Ongole: ఇది ఖైదీల బంక్‌..! రోజుకు రూ.5 లక్షల అమ్మకాలు..

Petrol Bunk For Prisoners In Ongole Sales Over Rs 5 Lakh Per Day - Sakshi

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు సంతపేట­లోని జిల్లా జైలు వద్ద ఏర్పాటు చేసిన పెట్రోల్‌ బం­క్‌ను ఖైదీలే నిర్వహిస్తున్నారు. వాహనాల్లో పెట్రోల్, డీజిల్‌ నింపేవారు.. వాహనాలకు గాలి పట్టే వారితోపాటు క్యాష్‌ కౌంటర్‌లో ఉండే వ్యక్తి వరకు అందరూ జీవిత ఖైదు అనుభవిస్తున్న వా­రే కావడం విశేషం. 2018లో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ బంక్‌ ఏర్పాటు చేయగా.. ఈ బంక్‌లో స్రత్పవర్తనతో పని చేయడం ద్వారా ఏడుగురు ఖైదీలు శిక్ష తగ్గి ఇళ్లకు వెళ్లిపోయారు. మరో నలుగురికి సైతం శిక్షలు తగ్గి ఇళ్లకు వెళ్లేందుకు అర్హత సాధించారు.

ప్రస్తుతం ఇందులో 10 మంది పని చేస్తున్నారు. నిత్యం రూ.5 లక్షల విలువైన పెట్రో­ల్, డీజిల్‌ అమ్మకాలు జరుగుతున్నాయి. ఇక్కడ పని చేసినందుకు గాను ప్రతి ఖైదీ రోజుకు రూ.­200 ఆదాయాన్ని కూడా సమకూర్చుకుంటున్నారు. ఈ బంక్‌ ద్వారా జైళ్ల శాఖకు నెలకు సుమా­రు రూ.2.50 లక్షల వరకు ఆదాయం సమకూరుతోంది.  

ఇక్కడ పనిచేస్తే మంచి మార్కులు
జీవిత ఖైదీలుగా శిక్ష అనుభవిస్తూ మంచి ప్రవర్తనతో మెలుగుతున్న వారిని మాత్రమే ఆరు బయ­ట ఖైదీలుగా ఎంపిక చేసి పెట్రోల్‌ బంక్‌లో పనిచే­సే అవకాశం కల్పిస్తోంది జైళ్ల శాఖ. బంక్‌లో నెల రోజులపాటు ఖైదీలు పనిచేస్తే 8 రోజుల చొప్పున శిక్ష తగ్గుతుంది. ఎన్ని నెలలు పనిచేస్తే అన్ని నెలలపాటు 8 రోజుల చొప్పున తగ్గించుకుంటూ వెళతారు. దీంతోపాటు ప్రత్యేకంగా సంవత్సరంలో మరో 30 రోజుల శిక్ష తగ్గించే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తోంది.

రాష్ట్ర ఉన్నతాధికారులు సైతం ప్రత్యేకంగా మరో 60 రోజులపాటు శిక్షను తగ్గించే వెసులుబాటు ఉంది. పెరోల్‌పై 14 రోజుల పాటు ఖైదీలు తమ ఇళ్లకు వెళ్లి శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. ఆ కాలాన్ని కూడా శిక్షలో తగ్గించేలా వెసులుబాటు కలి్పస్తారు. మొత్తం మీద శిక్షపడిన మూడేళ్ల నుంచి ఈ తగ్గింపు శిక్ష కార్యక్రమాన్ని అమల్లోకి తెస్తారు. మొత్తం మీద శిక్షను తగ్గించే వెసులుబాటు విధించిన శిక్ష కంటే మూడో వంతుకు తక్కువగా ఉంటుంది.
ద్విచక్ర వాహనాలకు గాలి పడుతున్న ఖైదీ సుబ్బయ్య  

స్రత్పవర్తనతో మెలుగుతున్నా 
హత్య కేసులో నాకు శిక్ష పడింది. ఇప్పటికే పదేళ్లుగా శిక్ష అనుభవిస్తున్నాను. మంచి ప్రవర్తనతో మెలుగుతుండటంతో ఇక్కడి అధికారులు పెట్రోల్‌ బంక్‌లో పనిచేసే అవకాశం కల్పించారు.  
– డి.సుధాకర్, చీరాల, జీవిత ఖైదీ

పశ్చాత్తాప పడుతున్నా 
క్షణికావేశంలో తప్పు చే­శా. కుటుంబాలకు దూర­మై బాధ పడుతున్నాం. జీవితంలో ఎలాంటి త­ప్పు చేయకూడదని నిర్ణయించుకున్నా. ఖైదీ­లతోపాటు వారి కుటుంబాలు కూడా ఇళ్ల వద్ద ఉండి శిక్ష అనుభవిస్తున్నాయి. శిక్ష పడి ఏడేళ్లు పూర్తయింది. మంచి ప్రవర్తనతో మెలగడంతో పెట్రోల్‌ బంక్‌లో పనిచేసే అవకాశం కలిగింది. 
– జి.సుబ్బయ్య, అర్ధవీడు, జీవిత ఖైదీ    

పరివర్తన తీసుకొచ్చే దిశగా.. 
ఈ బంక్‌లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మూడు షిఫ్టుల్లో ఖైదీలు పని చేస్తారు. శిక్ష అనుభవిస్తున్న వారిలో పరివర్తన తీసుకొచ్చేలా తీర్చిదిద్దుతున్నాం. వారి ప్రవర్తనను బట్టి ఆరుబయట ఖైదీలుగా మెలిగే వెసులుబాటు కల్పిస్తున్నాం. జీవిత ఖైదు అనుభవిస్తున్న వారిని మంచి ప్రవర్తనను బట్టి మార్కులు వేస్తాం. తదనుగుణంగా వారి శిక్షాకాలం తగ్గుతుంది. 
– పి.వరుణారెడ్డి, జైలు సూపరింటెండెంట్‌
చదవండి: ఓర్చుకోలేక.. ‘ఈనాడు’ విషపు రాతలు.. సీమను సుభిక్షం చేస్తున్నదెవ్వరు?

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top