మహిళా కార్మికుల ముందంజ | Sakshi
Sakshi News home page

మహిళా కార్మికుల ముందంజ

Published Mon, Feb 13 2023 4:30 AM

NITI Aayog Study Says Women workforce has increased in India - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలో మహిళా శ్రామిక శక్తి నాలుగేళ్లలో 6.4 శాతం మేర పెరిగింది. పురుషుల కన్నా మహిళా కార్మికుల సంఖ్య పెరుగుదల ఎక్కువగా ఉంది. పట్టణాల్లో కన్నా గ్రామీణ ప్రాంతాల్లోనే ఇది ఎక్కువగా ఉందని నీతి ఆయోగ్‌ వెల్లడించింది. 2017–18లో మహిళా కార్మిక శక్తి 23.1 శాతం ఉంటే 2020–21 నాటికి అది 29.5 శాతానికి చేరిందని పేర్కొంది. ఈ కాలంలో దేశంలో ఉపాధి, శ్రామిక శక్తిలో చోటుచేసుకున్న మార్పులపై నీతి ఆయోగ్‌ తన అధ్యయన నివేదికను విడుదల చేసింది.

2017–18లో దేశంలో 485.3 మిలియన్ల కార్మిక శక్తి ఉండగా 2020–21 నాటికి అది 563.7 మిలియన్లకు పెరిగింది. అంటే.. మూడేళ్లలో 16.15 శాతం మేర పెరిగింది. కార్మిక శక్తి పెరుగుదల పురుషులతో పాటు మహిళా జనాభాలో కూడా నమోదైంది. అలాగే, ఈ పెరుగుదల పట్టణ, గ్రామీణ ప్రాంతా­ల్లోనూ ఉందని నివేదిక తెలిపింది. గ్రామీణ ప్రాం­తాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ఈ పె­రు­గుదల తక్కువగా ఉందని నివేదిక వెల్లడించింది. దేశంలో 2019–20లో గ్రామీణ కార్మిక శక్తి 70.7 శాతం ఉండగా 2020–21లో 73 శాతానికి పెరిగింది.

పట్టణాల నుంచి పల్లెలకు వలసలు
ఇక కోవిడ్‌ సమయంలో ఆసక్తికరంగా పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వలసలు జరిగాయని నివేదిక తెలిపింది. దీంతో ఆ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో కార్మిక శక్తి 8 శాతం మేర పెరుగుదల ఉంటే పట్టణ ప్రాంతాల్లో మూడు శాతం తగ్గింది. మూడేళ్లుగా మహిళా కార్మిక శక్తి పురుషుల కన్నా ఎక్కువ శాతం పెరిగింది. ఈ పెరుగుదల గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉన్నట్లు నివేదిక తెలిపింది.
 

నిరుద్యోగ రేటూ తగ్గుముఖం
మరోవైపు.. దేశంలో 2017–18 నుంచి నిరుద్యోగ రేటు తగ్గుతూ వస్తోందని నివేదిక పేర్కొంది. 2017–18లో నిరుద్యోగ రేటు 6.07 శాతం ఉండగా 2018–19లో 5.84 శాతానికి.. 2019–20లో 4.84 శాతానికి, 2020–21లో 4.33 శాతానికి తగ్గినట్లు తెలిపింది. అదే సమయంలో.. రాష్ట్రంలో 2018–19లో నిరుద్యోగత రేటు 5.3 శాతం ఉండగా 2020–21 నాటికి 4.1 శాతనికి తగ్గింది. దేశంలో పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగత రేటు తక్కువగా ఉంది.

కోవిడ్‌–19తో ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం పడినప్పటికీ కూడా పరిశ్రమ, సేవల రంగాల్లో 2019–20 నుంచి 2020–21 మధ్య ఉద్యోగాల సంఖ్య పెరిగింది. పరిశ్రమల రంగంలో 2018–19లో 4.8 మిలియన్ల ఉద్యోగాలు జోడించగా 2019–20లో 3.4 మిలియన్ల ఉద్యోగాలు, 2020–21లో 7.6 మిలి­యన్ల ఉద్యోగాలు పెరిగినట్లు నివేదిక పేర్కొంది. అలాగే, సర్వీసు రంగంలో కూడా 2018–19లో 10.1 మిలియన్ల ఉద్యోగాలు 2019–20లో 6 మిలి­యన్‌ ఉద్యోగాలు, 2020–21లో 2.3 మిలియన్‌ ఉద్యోగాలు పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. 

 
Advertisement
 
Advertisement