
గోతులపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు
కూటమి ఎమ్మెల్యేల గగ్గోలు
ఏడాదిన్నరైనా రోడ్లు వేయలేదని ప్రభుత్వంపై ఆగ్రహం
అవును నిజమేనంటూ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సమాధానం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒకటైన రోడ్ల నిర్మాణం చేయకపోవడంతో తాము ప్రజల్లో తిరగలేకపోతున్నామని పలువురు ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలోను, జీరో అవర్‌లోను సభ్యులు రోడ్ల సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీశారు. రోడ్లు బాగోలేదని, అప్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని రోడ్లు, భవనాలశాఖ మంత్రి బి.సి.జనార్దన్‌రెడ్డి సమాధానమిచ్చినా సభ్యులు శాంతించలేదు.
కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు దాటినా సమస్య తీరకపోవడంతో నియోజకవర్గాల్లో ప్రజలు తమను నిలదీస్తున్నారని చెప్పారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో ఒక్కరోడ్డు కూడా వేయలేదని పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రోడ్లపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో వంతెనలు శిథిలమయ్యాయని చెప్పారు.
భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై మంత్రికి నాలుగుసార్లు వినతిపత్రం ఇచ్చినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ రోడ్లపై రాళ్లు మొనదేలాయని, ప్రజల్లోకి వెళ్లలేకున్నామని పేర్కొన్నారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందని, వెంటనే రోడ్లు వేయాలని కోరారు.
మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వి.వెంకటేశ్వరరావు, బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు తదితరులు కూడా రోడ్లు బాగోలేవని, రాజధాని ప్రాంతంలోనూ ఇదే దుస్థితి ఉందని సభ దృష్టికి తీసుకొచ్చారు. తక్షణం రోడ్లు వేయాలని, లేకుంటే కష్టమని పేర్కొన్నారు.
అవును.. రోడ్లు బాగోలేదు
రోడ్లు, భవనాలశాఖ మంత్రి బి.సి.జనార్ధన్‌రెడ్డి
‘రాష్ట్రంలో వంతెనలు, రోడ్ల పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. ఈ అంశంపై ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం రాగానే రూ.1,080 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా గుంతలు పూడ్చాం. సింగిల్ లేయర్ రహదారులను అభివృద్ధి చేస్తున్నాం. వర్షాకాలం పూర్తయిన తర్వాత మిగిలిన రహదారులను అభివృద్ధి చేస్తాం.
రాష్ట్ర వ్యాప్తంగా 352 వంతెనల పునర్నిర్మాణానికి దాదాపు రూ.1,432 కోట్లు అవసరం. ఆర్థిక ఇబ్బందులున్నందున రుణాలు తీసుకుని కార్యాచరణ చేపడతాం. త్వరలో రహదారుల అభివృద్ధికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, వాటిని పూర్తిచేసేందుకు కృషిచేస్తాం.’