
బీసీ నేత, మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌పై కక్ష సాధింపు కుతంత్రం
వైఎస్సార్‌సీపీ నేత శ్రీకాంత్‌ను భయపెట్టి తప్పుడు వాంగ్మూలం తీసుకున్న పోలీసులు
అసలు మైనింగే జరక్కపోయినా జరిగినట్లు అక్రమ కేసులు
పోలీసులు నమోదు చేసిన తప్పుడు వాంగ్మూలంపై న్యాయమూర్తికి ఫిర్యాదు చేసిన శ్రీకాంత్‌రెడ్డి
రాత్రంతా స్టేషన్‌లో ఉంచి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తామని భయపెట్టారని ఆవేదన
అనిల్‌కుమార్ యాదవ్ పేరు చెప్పాలని ఒత్తిడి చేసి.. వాళ్లే స్టేట్‌మెంట్ రాసుకున్నారని వెల్లడి
పోలీసుల తీరుపై మండిపడిన న్యాయమూర్తి
న్యాయస్థానంలో మళ్లీ శ్రీకాంత్ వాంగ్మూలం రికార్డు
ఇదే కేసులో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి కాకాణి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/నెల్లూరు(లీగల్): కూటమి ప్రభుత్వ వైఫల్యాలతోపాటు 12నెలలుగా టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అక్రమాలపై పోరాడుతున్న ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ నాయకులే లక్ష్యంగా సర్కారు కుట్రలకు తెగబడుతోంది. అసత్యాలతో భేతాళ కథలల్లి కక్షసాధింపులకు దిగుతోంది. ఏదో ఒక రకంగా నరకం చూపేందుకు శతవిధాలా యత్నిస్తోంది. దీనిలో భాగంగానే అసలు మైనింగే జరగని రుస్తుం మైన్స్‌లో ఏదో జరిగిపోయిందంటూ పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారు.
ప్రతిపక్ష నేతలను ఒక్కొక్కరిని అరెస్టు చేస్తున్నారు. తొలుత ముగ్గురిపై కేసు నమోదు చేయడంతో వారు కోర్టుకెళ్లి ముందుస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఈ కేసులో మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని ఏ–4గా సర్కారు ఇరికించింది. ఆయనను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపింది. ఏ–5గా టీడీపీ నేత కృష్ణంరాజు పేరు చేర్చి మరో ముగ్గురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించింది. తాజాగా బీసీ నేత, మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌ను కేసులో ఇరికించేందుకు యత్నిస్తోంది.
ఏదోరకంగా ఆయనను అరెస్టు చేయాలని తలస్తోంది. ఆయన అనుచరులనూ ఇరికించేందుకు కుయుక్తులు పన్నుతోంది. దీనికోసం ఏ–12వ నిందితుడిగా బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డిని చేర్చి అక్రమంగా అరెస్టు చేసింది. అతన్ని బెదిరించి మాజీమంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ పాత్ర ఉందని చెప్పాలంటూ పోలీసులు శ్రీకాంత్‌రెడ్డిని భయపెట్టి వాంగ్మూలం వారే రాసుకుని సంతకం తీసుకున్నారు. ఈ విషయాన్ని బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి న్యాయమూర్తి ఎదుట చెప్పడంతో ప్రభుత్వ కుతంత్రం బట్టబయలైంది. శ్రీకాంత్ రెడ్డి నుంచి న్యాయమూర్తి మళ్లీ వాంగ్మూలాన్ని తీసుకుని రికార్డు చేయించారు.
కేసు పూర్వాపరాలు ఇవీ..
పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామ సర్వే నంబర్లు 697, 699,751/2, 759/1, 759/2, 924, 925ల్లోని ప్రభుత్వ భూముల్లో 32.71 ఎకరాల విస్తీర్ణంలో రుస్తుం మైనింగ్‌కు 2016 ఏప్రిల్ నెల వరకే అనుమతులు ఉన్నాయి. లీజు గడువు పూర్తవ్వడంతో యజమాని సైతం వదిలేశారు. అక్కడ మైనింగే జరగలేదు.
2023 డిసెంబర్‌లో అక్రమ మైనింగ్ జరుగుతోందని ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఫిర్యాదు చేయడంతో మైనింగ్ శాఖాధికారులు జాయింట్ తనిఖీ నిర్వహించారు. అసలు అక్కడ మైనింగ్ జరిగిన ఆనవాళ్లే లేవని, ఈ ప్రాంతంలో ఫెల్డ్‌స్పార్, క్వార్ట్జ్ మిశ్రమం కలిసిన పాత నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ఎక్కడా యంత్రాలు పెట్టి తవ్వకాలు చేసినట్లు ఆనవాళ్లు కన్పించలేదు.
రెండు శాశ్వత భవనాలు పాడుబడి ఉన్నట్లు గుర్తించి ఆ మేరకు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఆ తర్వాత రెండు నెలల వ్యవధిలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం, ప్రభుత్వం మారడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల తర్వాత రుస్తుం మైన్‌లో అక్రమ మైనింగ్ జరిగినట్లు మైనింగ్ డీడీతో ఫిర్యాదు చేయించి వైఎస్సార్‌సీపీ నేతలను ఆ కేసుల్లో ఇరికించి జైలుకు పంపుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 12 మందిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు. తాజాగా ఈ కేసులో ఎలాంటి సంబంధంలేని మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్, ఆయన అనుచరులను ఇరికించే యత్నాలు చేస్తున్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకేనా?
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డిని టార్గెట్ చేసి ఈ అక్రమ కేసు నమోదు చేశారు. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే ఏ–5గా టీడీపీ నేతను చేర్చిన పోలీసులు ఇప్పటి వరకు ఆయన్ను అరెస్ట్ చేయలేదు. ఇటీవలి కాలంలో కాకాణి రిమాండ్‌లో ఉండడంతో మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ తరచూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుండడంతో ఆయననూ టార్గెట్ చేశారు.
ఈ నేపథ్యంలోనే కేసుతో అసలు సంబంధం లేని వైఎస్సార్‌సీపీ నేత బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డిని నిందితుడిగా చేర్చి సోమవారం హైదరాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను నెల్లూరు తీసుకొచ్చి భయపెట్టి బలవంతంగా తప్పుడు వాంగ్మూలం తీసుకున్నారు. అనిల్‌కుమార్, ఆయన అనుచరుల పాత్ర ఉన్నట్లు చెప్పినట్లు రికార్డు చేశారు. దీంతో రెండు రోజుల్లోనే అనిల్‌కుమార్‌యాదవ్ అరెస్టుకు తెగబడే ఆస్కారం ఉందనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది.
రాత్రంతా వేధించారు.. థర్డ్‌డిగ్రీ అని భయపెట్టారు
వైఎస్సార్‌సీపీ నేత బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన్ను రాత్రంతా పోలీస్‌స్టేషన్‌లో ఉంచి వేధించారు. అర్ధరాత్రి సమయంలో థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తామని భయపెట్టి తప్పుడు వాంగ్మూలం తీసుకున్నారు. ఈ విషయాన్ని గూడూరు ఇన్‌చార్జి న్యాయమూర్తి బీవీ సులోచనారాణి ఎదుట మంగళవారం శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు.
అనిల్‌కుమార్ పాత్ర ఉందని చెప్పాలంటూ బెదిరించారని, స్టేట్‌మెంట్‌ను వాళ్లే రాసుకుని తనను చదవనివ్వకుండానే భయపెట్టి సంతకం తీసుకున్నారని శ్రీకాంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాంత్‌రెడ్డి వేదనను సావధానంగా విన్న న్యాయమూర్తి పోలీసుల తీరుపై మండిపడ్డారు. శ్రీకాంత్‌రెడ్డి వాంగ్మూలాన్ని మళ్లీ న్యాయమూర్తి రికార్డు చేయించారని న్యాయవాది ఉమామహేశ్వరరావు తెలిపారు.
శ్రీకాంత్‌రెడ్డికి అస్వస్థత
ఇదిలా ఉంటే బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి సోమవారం రాత్రి పోలీసుల వేధింపులు, బెదిరింపులకు తాళలేక అస్వస్థతకు గురయ్యారు. రాత్రంతా డీఎస్పీ కార్యాలయంలోనే ఉంచడంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. అస్వస్థతకు గురైన శ్రీకాంత్‌రెడ్డిని హుటాహుటిన నెల్లూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం గూడూరు కోర్టుకు తరలించారు. న్యాయమూర్తి సులోచనరాణి ఎదుట శ్రీకాంత్‌రెడ్డి తన గోడు వెళ్లబోసుకున్నారు. ఇరుపక్షాల వాదనల అనంతరం న్యాయమూర్తి శ్రీకాంత్‌రెడ్డికి ఆగస్టు 4 వరకు రిమాండ్ విధించారు.