కుట్రలు చేసి జైలుకు పంపారు
నగరంపాలెం: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబుని పరామర్శించేందుకు పార్టీ పల్నాడు, గుంటూరు జిల్లాలకు చెందిన నియోజకవర్గాల సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలు, కాపు నాయకులు గుంటూరు సిద్ధార్థనగర్‌లోని ఆయన నివాసానికి శనివారం పెద్ద ఎత్తున తరలివచ్చారు. జై జగన్.. జై అంబటి అంటూ నినాదాలు చేస్తూ, స్వర్గీయ వంగవీటి మోహన్‌రంగా, అంబటి రాంబాబుల ప్లకార్డులు, ఫొటోలతో, పార్టీ జెండాలతో తరలి వచ్చారు. ఇటీవల అంబటి రాంబాబుపై, ఆయన ఇల్లు, కార్యాలయంపై టీడీపీ మూకలు దమనకాండ జరిపిన విషయం విధితమే. ఈ క్రమంలో రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి విడుదలైన అంబటిని పలకరించేందుకు వందలాదిగా తరలిరావడంతో ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. అనంతరం అంబటి రాంబాబుని పూలబోకేలు, శాలువాలతో సత్కరించారు. తదుపరి ఆయన ఇల్లు, కార్యాలయాన్ని పరిశీలించారు.
● అనంతరం మీడియాతో వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై అక్రమ కేసులు బనాయించి, జైలుకు పంపడం చంద్రబాబు కుటిల నీతికి నిదర్శనమన్నారు. టీడీపీ మూకలు అంబటి రాంబాబుపై, ఆయన ఇల్లు, కార్యాలయంపై విధ్వంసకాండ జరపడం హేయమైన చర్య అని చెప్పారు. ఇటువంటి దుశ్చర్యలకు ప్రజాస్వామ్యంలో తావులేదని స్పష్టం చేశారు. అంబటి రాంబాబుపై ఇప్పటికీ టీడీపీ శ్రేణులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. టీడీపీని అంతూ చూసే వరకు నిద్రపోయే పరిస్థితుల్లేవని, వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేవరకు పోరాడతామన్నారు. అంబటి రాంబాబు మునపటి కంటే మరింత ఉత్సాహం, ధైర్యంతో ఉన్నారని చెప్పారు.
● వినుకొండ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు నీఛ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఒక ఎమ్మెల్యే, ఆమె భర్త అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయం వద్దకు వచ్చి దాడులకు తెగబడటం ఏంటని, చంద్రబాబు ప్రభుత్వానికి సిగ్గు ఉండాలని మండిపడ్డారు. ఇటువంటి దాడులతో యువతకు ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారని ప్రశ్నించారు. అంబటి రాంబాబుపై, ఆయన ఇల్లు, కార్యాలయంపై దాడి జరగాక ఆయన్ను అరెస్ట్ చేయడంతో అనేక మంది కన్నీరు పెట్టుకున్నారన్నారు. అంబటి రాంబాబుపై దాడి కుట్రలో చంద్రబాబు, లోకేష్, పవన్‌కల్యాణ్‌ల పాత్ర ఉందని ఆరోపించారు.
● పెదకూరపాడు సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ సీనియర్ నాయకుడు, మంత్రిగా చేసిన అంబటి రాంబాబుపై దాడి గర్హనీయమన్నారు. సుమారు ఏడు గంటలకుపైగా కర్రలు, మరణాయుధాలతో దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇటువంటి దుశ్చర్యలను పరిశీలిస్తే ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాక్షసపాలనలో ఉన్నామా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. అడ్డగోలుగా టీడీపీ ముద్రించిన ఫ్లెక్సీల్లో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటో ముద్రించడం ఏంటని ప్రశ్నించారు. లడ్డూకి మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఏం సంబంధం అని అన్నారు. ఇళ్లు, కార్యాలయాలపై దాడులకు తెగబడే సంస్కృతులకు కూటమి ప్రభుత్వం స్వస్తి చెప్పాలని హితవు పలికారు. సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డి, పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే, ఆమె భర్త స్వయంగా
దాడులను ప్రోత్సహించడం
సమంజసమా?
చంద్రబాబు, లోకేష్, పవన్
కల్యాణ్‌ల కుట్రతోనే దాడులు
చంద్రబాబు ప్రభుత్వానికి
త్వరలో ప్రజలే బుద్ధి చెబుతారు
మాజీ మంత్రి అంబటి
రాంబాబును పరామర్శించిన
వైఎస్సార్ సీపీ పల్నాడు,
గుంటూరు జిల్లాల నేతలు,
కాపు నేతలు


