
యాంటిబయోటిక్స్ అతి వినియోగంతో రోగనిరోధకత పెంచుకుంటున్న చెడు బ్యాక్టీరియా
ఫలితంగా చికిత్సల్లో పనిచేయని యాంటిబయోటిక్స్
గ్లోబల్ యాంటిబయోటిక్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ పార్టనర్‌షిప్ అధ్యయనంలో వెల్లడి
సాక్షి, అమరావతి: దేశంలో యాంటిబయోటిక్స్ అతి వినియోగం కొంప ముంచుతోంది. ఏ చిన్న అనారోగ్య సమస్యకైనా ప్రస్తుతం యాంటిబయోటిక్స్ వాడకం పెరిగిపోయింది. దీంతో శరీరంలోని వ్యాధి కారకాలు రోగనిరోధక శక్తి పెంచుకొని తీవ్ర సమస్యగా మారుతున్నాయి. చివరకు వివిధ ఇన్‌ఫెక్షన్లు.. వైద్య చికిత్సలకు లొంగని పరిస్థితి తలెత్తింది. ఈ సమస్య భారత్ వంటి మధ్య ఆదాయ దేశాలను వేధిస్తోందని గ్లోబల్ యాంటిబయోటిక్ రీసెర్చ్,æ డెవలప్‌మెంట్ పార్టనర్‌షిప్(జీఏఆర్‌డీపీ) చేపట్టిన అధ్యయనం వెల్లడించింది.
భారత్‌లో 90 శాతానికి పైగా బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లకు తగిన చికిత్సలు అందడం లేదని తెలిపింది. 2019లో భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా సహా ఎనిమిది మధ్య ఆదాయ దేశాల్లోని 15 లక్షల కార్బపెనెం–రెసిస్టెంట్ గ్రామ్–నెగిటివ్(సీఆర్‌జీఎన్) ఇన్‌ఫెక్షన్ కేసుల్లో.. చికిత్సలకు యాంటిబయోటిక్స్ వినియోగంపై అధ్యయనం చేసింది. ఈ క్రమంలో భారత్‌లో కేవలం 8 శాతం కేసుల్లోనే సరైన యాంటిబయోటిక్స్ కోర్సులతో కూడిన చికిత్సలు అందాయని గుర్తించింది. న్యూమోనియా, యూరిన్ ఇతర ఇన్‌ఫెక్షన్లు సీఆర్‌జీఎన్ విభాగంలోకి వస్తాయి.
అడ్డుకట్ట వేయాలి..
ప్రాణాంతక ఇన్‌ఫెక్షన్ల బారినపడి సరైన యాంటిబయోటిక్స్ మందులు అందక రోగులు ప్రాణాలు కోల్పోతున్నారని జీఏఆర్‌డీపీ డైరెక్టర్ డాక్టర్ జెన్నిఫర్ కోన్ ఆందోళన వ్యక్తం చేశారు. రోగులు అధునాతన మౌలిక సదుపాయాలున్న ఆస్పత్రుల్లో చేరకపోవడం, కచ్చితమైన రోగనిర్ధారణ లేకపోవడం వంటివి కారణాలుగా గుర్తించామన్నారు. అలాగే భారత్‌లో కొత్త యాంటి బయోటిక్స్ అందుబాటులోకి రాకపోవడం కూడా సవాల్‌గా మారిందన్నారు. అందుబాటులో ఉన్న మందుల అతి వినియోగాన్ని కట్టడి చేసేలా ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు.
మందులకు లొంగని ఇన్‌ఫెక్షన్లు..
యాంటిబయోటిక్స్ అతిగా వినియోగించడం వల్ల శరీరంలోని వ్యాధి కారకాలు రోగనిరోధక శక్తిని పెంచుకోవడంతో యాంటి మైక్రోబియల్ రెసిస్టెన్స్ తీవ్ర సమస్యగా మారుతోంది. ఫలితంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్, బ్లడ్ ఇన్‌ఫెక్షన్, న్యూమోనియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు సాధారణ యాంటిబయోటిక్ మందులతో చికిత్సలు కష్టతరంగా మారాయని గతేడాది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) స్పష్టం చేసింది.
సెఫోటాక్సిమ్, సెప్టాజిడిమ్, సిప్రోప్లోక్సాసిన్, లెవోప్లాక్ససిన్ వంటి కీలక యాంటిబయోటిక్స్.. బ్యాక్టీరియాతో కలిగే ఇన్‌ఫెక్షన్లను నయం చేయడంలో 20 శాతం తక్కువ ప్రభావాన్ని చూపినట్టు నిర్ధారించింది. యాంటిబయోటిక్స్ విక్రయాలు, వినియోగంపై కఠిన నిబంధనలు అమలు చేయాలని సూచించింది.