సర్పంచ్‌ పదవికి పోటీ పడాలంటే! 

Panchayat Election Rules And Regulations For Who Want To Contest - Sakshi

పోల్స్‌.. రూల్స్‌ 

శ్రీకాకుళం రూరల్‌/ఎల్‌.ఎన్‌.పేట/లావేరు/నరసన్నపేట: సర్పంచ్‌ పదవికి పోటీపడాలంటే కొన్ని అర్హతలుండాలి. ఏమాత్రం తేడా వచ్చినా అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణకు గురవుతుంది. ఈ నేపథ్యంలో సర్పంచ్‌ అభ్యర్థుల కోసం ఎన్నికల సంఘం ప్రకటించిన అర్హతలు, అనర్హతలు వివరాలు ఓసారి పరిశీలిస్తే... 

వీరు అర్హులు..  
పోటీ చేయాలనుకున్న వ్యక్తి గ్రామ పంచాయతీలో స్థానికుడై ఉండాలి. పంచాయతీ ఓటర్ల జాబితాలో పేరు నమోదై ఉండాలి.  వయస్సు నామినేషన్‌ దాఖలు చేసే తేదీనాటికి 21 ఏళ్లు నిండి ఉండాలి.  ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరి అభ్యర్థులు జనరల్‌ స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. మహిళలకు రిజర్వు చేసిన స్థానాలతో పాటు అదే కేటగిరిలోని జనరల్‌ స్థానాల్లోనూ పోటీ చేయవచ్చు.  

వీరు అనర్హులు.. 
 గ్రామ సేవకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థల, ఎయిడెడ్‌ సంస్థల ఉద్యోగులు పోటీకి అనర్హులు. చట్టం ద్వారా ఏర్పడిన ఏదైనా ఒక సంస్థకు చెందిన పాలక మండలి సభ్యులు. నేరానికి పాల్పడి శిక్ష పడిన వారు. శిక్ష పూర్తిగా అనుభవించిన తర్వాత ఐదేళ్లు పూర్తికాని వారు. పౌరహక్కుల పరిరక్షణచట్టం–1955 పరిధిలోకి వచ్చే కేసుల్లో శిక్ష పడినవారు . మతి స్థిమితం లేనివారు. బధిరులు, మూగవారు.  దివాలాదారుగా న్యాయ నిర్ణయం కోసం దరఖాస్తు చేసుకున్నవారు. రుణ విమోచన పొందని దివాలదారు.   గ్రామ పంచాయతీకి వ్యక్తిగతంగా బకాయిపడిన వ్యక్తి, బకాయి చెల్లింపునకు నోటీసు ఇచ్చినా గడువులోగా బకాయి చెల్లించనివారు.

ఇద్దరుకన్నా ఎక్కవ మంది పిల్లలు కలిగి ఉన్నవారు. (1994 ఆంధ్రప్రదేశ్‌ పంచా యతీరాజ్‌ చట్టం అమలు తేదీ నుంచి)  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఏదైనా స్థానిక సంస్థల కార్యాలయంలో పనిచేసిన వ్యక్తి అవినీతి లేదా విశ్వాస ఘాతక నేరంపై తొలగించబడితే ఆ తేదీ నుంచి ఐదేళ్లు ముగిసే వరకు అనర్హులు. గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏదైనా పనికి కాంట్రాక్టు చేసుకున్నా లేదా నిర్వహణకు ఒప్పందం చేసుకున్నా పోటీకి అనర్హులు  

నామినేషన్ల దాఖలుకు నిబంధనలివే..  
అరసవల్లి/శ్రీకాకుళం రూరల్‌: నామినేషన్‌ దాఖలు చేసే అభ్యర్ధి కచ్చితంగా పోటీ చేసేందుకు సంసిద్ధతను తెలియజేస్తూ డిక్లరేషన్‌పై సంతకం చేయాలి.  రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం మాత్రమే కేటాయించిన స్థానాల్లో అదే సామాజిక వర్గ అభ్యర్థులు పోటీ చేయాల్సి ఉంటుంది.  చట్టప్రకారం కులాల వారీగా ప్రకటించిన విధంగా డిపాజిట్లు చెల్లించాలి. సర్పంచ్‌కు జనరల్‌ అభ్యర్థులైతే రూ.3000, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులైతే రూ.1500, వార్డు సభ్యుని స్థానానికైతే జనరల్‌ అభ్యర్థి రూ.1000, ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.500 డిపోజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది.  నామినేషన్‌ను దాఖలు చేయడానికి సకాలంలోనే పూర్తి చేసి ఆర్వోకు అందజేసి, రశీదు పొందాలి.

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో తొలి దశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. విజయనగరం మినహా 12 జిల్లాల్లో తొలిదశలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రతిరోజూ ఉ.10.30 గంటల నుంచి సా.5 గంటల మధ్య నామినేషన్లు స్వీకరిస్తారు. సర్పంచ్‌ పదవితో పాటు ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో నిర్ధారించిన వార్డు సభ్యుల పదవులకు కూడా నామినేషన్లు స్వీకరిస్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top