నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. కేరళంలో యూడీఎఫ్ గెలుపు కాస్తా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో మరింత గుర్తింపు తెచ్చేందుకు ఉపయోగపడవచ్చు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్, మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్‌లు డీఎంకేని గెలిపించ లేకపోవడం తండ్రి కొడుకుల పాలనపై ప్రజల అసమ్మతికి నిదర్శనంగా అది ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్‌లకు ఆందోళన కలిగించే విషయం అవుతుంది.
కాగా ప్రముఖ నటుడు విజయ్ రాజకీయ పార్టీని స్థాపించడమే కాకుండా, ఒంటరిగా పోటీచేసి అనూహ్యంగా విజయం వైపు దూసుకు వెళుతూండటం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కొంత ఇబ్బందికరం అవుతుంది. ఇకపై పవన్‌ను అందరూ విజయ్‌తో పోల్చడం.. అతడి విజయం.. ఈతడి ధోరణిపై ప్రశ్నలూ తలెత్తుతాయి. తమిళ ఎన్నికల ఫలితం వైఎస్సార్ కాంగ్రెస్‌కూ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఎందుకంటే చంద్రబాబు తమిళనాడులో ఎన్నికల ప్రచారం చేసినా ఎన్డీయేని గెలిపించలేకపోయారని, అదే సమయంలో కొన్ని సభల్లో జగన్ ఫొటోను ప్రదర్శించిన టీవీకే పార్టీ నేత విజయ్ గెలుపు బాటలో ఉండటం వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుందనడంలో సందేహం లేదు.
జగన్ మాదిరిగా విజయ్ కూడా ఒంటరిగా పోటీలోకి దిగడం ఇంకో సారూప్యత. గట్టిగా కృషి చేస్తే పశ్చిమబెంగాల్లో మాదిరిగా తామూ గెలిచే అవకాశం ఉందన్న ఆశ ఈ ఎన్నికలు తెలంగాణ బీజేపీకి కలిగిస్తాయి. అదే టైమ్ లో తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం ఉన్న బీఆర్‌ఎస్ కూడా ఈ ఎన్నికల ద్వారా తన వ్యూహాలను పునఃసమీక్షించుకునే అవకాశం ఉంది. అసోంలో బీజేపీ గెలుపు అన్నది ఊహించిందే. పశ్చిమబెంగాల్ లో పై ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ఆ స్థాయిలో కేంద్రీకృతం చేసిన తర్వాత, ఓట్ల జాబితా ప్రత్యేక సవరణ హడావుడి తర్వాత అక్కడ అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ విజయావకాశాలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందన్నది బహిరంగ రహస్యమే.
ఈ వ్యూహాలను గుర్తించి కాంగ్రెస్, సీపీఎం, తృణమూల్ పొత్తు పెట్టుకునే పరిస్థితి ఉందో లేదో తెలియదు. కాని ఆ వైపు ఆలోచించి ఉంటే ఎలా ఉండేదో! కేరళంలో ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు ఛాన్స్ ఉందని ఊహించిన పరిణామమే. కాగా అలాగే కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్డీయే తిరిగి వస్తుందన్న అంచనాకు తగినట్లే జరిగింది. అన్నిటికన్నా సంచలనం తమిళనాడులో విజయ్ ఒంటరిగా పోటీచేసి డీఎంకే, అన్నాడీఎంకేలను వెనక్కు నెట్టేయడం. అందరి సలహాలను కాదని విజయ్ ఒంటరిగానే బరిలోకి దిగడం ఒక రకంగా సాహసమే.
దేశ రాజకీయాలలో బీజేపీ హవా కొనసాగే విధంగానే ఈ ఎన్నికల ఫలితాలు సూచిస్తున్నాయి. మోడీ, అమిత్ షా ల కాంబినేషన్ కు ఇప్పట్లో తిరుగులేదన్న అభిప్రాయం కలుగుతుంది. కేరళంలో కూడా బీజేపీ తన వంతు ప్రయత్నం చేసినా, వారికి ఓట్లశాతం పెరుగుతుందే తప్ప సీట్లు పెద్దగా రావని అందరికి తెలుసు. దేశంలో ఉన్న ఏకైక వామపక్ష రాష్ట్రం కేరళంలో ఈసారి సీపీఎం ఆధ్వర్యంలోని ఆధ్వర్యంలోని లెఫ్ట్ ఫ్రంట్ ఓడిపోవడం వామపక్షవాదులకు నిరాశ కలిగిస్తుంది. అక్కడ గెలిచిన యూడీఎఫ్ వల్ల కాంగ్రెస్ ఆశలు కొద్దిగా చిగురిస్తాయి. కాని తమిళనాడులో మిత్రపక్షం డీఎంకే పరాజయం చవిచూడడం ఇండియా కూటమికి పెద్ద దెబ్బ అవుతుంది.
పశ్చిమబెంగాల్లో మూడు టర్మ్‌లుగా అధికారంలో ఎన్న టీఎంసీపై వ్యతిరేకత ఏర్పడటం సహజం. బీజేపీ అగ్ర నాయకత్వం కూడా ప.బెంగాల్‌లో ఎలాగైనా పాగా వేయాలన్న కృత నిశ్చయంతో ఉంది. కేంద్రంలో అధికారంలో ఉండటం, ఎన్నికల సంఘం తన వంతు పాత్ర పోషించడం వంటివి కూడా కలిసిరావడంతో బీజేపీ కల నిజమవుతోందని చెప్పాలి. ఎంత పోరాడినా మమత బెనర్జీ ఆమె పార్టీ చివరికి ఓడిపోక తప్పలేదు. ఏపీలో జనసేనను స్థాపించిన సినీ నటుడు పవన్ కళ్యాణ్ సొంత అజెండా అనేది ఏదీ లేకుండా.. తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తున్న వైనం ఈ సందర్భంగా ప్రస్తావనకు వస్తుంది.
విజయ్‌కు ఉన్న ధైర్యం పవన్‌కు లేకుండా పోయిందని, సీఎంను అవుతానంటూ కాపు సామాజికవర్గాన్ని ఊరించిన పవన్ కళ్యాణ్, ఆ తర్వాత చంద్రబాబుకు అతి విధేయుడుగా మారిపోవడం ఆ వర్గానికి అంతగా రుచించడం లేదు. పైగా ఇప్పుడు ఏకంగా 15 ఏళ్లు టీడీపీని భుజాన మోస్తానని చెబుతున్న వైనం మద్దతుదారులకు విసుగు తెప్పిస్తోంది. ఈ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అంతగా నచ్చవు. పైకి బీజేపీని అభినందించినా, లోపల మనసులో మాత్రం బీజేపీ బెంగాల్ ఓడిపోయి ఉంటే,తమ ప్రాధాన్యత పెరిగి ఉండేదని టీడీపీ నేతలు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రధాని మోడీని, హోం మంత్రి అమిత్ షాను మరింతగా పొగడక తప్పదని లోలోపల మథన డుతూండవచ్చు.
మరో కీలకమైన అంశం ఏమిటంటే తమిళనాడులో స్టాలిన్ ఉదయనిధిలు ఏపీలో మాదిరి రెడ్‌బుక్ అరాచకాలు చేయకపోయినా డీఎంకే ఓటమిపాలైంది. ఒక రకంగా ఆలోచిస్తే జనం కుటుంబ పాలనను వ్యతిరేకించారన్నమాట. ఇక ఏపీలో పవన్ కళ్యాణ్‌తో కలిసి చంద్రబాబు ఆకాశమే హద్దుగా ఇచ్చిన హామీలను అమలు చేయలేని స్థితిలో ఉన్నారు. పాలనా వైఫల్యంతో చంద్రబాబు ఉంటే, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్ షాడో సీఎంగా వ్యవహరిస్తూ రెడ్ బుక్ అంటూ పోలీసులతో అరాచకాలు చేయిస్తున్నారు. అలాగే అత్యంత విలువైన విశాఖ భూములను తమ ఇష్టారీతిన 99 పైసలకే కట్టబెడుతున్న తీరుపై టీడీపీ వీర మద్దతుదారుగా పేరొందిన మాజీ పోలీసు అధికారి ఎ బి వెంకటేశ్వరరావు వంటివారు మండిపడుతున్నారు.
అమరావతి పేరుతో జరుగుతున్న దోపిడీపై అంతా విస్తుపోతున్నారు. స్టాలిన్, ఉదయనిధిలు అరాచకాలు, విపక్షంపై వేధింపులు వంటివి చేయకపోయినా ఓటమిపాలయ్యారని, అలాంటిది ఏపీలో ఇంత దారుణమైన పరిస్తితులు ఉంటే జనం సహిస్తారా అన్నది చర్చగా ఉంది. అంతేకాక వచ్చే మూడేళ్లలో తెలుగుదేశంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు సంభవిస్తాయో చెప్పలేం. జూనియర్ ఎన్టీఆర్ వంటివారిని ఇంతకాలం దూరంగా ఉంచిన నేపథ్యంలో టీడీపీని మళ్లీ నందమూరి వంశం అధీనంలోకి తీసుకురావాలని ఒక వేళ ఆయన ఆలోచన చేస్తే రాజకీయాలు ఎటు మళ్లుతాయో ఇప్పటికిప్పుడు ఊహింలేం.
కేరళం రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపుతో రేవంత్‌కు ఉత్సాహం రావచ్చు.కాంగ్రెస్ జాతీయ నాయకత్వంలో ఆయన ప్రాధాన్యత పెరుగుతుంది. కాని బెంగాల్ లో విజయంతో బీజేపీ తెలంగాణలో ఏ గేమ్ ఆడుతుందో అన్న భయం ఉండవచ్చు. తమిళనాడు ఫలితాలు మాత్రం చంద్రబాబు, లోకేశ్ లకు నిద్ర లేకుండా చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మరీ అంత సీరియస్ రాజకీయాలు చేయడం లేదు కనుక, సొంత వ్యక్తిత్వంతో రాజకీయ పార్టని నడపాలన్న లక్ష్యంతో లేరు కనుక ఆయన పెద్దగా ఫీల్ కాకపోవచ్చు. జగన్ కు మాత్రం తమిళనాడు ఎన్నికల ఫలితాలు మరింత ఆత్మ విశ్వాసాన్ని నింపే అవకాశం ఉంటుంది.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


