ఒమిక్రాన్‌ వేరియంట్‌ టెన్షన్‌.. ఆ 121 మంది ఎక్కడ?

Omicron Variant Tension: Visakhapatnam Airport Authority Searching 121 Passengers - Sakshi

సాక్షి,మహారాణిపేట(విశాఖ దక్షిణ): కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ముప్పుతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చిన 121 మంది విమాన ప్రయాణికుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టింది. ఇటీవల విదేశాల నుంచి వచ్చిన 34 ఏళ్ల వయస్సు గల యువకుడికి ఒమిక్రాన్‌ నిర్ధారణ కావడంతో విమానాశ్రయంలో పరీక్షలు ముమ్మరం చేసింది. ఈ యువకుడు విజయనగరం జిల్లాకు చెందిన వాడైనా మధురవాడలో ఉండడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.

ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలని జిల్లా యంత్రాంగం స్పెషల్‌ బ్రాంచి పోలీసులను కోరింది. కేంద్ర విమానయాన శాఖ పంపిన జాబితా ప్రకారం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసులు బయటపడుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా వైద్యారోగ్యశాఖ, రెవెన్యూ, పోలీసు, జీవీఎంసీ, పర్యాటక శాఖ అధికారులు చర్యలకు దిగారు. విమానాశ్రయంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ నెల ఒకటి నుంచి 13వ తేదీ వరకు వివిధ దేశాల నుంచి 2825 మంది విశాఖ చేరుకున్నారు. వీరిలో 2704మంది ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేయగా.. నెగిటివ్‌ వచ్చింది.

ఇంకా 121 మంది ఎక్కడ ఉన్నారో తెలియక వైద్య ఆరోగ్య శాఖ అయోమయంలో పడింది. విమాన యాన శాఖ ఇచ్చిన జాబితాల ప్రకారం గాలిస్తున్నారు. ఆరోగ్య శాఖ, పోలీసు శాఖ రంగంలో దిగి తనిఖీలు ముమ్మరం చేశారు. చిరునామా వివరాలు పూర్తిగా లేకపోవడం, ఫోన్లు స్విచ్చాఫ్‌ చేయడం వల్ల వారి ఆచూకీ కనిపెట్టలేకపోతున్నారు. గత రెండు రోజుల కిందట 296 మంది ఆచూకీ లభించలేదు. వీరిలో ఆది, సోమవారాల్లో 175 మంది ఆచూకీ తెలియడంతో వారికి పరీక్షలు నిర్వహించారు. మిగతా వారి కోసం వెతుకుతున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ తిరుపతిరావు తెలిపారు. ఈ విషయాన్ని ఆయన కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున దృష్టికి కూడా తీసుకెళ్లారు.

విమానాశ్రయంలో పరీక్షలు 
విదేశాల నుంచి వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించడం కోసం విమానాశ్రయంలో మూడు బృందాలను ఏర్పాటు చేశారు. ఒక వైద్యుడు, నర్సు, ఏఎన్‌ఎం, ఇతర సిబ్బంది ఈ బృందంలో ఉంటున్నారు. ప్రయాణికులకు తొలుత కరోనా పరీక్షలు చేస్తున్నారు. తర్వాత ఒమిక్రాన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ప్రయాణికుల పూర్తి వివరాలు సేకరించి, బయటకు పంపుతున్నారు.  

మాస్క్‌ పెట్టుకోకపోతే రూ.100 జరిమానా 
మధురవాడ ఏరియాలో హోమ్‌ ఐసోలేషన్‌లో 34 ఏళ్ల వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తికి నెగిటివ్‌ వచ్చింది. అయినా రెండు వారాల పాటు ఐసోలేషన్‌లో ఉండమన్నాం. ఆ ఇంటి చుట్టూ ఎవరిని లోపలికి వెళ్లకుండా ఏర్పాట్లు చేశాం. బయట తిరిగే వ్యక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. లేనిపక్షంలో రూ.100 జరిమానా విధిస్తాం. భౌతిక దూరం పాటించాలి. ఇందులో ఎవరిని ఉపేక్షించే ప్రసక్తి లేదు.  
– డాక్టర్‌ ఎ.మల్లికార్జున, కలెక్టర్, విశాఖపట్నం

చదవండి: రైతు బిడ్డగా కొత్త జీవితం.. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top