
విజయవాడ: పోలవరం- బనకచర్ల ప్రాజెక్ట్ ప్రతిపాదన తిరస్కరణకు గురైంది. పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్ ప్రతిపాదనను కేంద్ర పర్యావరణ నిపుణల కమిటీ వెనక్కి పంపింది. దీనికి సంబంధించి సీడబ్యూసీ అనుమతి తీసుకోకపోవడంతో ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. దాంతో బనకచర్లకు ఆమోదం సాధించడంలో చంద్రబాబు సర్కారు ప్రభుత్వం విఫలమైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో కూటమి భాగస్వామిగా ఉన్న ఏపీ ప్రభుత్వం అనుమతి మాత్రం సాధించలేకపోయింది.
కాగా, ‘పోలవరం - బనకచర్ల’ ప్రాజెక్టుపై కేంద్రం ముందుకు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. పోలవరం నుంచి బనకచర్లకు నీటి తరలింపు ప్రాజెక్టుపై కేంద్ర పర్యావరణ నిపుణల కమిటీకి వివరాలు అందించారు. అయితే సీడబ్యూసీ అనుమతి తీసుకోకుండానే ప్రతిపాదన పంపించారు. ఫలితంగా ప్రతిపాదనను పర్యావరణ నిపుణుల కమిటీ తిరస్కరించి దానిని వెనక్కి పంపించింది.
ఇది బీఆర్‌ఎస్, తెలంగాణ ప్రజల విజయం: హరీష్‌రావు
పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్ ప్రతిపాదనను పర్యావరణ నిపుణుల కమిటీ తిరస్కరించడంపై బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు స్పందించారు. బనకచర్లపై నిపుణుల కమిటీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఇది బీఆర్‌ఎస్, తెలంగాణ ప్రజల విజయంగా ఆయన పేర్కొన్నారు. గోదావరి జలాలను తరలించే కుట్రకు ఇది చెంపపెట్టన్నారు. బనకచర్ల ప్రాజెక్టును ఆపే వరకూ పోరాడతామన్నారు హరీష్.