఉండగా, 2011 నాటికి మరో పట్నం అదనంగా చేరింది. ప్రస్తుతం దాచేపల్లి, గురజాల కూడా పట్నాలుగా రూపాంతరం చెందాయి. ఎన్నో గ్రామాలు సమీపంలోని పట్టణాలు, నగరాల్లో విలీనమయ్యాయి. కరోనా వల్ల 2021లో జరగాల్సిన జన గణన చేపట్టలేదు. జనగణన పూర్తయితే పట్టణ జనాభాలో గణనీయ పెరుగుదల నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.   విద్యా, వైద్య, ఉపాధి సదుపాయాల కోసం ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యవసాయాధారిత జిల్లా. గత 20 ఏళ్లలో సాగునీటి వనరులు అభివృద్ధి చెందడంతో వాణిజ్య, ఉద్యాన పంటల సాగు గణనీయంగా పెరిగింది. గ్రామీణ రైతుల, రైతు కూలీల ఆదాయాలూ, జీవన ప్రమాణాలూ మెరుగుపడ్డాయి. ఫలితంగా సౌకర్యాలపై మక్కువ పెరిగింది. 

దీనికితోడు పల్లెవాసుల్లో విద్యకు ప్రాధాన్యం పెరిగింది. నగరాలకు వలస వెళ్తే మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని, విద్య, వైద్య, రవాణా సదుపాయాలు మెరుగ్గా ఉంటాయనే ఆలోచన గ్రామీణుల్లో బలంగా నాటుకుంది. అందుకే పల్లె ప్రజలు పట్టణాలకు రావడానికి ఆసక్తి చూపుతున్నారనే విషయం స్పష్టమవుతోంది. గుంటూరు  విద్యా కేంద్రంగా భాసిల్లుతుండటంతో ఇక్కడ జనాభా పెరుగుదల అధికంగా ఉంది. వైద్యం, ఇంజినీరింగ్, వాణిజ్య, సాంకేతిక, ఫార్మా తదితర కళాశాలలు అందుబాటులో ఉండడం కలిసొస్తోంది. ఒకప్పుడు పంచాయతీలుగా ఉన్న గ్రామాలు ఇప్పుడు నగర పంచాయతీలు, పట్టణాలుగా రూపాంతరం చెందడం పట్నం వాసంపై ప్రజల్లో ఉన్న అమితాసక్తికి సూచికగా విశ్లేషకులు చెబుతున్నారు.
   
నాటి పల్లెలు.. నేడు సరికొత్త హంగులతో..  
గతంలో పల్లెటూళ్లుగా ఉన్న రెడ్డిపాలెం, గోరంట్ల, అడివితక్కెలపాడు, పెదపలకలూరు, నల్లపాడు, బుడంపాడు, లాలుపురం, పొత్తూరు, అంకిరెడ్డిపాలెం, నాయుడుపేట, చౌడవరం, ఏటుకూరు, బొంతపాడు లాంటి గ్రామాలన్నీ ఇప్పుడు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో విలీనమయ్యాయి. ఫలితంగా పట్టణ సొబగులు అద్దుకున్నాయి. ఇస్సపాలెం, రావిపాడు, లింగంగుంట్ల గ్రామాలు దాదాపుగా నరసరావుపేట పట్టణంలో కలిసిపోయాయి. 

మెరుగైన జీవనం కోసమే..  
పట్టణాల్లో మెరుగైన విద్య, ఉపాధి, వైద్య అవకాశాలు అందుబాటులో ఉండడంతో పల్లెల్లోని ప్రజలు దగ్గర్లోని నగరాలకు వలస వెళ్తున్నారు. ఎక్కువగా మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి వర్గాలే వీరిలో అధికం. వీరికి పల్లెల్లో పెద్దగా ఆస్తులేవీ ఉండవు కాబట్టి కుటుంబ అవసరాల కోసం పట్టణాలకు వచ్చి స్థిరపడుతున్నారు.   
– డాక్టర్‌ బి నాగరాజు, మానవ వనరుల అభివృద్ది విభాగం, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 

మా పల్లె మారిపోయింది  
మాది 2001 వరకు పల్లెటూరే. 12 ఏళ్ల క్రితం గుంటూరులో విలీనమైంది. పూరి గుడిసెల స్థానంలో ఇప్పుడు బహుళ అంతస్తుల మేడలు వెలిశాయి. గతంతో పోలిస్తే భూమి ధరలు ఎన్నో రేట్లు పెరిగాయి. వ్యాపారాలు వృద్ధి చెందాయి.  
– డొక్కు కాటమరాజు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, గోరంట్ల  

పిల్లల చదువుల కోసం..
మా గ్రామంలో నాలుగు ఎకరాల పొలం ఉంది. కానీ మెరుగైన విద్య అందుబాటులో లేదు. దీంతో నా ఇద్దరు అమ్మాయిల చదువుల నిమిత్తం గుంటూరు నగరానికి వలస వచ్చాను. నగరం నుంచి గారపాడుకు వెళ్లి వస్తూ వ్యవసాయం చేస్తున్నాను. ఇక్కడ నివాసం ఉంటూ పిల్లల చదివిస్తున్నాను. పట్టణాల్లో అన్ని వసతులూ ఉంటాయి.
– బొబ్బా నాగిరెడ్డి, గారపాడు, వట్టిచెరుకూరు మండలం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top