hcl recruitment drive for one thousand it jobs in vijayawada - Sakshi
Sakshi News home page

విజయవాడ హెచ్‌సీఎల్‌లో వెయ్యి ఐటీ ఉద్యోగాలు 

Jan 29 2021 10:29 AM | Updated on Jan 29 2021 10:57 AM

One Thousand IT Jobs In Vijayawada HCL - Sakshi

సాక్షి, అమరావతి: విజయవాడ క్యాంపస్‌(గన్నవరం)లో పనిచేసేందుకు గానూ వెయ్యి మంది ఉద్యోగుల ఎంపిక కోసం వచ్చే నెల 12, 13 తేదీల్లో నియామక ప్రక్రియ చేపడుతున్నట్లు ప్రముఖ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీమతి శివశంకర్‌ తెలిపారు. ‘హెచ్‌సీఎల్‌ న్యూ విస్టాస్‌’ కార్యక్రమం కింద వర్చువల్‌ విధానంలో నిర్వహించే ఈ నియామక ప్రక్రియకు ఇంజనీరింగ్‌ ఫ్రెషర్స్‌తో పాటు 2 ఏళ్ల నుంచి 8 ఏళ్ల అనుభవం ఉన్నవారు కూడా అర్హులేనని చెప్పారు.

విజయవాడ సమీపంలోని గన్నవరంలో ఉన్న హెచ్‌సీఎల్‌ క్యాంపస్‌లో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఇక్కడ 1,500 మంది ఐటీ ఉద్యోగులున్నారని చెప్పారు. నాలుగేళ్లలో ఈ సంఖ్యను 5 వేలకు చేర్చాలన్నది తమ లక్ష్యమని వివరించారు. అనుభవజ్ఞులకు జావా, చిప్‌ డిజైనింగ్, డాట్‌నెట్‌ తదితర అంశాలపై టెస్ట్‌లు నిర్వహిస్తామన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు ఈ డ్రైవ్‌ జరుగుతుందన్నారు. వచ్చే నెల 11లోగా  https://www.hcltech.com/ careers/vijayawadaలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.  

ఇంటర్‌ అర్హతతో ఐటీ ఉద్యోగాల కోసం ‘టెక్‌ బి’ 
ఇంటర్మీడియెట్‌ అర్హతతో ఐటీ కెరీర్‌ను ప్రారంభించేందుకు హెచ్‌సీఎల్‌ అవకాశం కల్పిస్తోందని శ్రీమతి శివశంకర్‌ తెలిపారు. ఇందుకోసం ‘టెక్‌ బి’ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నవారితో పాటు గత రెండేళ్లలో ఇంటర్‌ పాస్‌ అయిన వారు దీనికి అర్హులని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు ‘హెచ్‌సీఎల్‌ టెక్‌ బి’ కార్యక్రమం కింద పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఏడాది పాటు ‘టెక్‌ బి’ శిక్షణ ఇచ్చి.. హెచ్‌సీఎల్‌లో ఉద్యోగమిస్తామని చెప్పారు. వీరు బిట్స్‌ పిలాని, శాస్త్ర యూనివర్సిటీల ద్వారా ఉన్నత విద్య అభ్యసించేందుకు కూడా సహకరిస్తామన్నారు. అలాగే దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఏపీ ఐటీ ఉద్యోగులు.. తమ రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేసేందుకుగానూ విజయవాడ క్యాంపస్‌ ద్వారా ‘కమ్‌ బ్యాక్‌ హోమ్‌’ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. అలాగే ఏపీ ప్రభుత్వ సహకారంతో విజయవాడ క్యాంపస్‌లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నామన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement