
టాటా సఫారీ వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి
దానిని వైఎస్ జగన్ కాన్వాయ్‌కి ముడిపెట్టి దుష్ప్రచారం
ఆ మేరకు టీడీపీ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్
జగన్ కాన్వాయ్ ఢీకొట్ట లేదని ఎస్పీ సతీష్‌కుమార్ స్పష్టీకరణ
ఎస్పీ ప్రకటన తర్వాత కూడా దుష్ప్రచారం ఆపని వైనం
ప్రత్తిపాడు/నగరంపాలెం (గుంటూరు వెస్ట్): దుష్ప్రచారంలో టీడీపీ చెలరేగిపోతోంది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న రహదారిలో ఓ రోడ్డు ప్రమాదం జరిగితే, దాన్ని జగన్ కాన్వాయ్‌కి ముడిపెట్టి పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తోంది. బుధవారం గుంటూరు రూరల్ మండలం ఏటుకూరు సమీపంలో వెంగళాయపాలెం గ్రామానికి చెందిన ప్లంబర్ చీలి సింగయ్య (53)ను టాటా సఫారీ (ఏపీ 26 సిఈ 0001) వాహనం ఢీకొంది. దీని వెనుక చాలా దూరంలో జగన్ కాన్వాయ్ వస్తోంది. ఇదే అదునుగా పచ్చ మీడియా రెచ్చిపోయింది.
ఈ ప్రమాదాన్ని జగన్ కాన్వాయ్‌కి ముడిపెడుతూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి దిగింది. అంతటితో ఆగక టీడీపీ అధికారిక ట్విటర్ ఖాతాలోనూ పోస్ట్ చేసింది. ఈ ప్రమాదానికి సంబంధించి గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ స్పష్టత ఇచ్చారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠితో కలిసి మధ్యాహ్నం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘గుంటూరు ఏటుకూరు రోడ్డులో ఆంజనేయస్వామి విగ్రహం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.
మాజీ సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్ వెళ్తున్నప్పుడు, దానికంటే 50 మీటర్ల ముందు టాటా సఫారీ వాహనం తగిలి వెంగళాయపాలెం గ్రామానికి చెందిన చీలి సింగయ్య (53) గాయపడ్డాడు. అతన్ని 108 అంబులెన్స్‌లో గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అయితే అప్పటికే సింగయ్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు’ అని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేస్తామన్నారు.
కాగా, సింగయ్య ప్రమాదం బారిన పడటాన్ని గమనించిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆయన్ను రోడ్డు పక్కకు తీసుకొచ్చారు. సింగయ్యకు భార్య లూర్థు మేరి, ఇద్దరు కుమారులు ఉన్నారు. వాస్తవం ఏమిటో తెలిశాక కూడా టీడీపీ ట్విటర్ ఖాతా నుంచి ఆ తప్పుడు పోస్టును తొలగించకపోవడం గమనార్హం.