అయ్యో జ్యోతి.. నీ​కు ఎంత కష్టమొచ్చింది!

Orphan Girl No Support From Government Vizianagaram - Sakshi

కన్నబిడ్డను అమ్మ కాదనుకుంది. నాన్న లోకంలోనే లేకుండా పోయాడు. చివరకు వృద్ధాప్యంలో ఉన్న తాతే ఆ ఆడబిడ్డకు ఆధారంగా ఉన్నాడు. అష్టకష్టాలు పడుతూ పోషిస్తున్నాడు. అయినా మన అధికారుల కళ్లకు ఆ బిడ్డ కష్టాలు కనిపించడం లేదు. ప్రభుత్వం ద్వారా అందించాల్సిన ఏ ఒక్కటీ అందించడం లేదు. వివరాల్లోకి వెళ్తే... 
 

శృంగవరపుకోట: పట్టణంలోని బర్మా కాలనీకి చెందిన గొర్లె సత్యవతికి కొత్తవలసకు చెందిన గురయ్యతో పుష్కర కాలం కిందట వివాహమైంది. వీరికి పదేళ్ల కుమార్తె జ్యోతి ఉంది. గురయ్య ఎనిమిదేళ్ల కిందట చనిపోవడంతో సత్యవతి తన బిడ్డ జ్యోతితో ఎస్‌.కోటలోని తండ్రి అంకులు వద్దకు వచ్చేసింది. రెండేళ్ల కిందట సత్యవతి కూడా జ్యోతిని కాదనుకుంది. కన్నబిడ్డను కాదనుకొని వేరొకరిని వివాహమాడి జ్యోతిని వదిలేసి వెళ్లిపోయింది.

తండ్రి లేక తల్లి వదిలేయడంతో తాత వద్దే జ్యోతి ఉంటుంది. తాత తట్టా, బుట్ట అల్లి విక్రయించగా వచ్చే కాసింత డబ్బుతో పేదరికం మధ్య మనమరాలు జ్యోతితో అష్టకష్టాల నడుమ జీవనం కొనసాగిస్తున్నాడు. వీరి కి ఇల్లంటూ లేకపోవడంతో పుణ్యగిరిలోని ప్రభుత్వ సామాజిక భవనంలోనే తలదాచుకుంటున్నారు.  

దయ చూపని అధికారులు 
ఇన్ని అవస్థల నడుమ కూడా జ్యోతి ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతుంది. అయితే ప్రభుత్వం ఇచ్చే అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుకలేవీ అందడం లేదు. దీనికి కారణం ఆధార్‌ లేకపోవడమే. ఆధార్‌ లేకపోవడంతో పాఠశాలలోని ఛైల్డ్‌ ఇన్‌ఫో యాప్‌లో జ్యోతి వివరాలు నమోదు కావడం లేదని హెచ్‌ఎం ఎం.పార్వతి చెప్పారు. తనకు చదువుకోవాలని ఉందని, వసతిగృహంలో వేస్తే చదువుకుంటానని జ్యోతి చెబుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ చిన్నారి జ్యోతికి ప్రభుత్వ పథకాలు అందేలా, చదివేలా చూడాలని పలువురు కోరుతున్నారు. ఆ చిన్నారి ఆశను బతికించాలని ఆశిద్దాం.  

చదవండి: పెళ్లి ముచ్చట తీరనేలేదు.. తోరణాలు తొలగనేలేదు.. అంతలోనే..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top