సాక్షి, గన్నవరం: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని సోమవారం గన్నవరం విమానాశ్రయంలో నిడమనూరు ఫ్లైఓవర్ బాధితులు కలిశారు. రైల్వే బ్రిడ్జి కోసం ఎంతో కాలంగా నివాసం ఉంటున్న తమ ఇళ్లను కూల్చివేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి ఎదుట వాపోయారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఎంతో కాలంగా అక్కడ నివాసం ఉంటున్న 100 కుటుంబాలను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే బాధితుల సమస్యలను విన్న మాజీ ముఖ్యమంత్రి వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమస్యపై వెంటనే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడాలని అవసరమైతే వైఎస్సార్సీపీ తరపున బాధితులకు అండగా కోర్టును ఆశ్రయించాలని సూచించారు. ఫ్లై ఓవర్ బాధితుల సమస్యలను కృష్ణాజిల్లా పార్టీ అధికార ప్రతినిధి శీలం రంగారావు, వైఎస్ జగన్‌కు వివరించారు.


