ఎమ్మెల్యేగా విశేష సేవలు.. సెంటు భూమి, ఇల్లు కూడా లేని నేత | Palamaner Former MLA TC Rajan Life Story, Family, Wife, Freedom Fighter | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేగా విశేష సేవలు.. సెంటు భూమి, ఇల్లు కూడా లేని నేత

Published Thu, Aug 4 2022 7:09 PM | Last Updated on Thu, Aug 4 2022 7:14 PM

Palamaner Former MLA TC Rajan Life Story, Family, Wife, Freedom Fighter - Sakshi

స్వార్థం పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఆయన భావాలు చీకటిలో చిరుదివ్వెలు.  మనం ఏమి చేశామని కాకుండా.. మనకు ఏమి లాభం అని ఆలోచించే మనుషుల్లో, స్వాతంత్య్ర పోరాటంలో తనవంతు పాత్ర పోషించి చిల్లిగవ్వ ఆశించని మహానుభావుడు.  దేశం కోసం పక్కనపెడితే.. ఊరికి కాస్త మంచి చేసినా నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ అడుగడుగునా కనిపిస్తున్న పరిస్థితుల్లో.. ఆయన మిగుల్చుకుంది నాలుగు జతల బట్టలు మాత్రమే.  భూమి ఇస్తామన్నా.. ఇల్లు తీసుకోమన్నా.. తృణప్రాయంగా తిరస్కరించిన ఆ దేశభక్తుడు ప్రజల గుండెల్లో తనపేరు చిరస్థాయిగా ఉంటే చాలని కోరుకోవడం చూస్తే ఎలాంటి వారైనా ‘సెల్యూట్‌’ చేయాల్సిందే.  అచ్చ తెలుగు భారతీయత ఉట్టిపడే పంచె, లాల్చీ ధరించిన.. వయస్సు శత వసంతాలు దాటిన ఆయనతో స్వాతంత్య్రోద్యమ మాట కలిపితే.. ఆ పోరాట పటిమ తూటాలా పేలుతుంది.. ఆ వయస్సులోనూ, ప్రతి మాటలోనూ ‘రాజ’సం ఉట్టిపడుతుంది.. ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తోంది..  భరతమాత ముద్దుబిడ్డగా ఆయన మనస్సు త్రివర్ణ శోభితమవుతోంది.  


పలమనేరు:
 ‘‘ప్రభుత్వం నుంచి ఏనాడు ఏమి ఆశించలేదు. ఇప్పుడు నాకు నాలుగు జతల బట్టలు తప్ప ఇంకేమీ లేవు అని స్వాతంత్య్ర సమరయోధులు, పలమనేరు మాజీ ఎమ్మెల్యే ఠాణేదార్‌ చిన్న(టీసీ) రాజన్‌ వెల్లడించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఈ ప్రాంతంలోని స్వాతంత్య్ర సమరయోధులు, మృతి చెందిన వారి సతీమణులను సన్మానించే కార్యక్రమాన్ని రెవెన్యూ అధికారులు బుధవారం నిర్వహించారు. పలమనేరుకు చెందిన టీసీ రాజన్, దివంగత రామ్మూర్తి సతీమణి జయలక్షుమమ్మకు మేళతాళాలమధ్య ఘనస్వాగతం పలికి వారి అనుభవాలను ఆలకించి ఘనంగా సన్మానించారు. నాటి పరిస్థితులు ఆయన మాటల్లోనే.. 


నా వయస్సు ఇప్పుడు 104 ఏళ్లు మరో రెండు నెలల్లో 105లో పడతాను. చెవులు సరిగా వినపడవు, కంటిచూపు తగ్గింది. 

జిల్లాలో బతికున్న ఫ్రీడం ఫైటర్లలో బహుశా నేనే మిగిలానేమో. దేశానికి స్వాతంత్య్రం కోసం నాడు ఎందరో వీరులు పడిన కష్టాలను నేటి సమాజానికి తెలిసేలా ప్రభుత్వం చేస్తున్న మంచి పని ఇది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే ఉండేది. ఆపై కొన్ని పార్టీలొచ్చాయి. 1956లో రాజాజీ స్వతంత్ర పార్టీని స్థాపిస్తే అందులో రంగాను జాతీయ అధ్యక్షునిగా నియమించారు. నన్ను చిత్తూరు జిల్లా కార్యదర్శిని చేశారు. 1957లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో తెనాలిలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీచేసి రంగా ఓడిపోయారు. అనంతరం చిత్తూరు ఎంపీగా ఉన్న అనంతశయనం అయ్యంగార్‌ను అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం బిహార్‌ గవర్నర్‌గా నియమించింది. దీంతో ఇక్కడి ఎంపీ స్థానానికి 1962లో ఎన్నిక వస్తే రంగాను స్వతంత్ర పార్టీ ఇక్కడ పోటీలో పెట్టింది. అప్పట్లో ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థి విశ్వనాథ రెడ్డిపై 19వేల మెజారిటీతో గెలిచారు. ఈ విజయానికి నేను చేసిన కృషికి మెచ్చి, 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ  పలమనేరు అభ్యర్థిగా నన్ను నిలబెట్టింది. ఈ ఎన్నికలో నేను 9వేల మెజారిటీతో గెలిచాను.  


గ్రామాల్లో తిరిగాను 

గెలిచిన తరువాత నెలకు 15 రోజులు గ్రామాల్లో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొన్నా. ఆ సమస్యలను అసెంబ్లీలో చర్చించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను. రైతులు పండించిన బియ్యాన్ని రవాణా చేయకుండా బెల్ట్‌ ఏరియాగా ప్రకటించారు. దీంతో ఈ ప్రాంతంలో ఆరేడు చెక్‌ పోస్టులుండేవి.  ఈ సమస్యను అసెంబ్లీలో చర్చించి దాన్ని రద్దు చేయించా. పాలార్‌ బేసిన్‌ స్కీమ్‌ మేరకు నదులపై చెక్‌డ్యామ్‌లు నిషేధం పెట్టారు. దీనిపై పోరాటం సాగించా. ఆ పోరాటం వల్లే రాష్ట్రంలో నదులపై చెక్‌డ్యామ్‌లు నిర్మించారు. రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో కరెంట్‌ ఉండేది కాదు. దీనిపై అసెంబ్లీలో చర్చించి అన్ని గ్రామాల్లోనూ వెలుగులు నింపా. 

ఊరూరా పండగే  
జెండా పండగ వచ్చిందంటే ఊరు ముందు పచ్చతోరణాలను కట్టి జెండా ఎగురవేసే వాళ్లు. ఆ జెండా ఎగురవేయడం కోసం ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు. జెండా ఎగురవేసి తరువాత నిర్వహించే సమావేశంలో గ్రామ పెద్దలు, స్వాతంత్య్రం కోసం పాటు పడిన వారు ప్రసంగిస్తుంటే వినేందుకు ఎగబడేవారు. అందరూ తెల్లటి దుస్తులను ధరించి కార్యక్రమానికి వచ్చేవారు. ఊరూరా జెండా పండుగ రోజు స్థానిక ప్రముఖులు, విద్యావేత్తలు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేవారు.  


శాకాహారిని 

నేను పక్కా శాకాహారిని. ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు భోజనంలో తీసుకుంటా. నేను ఇంత ఆరోగ్యంగా ఉండానంటే మా వంశంలోని జీన్స్‌ కారణమే. మా అక్క 108 ఏళ్లు బతికింది. మా అన్నలు 98 ఏళ్లు బతికారు.  ప్రత్యేకంగా నేను ఆహారమేమీ తీసుకోనూ. అయితే మితంగా తింటాను. ప్రస్తుతం బెంగళూరులోని పటేల్‌ లేఅవుట్, వర్తూర్‌లో కుమారుడి వద్ద ఉంటున్నాను.  

ఈ దేశమే నాది అయినప్పుడు ఇక ఇల్లెందుకు, పొలమెందుకు.. నేను దేశం కోసమే పుట్టాను. దేశం కోసమే పోరాడాను. అందుకే ప్రభుత్వాలు ఇచ్చే నజరానాలపై మోజు పడలేదు. స్వాతంత్య్ర పోరాటంలో నన్ను అరెస్టు చేసి రాజమండ్రి జైల్లో పెట్టినా వెనుకడుగు వేయలేదు. 55 ఏళ్ల క్రితమే ఎమ్మెల్యేగా సేవలందించా. అప్పట్లో స్వాతంత్య్ర సంబరాన్ని ఊరూరా ప్రజలే స్వచ్ఛందంగా జెండా ఎగురవేసి దేశభాక్తిని చాటుకునేవారు. ఈ దేశం నా కోసం ఏం చేసిందని కాకుండా, నా దేశానికి నేనేం చేయగలనని మాత్రం ఆలోచించాను. ఈ జీవితంలో దేశం కోసం చేయాల్సిందంతా చేశాను.  
– టీసీ రాజన్, స్వాతంత్య్ర సమరయోధుడు 

జైల్లోనే పరిచయాలు 
టెలిగ్రాఫ్‌లైన్ల (ప్రభుత్వ ఆస్తుల)ను  ధ్వంసం చేసిన అభియోగం కింద అప్పటి ఎస్పీ సుబ్బరాయన్‌ నన్ను మూడు నెలలు రాజమండ్రి జైల్లో పెట్టారు. అదే జైల్లో ఉన్న టీకే నారాయణరెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, రాచకొండ నరసింహులు, పెద్దిరెడ్డి తిమ్మారెడ్డితో పరిచయం ఏర్పడింది. మరింత దేశభక్తి పెరిగింది. అప్పట్లో నరసింహారెడ్డి, సీతారామయ్య, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, పెండేకంటి వెంకటసుబ్బయ్యతో కలిసి ఉద్యమాల్లో పాల్గొన్నా. ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి వద్దనుకున్నా. తామ్రపత్రమూ వద్దనే చెప్పాను. మాజీ ఎమ్మెల్యేలకు పింఛను వద్దని వ్యతిరేకించాను. ప్రభుత్వం ఇచ్చే 15 ఎకరాల భూమి కూడా తీసుకోలేదు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ఇంటి స్థలమూ వద్దని చెప్పాను. 


ఉట్టి అన్నానికి ఉప్పుకూడా ఇచ్చేవారు కాదట 

గాంధీ ఉప్పు సత్యాగ్రహానికి పిలుపునిస్తే నా భర్త రామమూర్తి వెళ్లారు. ఈ సమాచారం తెలుసుకున్న బ్రిటీష్‌ అధికారులు టెలిఫోన్‌ కమ్మీలను కత్తిరించిన కేసులో ఆయన్ను జైలులో పెట్టారు. ఆ సమయంలో ఒట్టి అన్నం మెతుకులు పెట్టారంట. అది తినేందుకు చప్పగా ఉంటుందట. కాస్త ఉప్పు ఇవ్వమని అడిగితే చాలా హింసించేవారని నా భర్త చెప్పేవారు. అలాంటి ఆంగ్లేయుల బానిస సంకెళ్లను తెంచి దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహనీయులను స్మరించుకోవడం మన ధర్మం.  
- నాటి స్వాతంత్య్ర సమరయోధులు రామమూర్తి సతీమణి జయలక్షుమమ్మ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement