ఖనిజ లీజులకు దశల వారీగా ఈ–వేలం

Phase-wise e-auction of mineral leases Andhra Pradesh - Sakshi

తొలి దశలో 35, రెండో దశలో 27 లీజులకు ఈ–వేలం

ఎక్కువ గనుల్ని ఆపరేషన్‌లోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిన్న తరహా ఖనిజాల తవ్వకానికి గనులను లీజుకిచ్చేందుకు ప్రభుత్వం దశల వారీగా నిర్వహిస్తున్న ఈ–వేలం ప్రక్రియ విజయవంతంగా జరుగుతోంది. తొలి దశలో గ్రానైట్‌ మినహా మిగిలిన చిన్న తరహా ఖనిజాల లీజులకు మంచి స్పందన లభించింది. 35 లీజులకు నిర్వహించిన ఈ–వేలంలో రూ. 16 కోట్ల ఆదాయం లభించింది. రెండో దశలో 27 లీజులకు ఈ–వేలం ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది.

ఇప్పటి వరకు 20 లీజులకు వేలం పూర్తయింది. వారం రోజుల్లో మిగిలిన 7 లీజులకు ఈ–వేలం పూర్తి చేస్తామని మైనింగ్‌ డైరెక్టర్‌ వీజీ వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా లీజు పొంది పని చేయకుండా ఉన్న 2,724 చిన్న తరహా గనులను ఆపరేషన్‌లోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ–వేలం విధానాన్ని ప్రారంభించారు. సీఎం చొరవతో ఈ–వేలానికి సుమారు 700 గనులు ఆపరేషన్‌ చేయడం ప్రారంభించాయి. ఈ లీజుల్లో ఎక్కువ క్వార్ట్‌జ్, బ్లాక్‌ గ్రానైట్, బెరైటీస్, సిలికాశాండ్, ప్రొఫలైట్‌ ఖనిజాలు ఎక్కువ ఉన్నాయి. మిగిలిన వాటికి ఈ–వేలం నిర్వహించి తవ్వకాలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు.

గతంలో ఉన్న మైనింగ్‌ విధానం ప్రకారం లీజు దరఖాస్తులు సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉండిపోయేవి. లీజులు తీసుకున్న వారిలో ఎక్కువ మంది తవ్వకాలు జరపకుండా వదిలేయడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. అనుమతిచ్చిన ఈ లీజుల్లో తవ్వకాలు చేయకపోవడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం నిలిచిపోవడంతో పాటు, మైనింగ్‌ ఆధారిత పరిశ్రమలకు ముడిసరుకు కొరత ఏర్పడింది.

ఈ నేపథ్యంలో తవ్వకాలు జరపని క్వారీలకు ఒక అవకాశం ఇచ్చి చూశారు. సద్వినియోగం చేసుకోని లీజులను రద్దు చేసి వాటికి ఈ–వేలం నిర్వహిస్తున్నారు. దశల వారీగా 6 నెలల్లో వెయ్యి లీజుల్లో తవ్వకాలు ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీటి ద్వారా ప్రభుత్వ ఆదాయం రూ. 500 కోట్ల మేర పెరిగే అవకాశం ఉందని గనుల శాఖ అంచనా వేస్తోంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top