వైభవంగా పోలమాంబ అనుపోత్సవం  | Polamamba Mahotsavam In Parvathipuram Manyam District | Sakshi
Sakshi News home page

వైభవంగా పోలమాంబ అనుపోత్సవం 

Jan 26 2023 4:57 PM | Updated on Jan 26 2023 5:24 PM

Polamamba Mahotsavam In Parvathipuram Manyam District - Sakshi

మక్కువ(పార్వతీపురం మన్యం): ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, భక్తుల ఆరాధ్యదైవం శంబర పోలమాంబ అమ్మవారి అనుపోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 9.45 గంటలకు గ్రామ ప్రధాన రహదారిలో ఉన్న అమ్మవారి గద్దె వద్దకు చేరిన ఘటాలకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రధానాలయం సమీపంలో ఉన్న యాత్రాస్థలం వద్ద  ట్రస్టు బోర్డుచైర్మన్‌ పూడి దాలినాయుడు, ట్రస్టుబోర్డు మాజీ చైర్మన్లు గంజి కాశినాయుడు, వసంతుల భాస్కరరావు, ఎంపీటీసీ సభ్యుడు తీళ్ల పోలినాయుడు, ఉపసర్పంచ్‌ అల్లు వెంకటరమణ, రెవిన్నాయుడు, పూడి, కరణం, కుప్పిలి, గిరిడ కుటంబాల సభ్యులు, గ్రామపెద్దలు, భక్తులు ఘటాలకు పూజలు చేశారు.

అమ్మవారి ఉయ్యాలకంబాల ఉత్సవాన్ని నిర్వహించారు. అక్కడ నుంచి వనంగుడికి బయల్దేరిన అమ్మవారి ఘటాలకు దారి పొడవునా భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. చిన్నారులపైనుంచి ఘటాలను దాటించారు. యాత్రాస్థలం నుంచి సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న వనంగుడికి కాలినడకన అమ్మవారి ఘటాలను తీసుకెళ్లగా వందలాది మంది భక్తులు తరలివెళ్లారు. తప్పెటగుళ్లు, మహిళల కోలాట ప్రదర్శన, పోతిరాజు వేషధారణలు భక్తులను అలరించాయి. వనంగుడి వద్దకు చేరుకున్న ఘటాలను ఆలయం చుట్టూ మూడుసార్లు ప్రదక్షణ చేశారు. వనంగుడిలో అమ్మవారి ఘటాలను ఉంచిన తర్వాత పూజారి రామారావు గుడి చుట్టూ మూడుసార్లు తిరిగి కట్లువేశారు. ఈ నెల 31వ తేదీన పోలమాంబ అమ్మవారి మారుజాతర నిర్వహించనున్నారు. 

అమ్మవారి సేవలో భక్తజనం    
ప్రధానాలయంలో ఉన్న పోలమాంబ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచి బారులు తీరారు. గోముఖి నదిలో పుణ్యస్నానాలాచరించి అమ్మవారికి చీరలు, గాజులు, కోళ్లను చూపించి మొక్కుబడులు చెల్లించారు. ఈఓ వి.రా ధాకృష్ణ భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకున్నారు. ఎంపీడీఓ పి.దేవకుమార్‌ పర్యవేక్షణలో గ్రామంలో పారిశుద్ధ్య పనులు చురుగ్గా సాగుతున్నాయి. గ్రామంలో ఏర్పాటుచేసిన  వైద్యశిబిరాలను అనుపోత్సవం రోజున కూడా కొనసాగించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement