చంద్రబాబు పాలనలో ప్రజలకు రక్షణ కరువు | People are facing a shortage of protection under Chandrababu Naidu rule | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పాలనలో ప్రజలకు రక్షణ కరువు

Jul 1 2026 5:31 AM | Updated on Jul 1 2026 5:31 AM

People are facing a shortage of protection under Chandrababu Naidu rule

బిహార్‌ కన్నా దారుణంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు 

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న పోలీసులు, ప్రభుత్వం 

బాధితులపైనే కేసులు పెట్టిస్తున్న ఘనత చంద్రబాబుదే 

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో రాజకీయ నేతలు, మేధావుల ఆగ్రహం 

గాదె సాయికృష్ణ లాకప్‌డెత్, క్రాంతికుమార్‌ ఆత్మహత్యపై సీబీఐ విచారణకు డిమాండ్‌ 

సాక్షి, అమరావతి: ‘చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజల ప్రాణ, మాన, ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు బిహార్‌ కన్నా దారుణంగా ఉన్నాయి. ప్రభుత్వ పెద్దలు, పోలీసులు ఏకమై ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. బాధితులపైనే కేసులు పెడుతున్నారు. టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు, నాయకులు ఇసుక, మద్యం, గ్రావెల్‌ మాఫియాగా మారి యథేచ్ఛగా దోచుకుంటున్నారు. వాటిని ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుంది.’ అని పలువురు రాజకీయ నాయకులు, మేధావులు ధ్వజమెత్తారు. 

వైఎస్సార్‌సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్‌ అధ్యక్షతన మంగళవారం విజయవాడలో ‘కూటమి పాలనలో శాంతిభద్రతలు’ అనే అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మేధావులు, సామాజికవేత్తలు పాల్గొని కూటమి నేతల అరాచకాలు, దోపిడీపై రాష్ట్రవ్యాప్తంగా చర్చలు పెట్టి ప్రజలకు వివరించి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎండగట్టాలని నిర్ణయించారు.  

ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచే అరాచకాలు 
రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, వెలంపల్లి శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్‌ అధికారి విజయ్‌కుమార్, రిటైర్డ్‌ ఏఎస్పీ జల్లా రాజేశ్వరరెడ్డి, సామాజిక ఉద్యమకారిణి వసుంధర, న్యాయవాదులు కేవీఎం రజిని, ఒగ్గు గవాస్కర్, ప్రొఫెసర్‌ రామచంద్రయ్య, వైఎస్సార్‌సీపీ ప్రచార విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హరిప్రసాద్‌రెడ్డి, అధికార ప్రతినిధులు రవికుమార్, బండి పుణ్యశీల తదితరులు ప్రసంగించారు.

ఈ సందర్భంగా వారు ఏమన్నారంటే... ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచే రాష్ట్రంలో కూటమి అరాచక పాలన కొనసాగుతోంది. కసబ్‌ లాంటి కరుడుగట్టిన టెర్రరిస్ట్‌ను కూడా రాజ్యాంగబద్ధంగా కోర్టు ముందు ప్రవేశపెట్టి ట్రయల్‌ నిర్వహించి శిక్ష వేశారు. కానీ, విజయవాడలో కాపు యువకుడు గాదె సాయికృష్ణను పోలీసులే చంపేసి దహనం చేశారు. మాదిగ యువకుడు పేరుపోగు క్రాంతికుమార్‌ కృష్ణలంక సీఐ నాగరాజు టార్చర్‌ భరించలేక చనిపోతున్నానని స్పష్టంగా సెల్ఫీ వీడియోలో చెప్పాడు. ఇంతకన్నా బలమైన సాక్ష్యం ఏం కావాలి? కాబట్టి సాయికృష్ణ లాకప్‌డెత్, పేరుపోగు క్రాంతికుమార్‌ ఆత్మహత్య ఉదంతాలపై తక్షణమే సీబీఐతో విచారణ జరిపించాలి. 

టీడీపీ, జనసేన నేతలు ఎన్ని దారుణాలు చేసినా కేసులు పెట్టరా? 
లాయర్‌ శ్రీనివాస్‌ ఇంటిపై దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దాడి చేస్తే బాధితుడైన శ్రీనివాస్‌ పైనే పోలీసులు రివర్స్‌ కేసు పెట్టారు. అమరావతిలో మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, వైఎస్సార్‌సీపీ నాయకులపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడినా, తిరిగి బాధితులపైనే కేసులు పెట్టారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ఓ దళిత ప్రిన్సిపాల్‌ను వేధిస్తే ఈ రోజుకీ కేసు నమోదు చేయలేదు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో దళితులను గ్రామ బహిష్కరణ చేసినా చర్యలు తీసుకోలేదు. డాక్టర్‌ ఉమామహేశ్వరరావుపై కాకినాడలో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దాడి చేసినా కేసు లేదు. పోలీసులు కేవలం అధికార పార్టీకి కొమ్ముకాసే కీలు»ొమ్మలుగా మారిపోయారు. స్వతంత్ర న్యాయవ్యవస్థ బతికి ఉంది కాబట్టే దేశంలో సామాన్యుల మనుగడ సాధ్యమవుతోంది.

ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ 
రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు ఆందోళన 
తక్షణమే పీఆర్సీ కమిషన్‌ను నియమించి మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్‌ 
అమలాపురం టౌన్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ (అమరావతి) రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో జిల్లాకు చెందిన ఏపీ జేఏసీలోని వివి­ధ శాఖల సంఘాల నాయకులు, ఉద్యోగులతో మంగళవా­రం జరిగిన సమావేశానికి బొప్పరాజు ముఖ్య అతిథిగా హా­జరై ప్రసంగించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థికంగా నష్టపో­తున్న క్రమంలో ప్రభుత్వం తక్షణమే పీఆర్సీ కమిషన్‌ను నియమించి మధ్యంతర భృతిని ప్రకటించాలని బొప్పరాజు డిమాండ్‌ చేశారు. 

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా నేటికీ ఉద్యోగులకు న్యాయబద్ధంగా నియమించాల్సిన పీఆర్సీ కమిషన్‌ను నియమించలే­దని చెప్పారు. అధికారంలోకి రాగానే మంచి ఐఆర్‌ (మధ్యంతర భృతి) ప్రకటిస్తామని హామీ ఇచ్చినప్పటికీ నేడు ఆ ఊ­సే ఎత్తడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యో­గుల ఆర్థిక సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నామన్నారు. 

కూటమి ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకున్న ఉద్యోగులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని బొప్పరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర అసోసియేట్‌ చైర్మన్‌ ఫణి పేర్రాజు మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రతి ఆరు నెలలకూ ఒకసారి పెరగాల్సిన డీఏలు గత రెండేళ్లుగా పెంచలేదని, అసలు ఆ ప్రకటనే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రావాల్సిన బకాయిలపైనా ప్రభుత్వం ఎలాంటి చర్చలూ చేయడం లేదని విమర్శించారు. 

ఉద్యమానికి సిద్ధం: ఉద్యోగుల సమస్యలను పరిష్కరించని రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యోగులు దశలవారీ ఉద్యమాలకు సిద్ధమయ్యారు. ఈ ఉద్యమాలకు జేఏసీ సమావేశం కార్యాచరణ ప్రకటించింది. ఈ నెల పదో తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని డివిజన్‌ కేంద్రాల్లో జేఏసీ జిల్లా నాయకత్వాలు ఆర్డీవోలకు, ఎమ్మెల్యేలకు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాలు ఇవ్వాలని సమావేశం సూచించింది. ఈ నెల 12న శ్రీకాకుళం, 21న అనంతపురం జిల్లాలో సాధారణ ఉద్యోగులను సమాయాత్తం చేసేందుకు ఉద్యమ సన్నద్ధ సభలు ఏర్పాటు చేస్తున్నామని సమావేశం స్పష్టం చేసింది. త్వరలో రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఈ సభలు నిర్వహిస్తామని సమావేశం ప్రకటించింది. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ప్రత్యక్ష ఐక్య ఉద్యమానికి సిద్ధమవుతామని సమావేశంలో రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది. 

సమావేశంలో రాష్ట్ర మహిళా జేఏసీ చైర్‌పర్సన్‌ పారె లక్ష్మి, రాష్ట్ర మహిళా సెక్రటరీ జనరల్‌ విజయలక్ష్మి, రాష్ట్ర జేఏసీ నాయకుడు వీఎస్‌ దివాకర్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సత్తిబాబు, జిల్లా గెజిటెడ్‌ హెడ్‌ మాస్టర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు మోకా ప్రకాష్‌తో పాటు జిల్లాకు చెందిన రాష్ట్ర, డివిజన్‌ జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

ఉద్యోగులకు రూ.7 వేల కోట్ల సరెండర్‌ లీవులు ఇవ్వాలి 
బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): ఈ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయినా ఇంకా డీఏ, ఐఆర్‌ ఇవ్వలేదని, ఉద్యోగులకు రూ.7 వేల కోట్ల సరెండర్‌ లీవులు ఇవ్వాల్సి ఉన్నా వాటి విషయం చంద్రబాబు సర్కారుకు పట్టడం లేదని  ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. కాకినాడలోని రెవెన్యూ భవన్‌లో మంగళవారం ఏపీ జేఏసీ అమరావతి కాకినాడ జిల్లా శాఖ, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. సమస్యల సాధనకోసం సాగించే పోరాటంలో ఉద్యోగులందరూ పాల్గొనాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు  దిశానిర్దేశం చేశారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement