ఆర్టీసీకి ఒమిక్రాన్‌ దెబ్బ!

Omicran Variant Effect to APSRTC Bus Services - Sakshi

సంక్రాంతి ప్రయాణాలకు ప్రజల వెనకడుగు

స్పెషల్‌ బస్సుల్లో 40 శాతం దాటని రిజర్వేషన్లు

గత మూడ్రోజుల్లో 600కి గాను 150 సర్వీసులే నడిపిన అధికారులు

తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులూ తక్కువే

సాక్షి, అమరావతి బ్యూరో: ఆర్టీసీ బస్సులపై ఒమిక్రాన్‌ ప్రభావం గణనీయంగా పడుతోంది. సంక్రాంతికి విపరీతమైన రద్దీ ఉంటుందని ఆశించిన సంస్థకు కరోనా కొత్త వేరియంట్‌ దెబ్బ కొడుతోంది. రోజురోజుకు కరోనా, ఒమిక్రాన్‌ కేసులు పెరిగిపోతుండడంతో  పండక్కి సొంతూళ్లకు వెళ్లే వారు వెనకడుగు వేస్తున్నారు. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ చేదు జ్ఞాపకాలకు భయపడి ప్రయాణాలు తగ్గించుకుంటున్నారు. ప్రస్తుతం ఆ ప్రభావం ఆర్టీసీ బస్సులపై బాగా కనిపిస్తోంది. 

ఈసారి రిజర్వేషన్లు అంతంతమాత్రమే
వాస్తవానికి సంక్రాంతికి వారం రోజుల ముందు నుంచే బస్సుల్లో సీట్లు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని దూరప్రాంతాలకు వెళ్లే వారు రెండు, మూడు వారాల ముందుగానే ముందస్తు రిజర్వేషన్లు చేయించుకుంటారు. కానీ, ఈ సంక్రాంతికి అలాంటి పరిస్థితి కనిపించడంలేదు. కోవిడ్‌ ప్రభావంవల్ల గత సంక్రాంతికి ఈ రీజియన్‌ నుంచి 1,093 స్పెషల్‌ బస్సులను నడిపారు. కోవిడ్‌ తగ్గుముఖం పట్టిందన్న ఉద్దేశంతో ఈ సంక్రాంతికి ఆర్టీసీ కృష్ణా రీజియన్‌ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 1,266 ప్రత్యేక (స్పెషల్‌) బస్సులు నడపాలని అధికారులు నిర్ణయించారు.

వీటిలో విశాఖపట్నానికి 390, రాజమండ్రికి 360, హైదరాబాద్‌కు 362, చెన్నైకి 20, బెంగళూరుకు 14, రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు 120 బస్సులను తిప్పడానికి ప్లాన్‌ చేశారు. అయితే.. ఇప్పటివరకు రోజువారీ తిరిగే రెగ్యులర్‌ బస్సుల్లో 50 శాతం, స్పెషల్‌ బస్సుల్లో 40 శాతం వరకే ప్రయాణికులు రిజర్వేషన్లు చేయించుకున్నారు. గడచిన మూడు రోజుల్లో రీజియన్‌ నుంచి 600 స్పెషల్‌ సర్వీసులు నడపాల్సి ఉండగా కేవలం 150 బస్సులనే నడపగలిగినట్లు ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ ఎంవై దానం ‘సాక్షి’కి చెప్పారు. 

ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరికి తాకిడి
ఏటా సంక్రాంతి పండగకు హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల నుంచి తూర్పు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లే వారి సంఖ్య అత్యధికంగా ఉంటుంది. వీరంతా తమ స్వస్థలాలకు వెళ్లడానికి ముందస్తుగానే రిజర్వేషన్లు చేయించుకుంటారు. అందువల్ల బస్సుల్లో సీట్లు దొరకని పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం భర్తీ అవుతున్న సీట్లలో విజయవాడ–విశాఖపట్నం రూటుకే అత్యధిక డిమాండ్‌ కనిపిస్తోంది. విశాఖపట్నం మీదుగా విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల వైపు వెళ్లే రెగ్యులర్‌ బస్సుల్లో దాదాపు నూరు శాతం రిజర్వేషన్లు అయిపోయాయి. ప్రత్యేక బస్సుల్లో మాత్రం ఆ స్థాయిలో సీట్లు భర్తీ కావడంలేదు.

పొరుగు రాష్ట్రాల నుంచి అరకొర..
ప్రస్తుతం తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి సంక్రాంతికి వచ్చే ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటోందని ఆర్టీసీ అధికారులు అంచనాకొచ్చారు. కోవిడ్‌ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు ఆయా ప్రాంతాల నుంచి రాష్ట్రానికి రావడానికి ఆసక్తి చూçపకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఇక కోవిడ్‌ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం కూడా ప్రయాణికులు విధిగా మాస్కులు పెట్టుకోవాలని సూచిస్తోంది. అలాగే, రైల్వేశాఖ కూడా అప్రమత్తమైంది. అన్ని రైలు బోగీల్లోనూ ఆర్పీఎఫ్‌ సిబ్బంది తిరుగుతూ ప్రతి ప్రయాణికుడి వద్దకు వెళ్లి చూస్తున్నారు. మాస్కులు లేకుండా.. సరిగా ధరించని వారికి దగ్గరుండి మాస్కులు ధరించేలా చేస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top