
తాడిపత్రికి వెళ్లకుండా పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు
‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’కు హాజరుకాకుండా హౌస్ అరెస్ట్
తిమ్మంపల్లిలోని ఇంటి నుంచి మాజీ ఎమ్మెల్యేను కదలనీయని పోలీసులు
హైకోర్టు ఆదేశాలను పోలీసులు ధిక్కరిస్తున్నారు: పెద్దారెడ్డి
యల్లనూరు: తన నియోజకవర్గ కేంద్రమైన తాడిపత్రికి వెళ్లకుండా వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో శుక్రవారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ కార్యక్రమం ఏర్పాటుచేశారు.
దానిలో పాల్గొనేందుకు అనుచరులతో కలిసి పెద్దారెడ్డి యల్లనూరు మండలం తిమ్మంపల్లిలోని స్వగృహం నుంచి బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. అయితే, తెల్లవారుజామునే పెద్ద ఎత్తున పెద్దారెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు, ఆయన వెళ్లకుండా అడ్డుకున్నారు. పెద్దారెడ్డి కారుకు పోలీసు వాహనాలను అడ్డుపెట్టారు. ఆయనను గృహనిర్బంధం చేశారు.
పోలీసుల తీరుపై పెద్దారెడ్డి మండిపాటు
తనను తాడిపత్రికి వెళ్లకుండా 14 నెలల నుంచి పోలీసులు అడ్డుపడుతున్నారని పెద్దారెడ్డి మండిపడ్డారు. ‘మీరేమైనా ప్రభాకర్‌రెడ్డి వద్ద పని చేస్తున్నారా? నేను యల్లనూరు పోలీస్‌స్టేషన్‌కు వస్తా. నన్ను తాడిపత్రికి తీసుకెళ్లేంత వరకు స్టేషన్‌లోనే ఉంటా. నన్ను తాడిపత్రిలోకి రానివ్వనని జేసీ ప్రభాకర్‌రెడ్డి చెబుతుంటే మీరు (పోలీసులు) ఆయనకు కొమ్ముకాస్తున్నారు.’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
తాడిపత్రికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాల్సిందేనంటూ పెద్దారెడ్డి దాదాపు మూడు గంటలపాటు రోడ్డుపై బైఠాయించారు. అనంతరం పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాడిపత్రిలో నియంత పాలన సాగుతోందని మండిపడ్డారు. ‘నేను తాడిపత్రి వెళ్లేందుకు రక్షణ కల్పించాలని పోలీసులకు హైకోర్టు ఆర్డర్ ఇచి్చంది. ఆ ఆర్డర్‌ను పోలీసులు ధిక్కరిస్తున్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి కనుసన్నల్లో తాడిపత్రిలో మర్డర్లు, పేకాట, మట్కా, గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి.’ అని పెద్దారెడ్డి అన్నారు.
జేసీ తానా... తాడిపత్రి పోలీసుల తందానా!
సాక్షి టాస్క్ ఫోర్స్: అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి తానా అంటే... పోలీసులు తందానా... అంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ముగ్గురు ఐపీఎస్ అధికారులు విధులు నిర్వర్తిస్తున్నా ఒక మాజీ ఎమ్మెల్యే తన నియోజకవర్గ కేంద్రానికి వెళ్లడానికి భద్రత కల్పించలేకపోతున్నారు. డీఐజీ, ఎస్పీతోపాటు తాడిపత్రి ఏఎస్పీగా ఉన్న రోహిత్‌కుమార్ చౌదరి కూడా ఐపీఎస్ అధికారే. అయినా జేసీ ప్రభాకర్‌రెడ్డి చట్టమే తాడిపత్రిలో అమలవుతోంది.
చివరకు తాడిపత్రిలో టెండర్ ద్వారా మద్యం షాపులు పొందిన విజయవాడకు చెందిన వారికి అద్దెకు రూములు కూడా ఇవ్వనివ్వడం లేదు. దీంతో ఇప్పటికీ రెండు షాపులు తెరచుకోలేదు. మరోవైపు అధికారులను జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎంత పరుష పదజాలంతో దూషిస్తున్నారో అందరికీ తెలిసిందే. ఆయన వైఖరి వల్ల జిల్లాలో పని చేసేందుకు అధికారులు ఎవరూ ముందుకు రావడంలేదు. తాజాగా జిల్లా పంచాయతీ అధికారి నాగరాజునాయుడును దారుణంగా దూషించారు.
మరోసారి జేసీ గూండాగిరి
తాడిపత్రిటౌన్: తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి నిత్యం ఏదో ఒక గొడవ సృష్టిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారు. తాజాగా శుక్రవారం తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ నియోజకవర్గ స్థాయి కార్యక్రమం ఏర్పాటు చేసింది. అక్కడ ఉద్రిక్తత సృష్టించేందుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రయత్నించారు.
వైఎస్సార్‌సీపీ పాత కార్యాలయంలో కార్యక్రమం కొనసాగుతుండగా, సంజీవనగర్‌లోని తన ఇంటి నుంచి జేసీ అనుచరులతో కలసి కర్రలు చేతపట్టుకుని నడుచుకుంటూ అక్కడికి బయలుదేరారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన అనుచరులను పోలీసులు మధ్యలోనే అడ్డుకుని వెనక్కి పంపారు. జేసీ అనాగరిక చర్యలపై వైఎస్సార్‌సీపీ నాయకులు అనంత వెంకటరామిరెడ్డి, సాకే శైలజానాథ్ మండిపడ్డారు.