
వైద్యుడిపై దాడికి యత్నించిన బాలిక తల్లిదండ్రులు, బంధువులు
అడ్డుకున్న పోలీసులు.. వైద్యుడిని పోలీస్‌స్టేషన్‌కు తరలింపు
ఉదయగిరి: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఓ పన్నెండేళ్ల బాలికతో వైద్యుడు అసభ్యకరంగా ప్రవర్తించినట్టు ఆమె తల్లి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం.. ఉదయగిరికి చెందిన ఓ మహిళ తన పన్నెండేళ్ల కుమార్తెకు చెవి నొప్పిగా ఉందని వైద్యం చేయించేందుకు స్థానిక సీహెచ్‌సీలోని వైద్యుడు ప్రశాంత్ దగ్గరకు తీసుకువచ్చారు.
ఈ క్రమంలో వైద్యుడు బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో తల్లి వైద్యుడితో వాగ్వాదానికి దిగారు. బాలిక తరఫు బంధువులు కూడా వైద్యశాల వద్దకు చేరుకుని వైద్యుడిపై దాడికి యత్నించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారికి సర్దిచెప్పి వైద్యుడు ప్రశాంత్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లారు.
ఆరోపణలకు విరుద్ధంగా సీసీ కెమెరా దృశ్యాలు
అయితే ఈ వ్యవహారంపై పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. సామాజిక ఆరోగ్య కేంద్రంలో కొన్నేళ్ల నుంచి వైద్యులు, సిబ్బంది మధ్య విభేదాలు ఉన్నాయి. ఇదే వైద్యశాలలో పనిచేసే ఓ సీనియర్ వైద్యుడు అక్కడ ఉన్న కొంత మంది సిబ్బందితో చేతులు కలిపి డీడీఓ బాధ్యతలు నిర్వహిస్తున్న వైద్యుడు ప్రశాంత్‌ను ఇబ్బంది పెట్టే యత్నాలు జరుగుతున్నాయనే వాదన వినిపిస్తోంది.
అయితే ఆస్పత్రిలోని సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలించినప్పుడు బాలిక బంధువులు చేసే ఆరోపణలకు, సీసీ కెమెరాల్లో కనిపించే దృశ్యాలకు పొంతన కనిపించడం లేదని సిబ్బంది చెబుతున్నారు. ఈ విషయమై ఎస్‌ఐ ఇంద్రసేనారెడ్డిని సంప్రదించగా బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని, పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తామని చెప్పారు.