పెరుగుతున్న పట్నవాసం

An increase of 43 percent of the population in towns over the next 11 years - Sakshi

మరో 11 ఏళ్లలో పట్టణాల్లో 43 శాతం జనాభా పెరుగుదల 

పల్లెల్లో భారీగా తగ్గుముఖం 

2031 నాటికి గ్రామాల్లో 70 లక్షల మంది తగ్గుదల 

అదే సమయంలో పట్టణాల్లో 1.33 కోట్ల మంది పెరుగుదల 

పెరిగే జనాభాకు అనుగుణంగా పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన సవాలే  

సాక్షి, అమరావతి : ఇప్పటివరకు గ్రామీణాంధ్రగా గుర్తింపు పొందిన రాష్ట్రం క్రమంగా పట్టణాంధ్రగా మారుతోంది. పల్లెవాసులు పట్టణాలకు వలస పోతుండడమే ఇందుకు ప్రధాన కారణం. ఇది ఇలాగే కొనసాగితే మరో 11ఏళ్లలో అంటే 2031 నాటికి పట్టణాల్లో జనాభా ప్రస్తుతం ఉన్న దానికంటే 43 శాతం పెరగనుంది. ఇదే సమయంలో గ్రామాల్లో భారీగా తగ్గనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో గ్రామాల్లోనే అత్యధిక జనాభా ఉంది. కానీ, 2031 నాటికి పట్టణ జనాభా పెరిగిపోయి, గ్రామీణ జనాభా తగ్గిపోయిన పక్షంలో రెండు ప్రాంతాల జనాభా మధ్యనున్న వ్యత్యాసం భారీగా తగ్గిపోనుంది. ప్రస్తుతం గ్రామీణ జనాభా 3.48 కోట్లు ఉండగా 2031 నాటికి ఇది 2.78 కోట్లకు పడిపోనుంది. అంటే 70 లక్షల జనాభా పట్టణ బాట పట్టనున్నారు. అదే సమయంలో ప్రస్తుతం పట్టణాల్లో 1.46 కోట్లుగా ఉన్న జనాభా.. 2031 నాటికి ఏకంగా 2.79 కోట్లకు చేరనుంది. అంటే ఏకంగా 1.33 కోట్ల మంది పట్టణాల్లో పెరగనున్నారు. దీంతో పట్టణ జనాభా మొత్తం2.79 కోట్లకు, గ్రామీణ జనాభా 2.78 కోట్లకు చేరుకోనుంది. ఈ రెండు ప్రాంతాల జనాభా ఇంచుమించు ఒకే స్థాయికి చేరనుంది.

పట్టణాల్లో రెట్టింపైన జనాభా
ఇదిలా ఉంటే.. గత దశాబ్ద కాలంలో గ్రామీణ జనాభా కేవలం 5 లక్షలు మాత్రమే పెరగ్గా, పట్టణాల్లో మాత్రం 2011తో పోలిస్తే రెట్టింపైంది. రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో 4.94 కోట్ల జనాభా ఉండగా.. అది 2031 నాటికి 5.57 కోట్లకు చేరవచ్చని అంచనా. మరోవైపు.. అర్బన్‌ ప్రాంతాల్లో జనాభా పెరుగుదల కారణంగా అక్కడి వారికి మౌలిక వసతులను కల్పించడం ప్రభుత్వాలకు సవాల్‌గా మారనుంది. ఎందుకంటే.. 

- పట్టణాల్లో ఇప్పటికే ఇంకా 35 లక్షల గృహాలకు మురుగు నీటి పారుదల వ్యవస్థ లేదు. 
18 లక్షల గృహాలకు పైపుల ద్వారా మంచినీటి సరఫరా సౌకర్యంలేదు. 
13,000 కిలోమీటర్ల మేర వరదనీటి, డ్రైనేజీ వ్యవస్థ లేదు. 
గత ఏడాది మేలో జరిగిన ఓ అధ్యయనం ప్రకారం పట్టణాల్లో ప్రస్తుతం ఉన్న 1.46 కోట్ల మంది జనాభాకు మౌలిక వసతుల కల్పనలో వెనుకబడి ఉన్నట్లు తేలింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top