బర్స్‌ యాప్‌ పేరుతో బురిడీ

Online Fraud: Burse App Loots Rs 1 Crore In Prakasam - Sakshi

డబ్బుపోయి లబోదిబోమంటున్న బాధితులు

రూ.7 లక్షలకు పైగా నష్టపోయిన కొండపి, పెదకండ్లగుంట యువకులు

జిల్లా వ్యాప్తంగా రూ.1.5 కోట్లు నష్టపోయి ఉండొచ్చని అంచనా

సాక్షి, కొండపి(ప్రకాశం): మండలంలోని పలువురు యువతకు ఆన్‌లైన్‌ మోసకారులు గాలం వేశారు. బీహార్, బెంగళూరు, ముంబాయిల చిరునామాలతో అమాజిన్‌ ఈ కామర్స్‌ కంపెనీ లిమిటెడ్‌ పేరుతో సర్టిఫికెట్‌ ఆన్‌లైన్‌లో పెట్టి యువకులతో చాట్‌ చేశారు. డబ్బులు డిపాజిట్‌ చేయించుకుని ఎనిమిది నెలల పాటు ఆటసాగించారు. వారం క్రితం ఒక్కసారిగా యువత డిపాజిట్‌ చేసిన డబ్బును నొక్కి కుచ్చుటోపి పెట్టిన ఆన్‌లైన్‌ మోసం మండలంలోని పెదకండ్లగుంట గ్రామంలోని బాధితుల ద్వారా మంగళవారం వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల్లోకి వెళితే..పెదకండ్లగుంట గ్రామానికి చెందిన యువకులకు తమ గ్రామంలోని ఇతర ప్రాంతాల్లోని యువకుల ద్వారా బర్స్‌ యాప్‌ గురించి తెలుసుకుని డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

ఈ విధంగా గ్రామంలో 30 మందికి పైగా ఆకర్షితులు కావటంతో పాటు కొండపిలో సైతం కొంతమంది ఈయాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. సంస్థ ఇచ్చిన యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ద్వారా నూతన ఖాతాలు ఆన్‌లైన్‌లోనే తెరచుకున్నారు. వారి బ్యాంక్‌ అకౌంట్ల నుంచి నేరుగా యాప్‌లో రూ.600 పెట్టుబడి నుండి రూ.30 వేలు, రూ.50 వేల వరకు డిపాజిట్‌ చేశారు. రూ.600 డిపాజిట్‌కి వచ్చే బబుల్స్‌ మీద నొక్కితే రూ.2 వరకు కమీషన్‌ వారి బ్యాంకు ఖాతాలో జమవుతుంది. రోజుకు 30 సార్లు అవకాశం ఇస్తారు. అదే రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు డిపాజిట్‌ చేస్తే 30 సార్లు వచ్చే బబుల్స్‌ని నొక్కితే రోజుకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వస్తుంది. కమీషన్‌ కింద వచ్చే డబ్బుల్లో 18 శాతం జీఎస్‌టీ కూడా కట్‌ చేసి వారి అకౌంట్లలో జమచేస్తారు.

ఈ విధంగా బబుల్స్‌ గేమ్స్‌ మేనెల నుంచి డిసెంబర్‌ 25 వరకు ఆడారు. అయితే పది రోజుల నుంచి బబుల్స్‌ వస్తున్నా..కమీషన్‌ డబ్బులు పడటం ఆగిపోయాయి. రెండు రోజుల నుంచి పూర్తిగా గేమ్‌తో పాటు లావాదేవీలు సైతం నిలిచిపోయాయి. దీంతో సొంత పెట్టుబడితో పాటు గేమ్‌ ద్వారా వచ్చిన మొత్తం డబ్బును ఒక్క పెదకండ్లగుంట, కొండపి గ్రామాల్లోనే 30 మందికి పైగా రూ.7 లక్షలకు పైగా నగదు పోగొట్టుకున్నారు. దీంతో లబోదిబోమంటూ బయటకు చెప్పుకుంటే సిగ్గుచేటని కిమ్మనకున్నారు. ఒకరు అర బయటకు వచ్చి తమకు జరిగిన మోసం గురించి బయటపెట్టారు. ఇంకా జిల్లా వ్యాప్తంగా ఒకరి ద్వారా ఒకరు తెలుసుకుని వందల మంది రూ.1.5 కోట్ల వరకు నష్టపోయి ఉంటారని బాధితులు అంటున్నారు. ఈ విషయమై కొండపి ఎస్‌ఐ రాంబాబును వివరణ కోరగా దీనిపై తనకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేసి విచారణ చేస్తామని తెలిపారు. (చదవండి: పెళ్లి బస్సు బోల్తా: ఏడుగురు మృతి)

మోసపోయాం 
ఆశకు పోయి ఆన్‌లైన్‌ మోసానికి గురయ్యాం. నాతో పాటు కొండపిలో 30 మందికి పైగా రూ.7 లక్షల వరకు నష్టపోయాం. నాకు తెలిసిన ఒంగోలులోని మిత్రుడు రూ.1.5 లక్షల వరకు నష్టపోయాడు. ఇంకా చెప్పటానికి వెనుకంజ వేస్తున్న ఎంతో మంది జిల్లా వ్యాప్తంగా వందల్లో ఉన్నారు. అంతా దాదాపు రూ.1.5 కోటికిపైగా నష్టపోయి ఉంటారు. ఎవరూ ఇటువంటి మోసాలకు గురై డబ్బులు పోగొట్టుకోవద్దు. 
- నారాయణ, పెదకండ్లగుంట

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top