అవినీతికి కేరాఫ్‌ దామచర్ల జనార్దన్‌

Ongole City Mayor Slams Gangada Sujatha Damacharla Janardhan - Sakshi

కమీషన్ల కోసమే పనులు ప్రారంభం

ప్రజలకు సమస్య వస్తే పత్తా ఉండరు

నిద్రలో సైతం బాలినేని ఫోబియాతో వణికిపోతున్నారు

మీడియా సమావేశంలో నగర మేయర్‌ గంగాడ సుజాత

ఒంగోలు: అభివృద్ధి పథం అంటూ అభివృద్ధి భూతాన్ని ప్రజలకు చూపిస్తే నమ్మేందుకు జనం సిద్ధంగా లేరని, అవినీతికి కేరాఫ్‌గా దామచర్ల జనార్దన్‌ నిలిచిపోయారంటూ నగర మేయర్‌ గంగాడ సుజాత విమర్శించారు. స్థానిక వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎక్కడైనా పనులు నిలిచిపోతే ఆందోళన చేశామని, కానీ పనులు వేగవంతంగా జరుగుతుంటే దానిని ఎలాగైనా అడ్డుకోవాలనే కుట్రతో నిరసన చేయడం దామచర్లకు మాత్రమే చెల్లిందన్నారు. బకింగ్‌ హాం కెనాల్‌ బ్రిడ్జి కాంట్రాక్టర్‌ వద్ద కమీషన్‌తోపాటు దాదాపు రూ.10 కోట్ల అప్పు, ఇంకా మరికొంత మంది వద్ద అప్పు తీసుకుని వారిని దామచర్ల ఎలా వేధిస్తుందీ అందరికీ తెలుసన్నారు.  

మల్లవరం నుంచి నగరానికి పైప్‌లైన్‌ పనుల్లో ఎంత కక్కుర్తి పడింది, చివరకు టీడీపీ నాయకుల స్థలాలకు పరిహారం ఇవ్వాల్సి వస్తే వదిలేసి పత్తా లేకుండా పోయిన విషయం గురించి అందరికీ తెలిసిందేనని చెప్పారు. చివరకు జనార్దన్‌ కమీషన్లకు భయపడి కాంట్రాక్టర్లు సైతం పరారయ్యే పరిస్థితి వస్తే వారికి బకాయిలు సైతం తీర్చి నేడు పనులు వేగవంతంగా చేయిస్తుంటే కళ్లుండి చూడలేని స్థితి నెలకొందని విమర్శించారు.  నిద్రలో సైతం బాలినేని ఫోబియాతో జనార్దన్‌ వణికిపోతున్నారన్నారు.

వైఎస్సార్‌ సీపీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు కటారి శంకర్‌ మాట్లాడుతూ మభ్యపెట్టడం, మోసపుచ్చడం అనేది చంద్రబాబు నాయుడికి మాత్రమే వెన్నతో పెట్టిన విద్య అని జనం అనుకునేవారని, కానీ నేడు ఆ జాబితాలో జనార్దన్‌ కూడా చేరిపోయారని విమర్శించారు. ఒంగోలులో 20 వేల పెన్షన్లు తీసివేశారంటూ మాట్లాడడం ఆయన అవివేకానికి నిదర్శనమని, 2 వేల పెన్షన్లు సాంకేతిక కారణాలతో నిలిచిపోతే తిరిగి వాటిని బాలినేని స్వయంగా పర్యవేక్షించి 1800 పెన్షన్లు పునరుద్ధరించిన విషయాన్ని తెలుసుకోవాలన్నారు. కేవలం పెన్షన్లు తిరిగి వచ్చాయన్న విషయం ప్రజలకు తెలియకూడదనే ఉద్దేశంతోనే ప్లాన్‌చేసి బకింగ్‌హాం కెనాల్‌ బ్రిడ్జి అంశాన్ని తెరపైకి తెచ్చారంటూ విమర్శించారు.

యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గంటా రామానాయుడు మాట్లాడుతూ ప్రతి చోట యాక్టింగ్‌ షోలు సక్సెస్‌ కావని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఒంగోలులో ఎంతమంది పేద కుటుంబాలకు పట్టాలు ఇచ్చారు? నేడు వాటి విలువ ఎంతో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారని, కానీ జనార్దన్‌ హయాంలో ఎంతమందికి ఇళ్లపట్టాలు ఇచ్చి ఎంతమంది పేదల ఆస్తులు పెరగడానికి దోహదపడ్డారో సమాధానం చెప్పాలన్నారు. బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి గోలి తిరుపతిరావు మాట్లాడుతూ రెండేళ్లపాటు కరోనా విలయ తాండవం చేసినప్పుడు ప్రజల్ని కాపాడుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడితే అండగా నిలవాల్సిన ప్రతిపక్ష పార్టీ నేతలు బెంగళూరు, హైదరాబాదులో తలదాచుకుని, నేడు రోడ్ల మీదకు వస్తున్న తీరు చూసి ఇదేం ఖర్మ అంటూ జనం ఈసడించుకునే పరిస్థితి నెలకొందన్నారు. జిల్లా అధికార ప్రతినిధి కావాటి రవికుమార్‌ మాట్లాడుతూ గోల్డెన్‌ స్పూన్‌ అని చెప్పుకునే జనార్దన్‌కు నిద్రలో సైతం బాలినేని కుటుంబాన్ని తలుచుకునే పరిస్థితి దాపురించిందని, బాలినేని ఫోబియాతో వణికిపోతున్నారని విమర్శించారు.

టీడీపీ కోసం అంటూ బండ్లమిట్ట వద్ద ముస్లిం దుకాణాలను ధ్వంసం చేసింది, బుడబుక్కల వారి ఇళ్లను ధ్వంసం చేసింది, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ఉన్న మున్సిపల్‌ స్థలాన్ని ఎలా కాజేయాలనుకుంది ప్రజలందరికీ తెలుసని, కబ్జాదారు ఎవరు, కనికరించేది ఎవరో కూడా అర్థమవుతుందన్నారు. వైఎస్సార్‌ సీపీ నాయకురాలు తమ్మినేని మాధవి మాట్లాడుతూ టీడీపీ సీనియర్‌ మహిళా నాయకురాలు కుమార్తె పెళ్లికోసం కాళ్లు పట్టుకుని ఆర్థికసాయం అందించమని జనార్దన్‌ను ప్రాధేయపడితే చివరకు రూ.50 వేలు చేతిలో పెట్టి లక్ష రూపాయలకు ఓచర్‌ రాయించుకున్నారంటూ మండిపడ్డారు.

కార్పొరేటర్‌ తాడి కృష్ణలత మాట్లాడుతూ అభివృద్ధి మీరు చేస్తే నగరంలో తమ సమస్యలు తీర్చండంటూ జనం మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారని, నేడు నిధులు అత్యధికంగా పేద ప్రజానీకం నివాసం ఉండే ప్రాంతాల్లోనే వెచ్చిస్తున్న సంగతి తెలుసుకోవాలన్నారు. బొమ్మనేని మురళి మాట్లాడుతూ బకింగ్‌హాం కెనాల్‌ ప్రాజెక్టుకు కేవలం 40 శాతం పనులు చేసి 80 శాతం చేశానంటూ ప్రజలను నమ్మించాలని చూడడం జనార్దన్‌ కుట్రలో భాగమే అన్నారు. 2015లో బ్రిడ్జి మంజూరైతే టెండర్‌ ఖరారుకు 16 నెలలు, మరో ఏడాదికి అంటే 2017లో శంకుస్థాపన చేశారని..ఇదీ టీడీపీ హయాంలో వేగవంతంగా పనులు జరగడం అంటూ విమర్శించారు. ప్రతి పనిలోను పర్సంటేజీలే అని, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జనార్దన్‌ హయాంలో ప్రతి పనిలోను 20 శాతం అదనానికి టెండర్లు పడడమే ఇందుకు నిదర్శమని మండిపడ్డారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top