
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: రాయలసీమ ఎత్తిపోతల పథకం సర్వే పనులకు జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) మార్గదర్శకాల కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను రూపొందించడానికే పనులు చేస్తున్నామని ఏపీ సీఎస్ దాఖలు చేసిన ప్రమాణపత్రంతో ఏకీభవించింది. ఎన్జీటీ ఆదేశాలను ఏపీ సర్కారు ఉల్లంఘించిందంటూ గవినోళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఎన్జీటీ ఆదేశాలు ఉల్లంఘించి ఏపీ సర్కారు పనులు చేస్తోందంటూ శ్రీనివాస్ ఈ పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ రామకృష్ణన్, సైబల్‌దాస్ గుప్తాలతోకూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.
ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వెంకటరమణి వాదనలు వినిపిస్తూ.. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం డీపీఆర్‌ను రూపొందించడానికి సర్వే, పరిశోధనలు మాత్రమే చేస్తున్నామని ఏపీ సీఎస్ ప్రమాణపత్రాన్ని దాఖలు చేసిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలంలో మార్పులపై అధ్యయనం మాత్రమే చేస్తున్నారన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణ రాష్ట్రం నుంచి పిటిషన్ దాఖలు చేశారని చెప్పారు.
గతేడాది ఫిర్యాదు చేసినా కేఆర్‌ఎంబీ(కృష్ణా బోర్డు) చర్యలు తీసుకోలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్‌కుమార్ వాదించారు. ప్రాజెక్టు పనుల వివాదాలకు సంబంధించి నివేదిక ఇవ్వడానికి మరింత సమయం కావాలని కేఆర్‌ఎంబీ ట్రిబ్యునల్‌ను కోరింది. వాదనల అనంతరం... ఏపీ ప్రభుత్వం ఎన్జీటీ ఉత్తర్వులను ఉల్లంఘించిందంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చుతున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ప్రాజెక్టు పరిసరాల్లో చేస్తున్న పనులన్నీ సీడబ్ల్యూసీ నిబంధనల మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) రూపొందించడానికి చేస్తున్నవేనని ఏపీ సీఎస్ దాఖలు చేసిన ప్రమాణ పత్రాన్ని తోసిపుచ్చలేమని స్పష్టం చేసింది. నిబంధనలకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం పనులు చేపడుతున్నట్లు కేఆర్‌ఎంబీ నిర్ణయిస్తే.. అప్పుడు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేయవచ్చని పిటిషనర్‌కు సూచించింది. ఎన్జీటీ ఆదేశాల నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతల సర్వే, పరిశోధన, డీపీఆర్ రూపకల్పన పనులకు మార్గం సుగమమైంది.