
ప్రాజెక్టుకు అనుమతిస్తే ఆ రోజు నుంచే కృష్ణా జలాలను అదనంగా వాడుకుంటామని కేంద్రానికి మహారాష్ట్ర, కర్ణాటక లేఖ
విదర్భ, మరఠ్వాడలకు గోదావరి వరద జలాల మళ్లింపునకు అనుమతిఇవ్వాలని మహారాష్ట్ర ప్రతిపాదన
ఆ ప్రాజెక్టు వల్ల తమ హక్కులకు విఘాతమంటూ తెలంగాణ సీఎం లేఖ
బేసిన్‌లోని రాష్ట్రాలను సంప్రదించే ఆ ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకుంటామన్న కేంద్రం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చిన రోజు నుంచే.. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం కృష్ణా జలాల్లో తమకు అదనంగా దక్కే వాటా నీటిని వినియోగించుకుంటామని కేంద్రానికి మహారాష్ట్ర సర్కార్ తేల్చిచెప్పింది. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావుకు మహారాష్ట్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ సవితా బోధేకర్ ఈ నెల 8న లేఖ రాశారు. పోలవరం ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ.. కృష్ణా జలాల్లో అదనంగా తమకు 14 టీఎంసీలు, కర్ణాటకకు 21 టీఎంసీలు వాడుకోవడానికి గోదావరి ట్రిబ్యునల్ అనుమతిచ్చిందని గుర్తు చేశారు.
గోదావరి నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 243 టీఎంసీలు తరలించేలా ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అనుమతిస్తే.. అదే రోజు నుంచి కృష్ణా జలాలను గోదావరి ట్రిబ్యునల్ కేటాయించిన దామాషా ప్రకారం అదనంగా వాడుకుంటామని తెలిపారు. ఇక ఎన్‌డబ్ల్యూడీఏ(జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ) ప్రతిపాదించిన గోదావరి–కావేరి అనుసంధానానికి అనుమతిస్తే.. మళ్లించే గోదావరి జలాలను బట్టి దామాషా పద్ధతిలో కృష్ణా జలాలను అదనంగా వాడుకుంటామని స్పష్టం చేశారు.
గోదావరి–బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతి కోసం ప్రీ ఫీజుబులిటీ రిపోర్ట్(పీఎఫ్‌ఆర్)ను మే 22న సీడబ్ల్యూసీకి ఏపీ ప్రభుత్వం సమర్పించింది. జూన్ 11న మహారాష్ట్ర సర్కార్ అభిప్రాయాన్ని కోరుతూ సీడబ్ల్యూసీ లేఖ రాసింది. మహారాష్ట్ర స్పందిస్తూ.. పోలవరం–బనకచర్లకు అనుమతి ఇచ్చిన రోజు నుంచే గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం కృష్ణా జలాల్లో తమకు వచ్చే అదనపు వాటా జలాలను వాడుకుంటామని స్పష్టం చేసింది. పోలవరం–బనకచర్లకు అనుమతి ఇస్తే.. తమ రాష్ట్రంలో దుర్భిక్ష ప్రాంతాలైన విదర్భ, మరఠ్వాడ ప్రాంతాలకు గోదావరి వరద జలాలను మళ్లించే ప్రాజెక్టులకు అనుమతివ్వాలని కేంద్రాన్ని కోరింది.
ఇక పోలవరం–బనకచర్లకు అనుమతి ఇచ్చిన రోజు నుంచే గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం కృష్ణా జలాలను అదనంగా 64.75 టీఎంసీలు వాడుకుంటామని కేంద్ర జల్ శక్తి శాఖకు గత నెల 17న కర్ణాటక సర్కార్ లేఖ రాసింది. గోదావరి జలాల్లో తమ వాటా 1,000 టీఎంసీలని.. పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు వల్ల తమ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని, అనుమతి ఇవ్వొద్దంటూ కేంద్రానికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి జూన్ 19న లేఖ రాశారు.
దీనిపై కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ స్పందిస్తూ.. బేసిన్ పరిధిలోని రాష్ట్రాలను సంప్రదించాకే ఆ ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకుంటామని తేల్చిచెప్పారు. ఈ మేరకు గత నెల 23న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ఆ లేఖను ఏపీ పభుత్వం శనివారం మీడియాకు విడుదల చేసింది. ఈ పరిణామాలను బట్టి చూస్తే.. పోలవరం–బనకచర్ల అంతర్రాష్ట్ర జల వివాదంగా మారుతోందన్నది స్పష్టమవుతోంది.