పోరస్‌ ఫ్యాక్టరీ మూసివేత

Pollution Control Board closed Porus Laboratories Fire Accident - Sakshi

సాక్షి, అమరావతి/నూజివీడు/ముసునూరు/లబ్బీపేట/భవానీపురం: బుధవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించడంతో ఆరుగురి మృతికి కారణమైన ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలోని పోరస్‌ ల్యాబొరేటరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను మూసివేస్తూ ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులు జారీ చేసింది. నీటి (కాలుష్య నివారణ, నియంత్రణ)చట్టం 1974లోని 33ఏ, గాలి (కాలుష్య నివారణ, నియంత్రణ) చట్టం 1981ను అనుసరించి ఫ్యాక్టరీపై చర్యలు తీసుకున్నారు. విద్యుత్‌ కనెక్షన్‌ను కూడా తొలగించారు. బుధవారం రాత్రి 10.55 గంటలకు ఫ్యాక్టరీలో ప్రమాదం సంభవించడంతో గురువారం సాయంత్రం వరకు ఆరుగురు మృతి చెందడంతో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీనికితోడు పర్యావరణానికి సైతం నష్టం వాటిల్లింది.

ఈ క్రమంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. సీఎఫ్‌వో నిబంధనలు పాటించకపోవడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కాలుష్యానికి కారణమైనట్టు గుర్తించారు. ఫ్యాక్టరీలోని వ్యర్థాలను క్రమపద్ధతిలో తొలగించాలని ఆదేశాలు జారీ చేశామని కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌ ఎ.కె.పరీడా తెలిపారు. ఇదిలా ఉండగా ప్రమాద ఘటనపై గురువారం ఉదయం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులతో మాట్లాడారు. ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఇదే సమయంలో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారాన్ని పరిశ్రమ యాజమాన్యం ప్రకటించింది.   

గ్యాస్‌ లీక్‌ వల్లే మంటలు
ఫార్మాస్యూటికల్స్‌ పరిశ్రమకు సంబంధించిన ఉత్పత్తులు తయారయ్యే ఈ ఫ్యాక్టరీలోని డీబ్లాక్‌లో ఉన్న 3కేఎల్‌ సామర్థ్యం గల స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ రియాక్టర్‌లో ఒత్తిడి కారణంగా పేలుడు సంభవించి గ్యాస్‌ ఒక్కసారిగా లీకైంది. దీంతో వెంటనే మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న ఉద్యోగులు మంటల్లో చిక్కుకున్నారు. ఐదుగురు అక్కడికక్కడే సజీవ దహనమవ్వగా, మరొక వ్యక్తిని విజయవాడలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. మృతుల్లో నలుగురు బిహార్‌ రాష్ట్రం నలంద జిల్లాకు చెందినవారు. మిగిలిన ఇద్దరిలో ఒకరిది అక్కిరెడ్డిగూడెం కాగా మరొకరిది ఎన్టీఆర్‌ జిల్లా రెడ్డిగూడెం మండలం కుదప. ఈ ప్రమాదంలో ఉదురుపాటి కృష్ణయ్య (34), అవదేష్‌ రవిదాస్‌ (30), కారు రవిదాస్‌ (25), మనోజ్‌కుమార్‌ (25), సువాస్‌ రవిదాస్‌ (32), బొప్పూడి కిరణ్‌ (32) మృతి చెందారు.

వీరిలో కృష్ణయ్య కెమిస్ట్‌గా పని చేస్తున్నాడు. తీవ్రంగా గాయపడ్డ 12 మందిని తొలుత విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించారు. గురువారం కంపెనీ యాజమాన్యం అక్కడికి చేరుకుని వారిని మెరుగైన చికిత్స కోసం ఆంధ్రా ఆస్పత్రికి తరలించింది. క్షతగాత్రులను హోంమంత్రి తానేటి వనిత పరామర్శించారు. ఇక్కడ రోష¯Œ (30), సుధీర్‌ రవిదాస్‌ (30), రవి (36), వరుణ్‌దాస్‌ (30), మునారక్‌ (30), సుధీర్‌కుమార్‌ (35), జోసెఫ్‌ (30), వికారి రవిదాస్‌ (30)తో పాటు స్థానిక గ్రామాలకు చెందిన నాగేశ్వరరావు(30), ముల్లపూడి నాగరాజు (35), ఎస్‌కే సుభానీ(30) ఉన్నారు. వీరిలో ఏడుగురు బిహార్‌కు చెందిన వారు. సీహెచ్‌ రాజీవ్‌ (38)కు 5% గాయాలే కావడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందాక ఇంటికెళ్లాడు. అంతకు ముందు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆదేశించారు.  

పరిశీలించిన ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్‌ 
గురువారం స్థానిక ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్, జాయింట్‌ కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు, డీఐజీ పాల్‌రాజు, ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ తదితరులు ఘటన స్థలిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాల గురించి ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు. తక్షణ సాయంగా రూ.లక్ష అందించనున్నట్టు తెలిపారు.

వాల్వ్‌ సరిగా లేనందునే ప్రమాదం!
ఫ్యాక్టరీ దుర్ఘటనకు గ్యాస్‌ లీకే కారణంగా ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు ఫ్యాక్టరీ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ వర్మ ‘సాక్షి’కి వెల్లడించారు. రియాక్టర్‌ వద్ద వాల్వ్‌ సరిగా కట్టకపోవడం వల్ల గ్యాస్‌ లీక్‌ కావడంతో ఉష్ణోగ్రతలు పెరిగి రియాక్టర్‌ పేలి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సేకరించిన వస్తువులను తదుపరి పరీక్షల కోసం ల్యాబొరేటరీకి పంపామని, నివేదిక వచ్చాక వాస్తవ కారణాలు తెలుస్తాయన్నారు. పాలిమర్స్‌ గ్రాన్యూల్స్‌ తయారీలో వినియోగించే 4ఎంపీఐ పౌడర్‌ను ఇక్కడ తయారు చేస్తున్నారు. 4వ రియాక్టర్‌లో 1,500 కేజీలకుపైగా పాథలిక్‌ ఎన్‌హైడ్రేడ్‌ అనే కెమికల్‌ కాంపౌండ్‌ తయారీలో భాగంగా మిథేల్‌మెన్‌ అనే రసాయనాన్ని పంపుతున్నప్పుడు ఉష్ణోగ్రత పెరిగి రియాక్టర్‌ పేలినట్లుగా తెలుస్తోంది.  
మృతి చెందిన బిహార్‌ వాసుల బంధువులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్, ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ 

ప్రధాని మోదీ సంతాపం
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గవర్నర్‌
సాక్షి, న్యూఢిల్లీ, అమరావతి: ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇదే ఘటనపై రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారని రాజ్‌భవన్‌ వర్గాలు గురువారం ఓ ప్రకటనలో తెలిపాయి.  

అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్‌ దిగ్భ్రాంతి
ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెం పోరస్‌ ఫ్యాక్టరీలో బుధవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారంగా ప్రకటించారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్‌ను, ఎస్పీని ముఖ్యమంత్రి ఆదేశించారు. గాయపడిన వారికి పూర్తి స్థాయిలో వైద్య సహాయం అందించాలని చెప్పారు. ఇదిలా ఉండగా, ఈ ప్రమాదంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ ఆరా తీశారు. ఏలూరు జిల్లా కలెక్టర్‌ వి.ప్రసన్న వెంకటేష్‌తో గురువారం ఫోన్లో మాట్లాడారు. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top