ఎమ్మెల్యే చెవిరెడ్డికి ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం

Place In Asian Book of Records for Chevireddy Bhaskar Reddy - Sakshi

1.24 లక్షల మట్టి వినాయక ప్రతిమల తయారీ

నియోజకవర్గంలో ఇంటింటికీ ఉచితంగా పంపిణీ

తిరుపతి రూరల్‌: ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ప్రతిష్టాత్మక  ‘ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌‘లో స్థానం లభించింది. పర్యావరణ హితాన్ని కోరుతూ 1.24 లక్షల మట్టి విగ్రహాలను తయారు చేయించడంతో పాటు ప్రజలకు ఉచితంగా ఇంటింటికీ అందిస్తున్న ఆయన అవార్డుకు అర్హత సాధించారు. శనివారం తిరుపతి రూరల్‌ మండలం చిగురువాడ అకార్డ్‌ స్కూల్‌ ఆవరణలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం ఎమ్మెల్యే చెవిరెడ్డి చేస్తున్న కృషిని గుర్తిస్తూ ‘ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ సంస్థ ప్రతినిధులు అవార్డుతో పాటు గోల్డ్‌ మెడల్, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అంతేకాకుండా తమ సంస్థ శాశ్వత సభ్యత్వాన్ని కూడా ఉమాశంకర్‌ అందించారు. 

ఏటా కొనసాగిస్తాం: ఎమ్మెల్యే చెవిరెడ్డి
దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో 1.24 లక్షల మట్టి విగ్రహాలు ఎక్కడికక్కడ తయారు చేసి పంపిణీ చేస్తున్నట్టు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వివరించారు. ఏటా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. పదేళ్లుగా చంద్రగిరి నియోజకవర్గంలో మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా ప్రతి ఇంటికి పంపిణీ చేస్తున్నామన్నారు.

కార్యక్రమంలో తుడా వీసీ హరికృష్ణ, కార్యదర్శి లక్ష్మి, వెస్ట్‌ డీఎస్పీ నరసప్ప, అకార్డ్‌ స్కూల్‌ చైర్మన్‌ చంద్రశేఖర్‌ రెడ్డి, డైరెక్టర్లు ప్రశాంత్, వివేక్‌ పాల్గొన్నారు. కాగా,  ‘మట్టి వినాయకుని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ ను నిషేధిద్దాం’ అంటూ ప్లకార్డ్‌లు చేత బట్టి విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డితో పాటు తుడా వీసీ హరికృష్ణ ప్లకార్డులు చేతబట్టి ర్యాలీలో పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top