అలా దాఖలు చేసే వ్యాజ్యానికి విచారణార్హత ఉంది
స్వచ్ఛమైన గాలి, నీరు పొందడమన్నది పౌరులకు రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు
హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పు
సాక్షి, అమరావతి: జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) జారీ చేసే ఉత్తర్వులను సవాలు చేస్తూ అధికరణ 226 కింద తమ ముందు దాఖలు చేసే వ్యాజ్యాలకు విచారణార్హత ఉందని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్‌జీటీ చట్టం సెక్షన్ 22 కింద ఉన్న ప్రత్యామ్నాయం ప్రకారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని, అయితే ఈ సెక్షన్ కింద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంపై ఎలాంటి నిషేధం లేదని తేల్చి చెప్పింది. సెక్షన్ 22 కింద ఉన్న ప్రత్యామ్నాయం హైకోర్టు తన న్యాయ పరిధి ఉపయోగించకుండా అడ్డుకోలేదంది.
చట్ట నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి పర్యావరణ అనుమతులు (ఈసీ) లేకుండా జరిపే మైనింగ్ కార్యకలాపాల వల్ల ప్రభావితమయ్యే ఏ వ్యక్తి అయినా ఎన్‌జీటీ చట్టంలోని సెక్షన్ 16లో పేర్కొన్న ‘బాధిత వ్యక్తి’ నిర్వచన పరిధిలోకి వస్తారని తెలిపింది. ఎలాంటి కాలుష్యానికి తావు లేకుండా గాలి, నీరు పొందడమన్నది పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కని హైకోర్టు పేర్కొంది. ఈ హక్కుకు భంగం కలిగితే ఏ వ్యక్తి అయినా అందుకు సంబంధించిన చర్యలను సవాలు చేయవచ్చునని పేర్కొంది.
ముఖ్యంగా పర్యావరణ అంశాల్లో సంబంధిత గ్రామానికి చెందిన వ్యక్తి ఎవరైనా కూడా ఎన్‌జీటీ ముందు అప్పీల్ దాఖలు చేయవచ్చునని తేల్చి చెప్పింది. పొట్టిశ్రీరాములు జిల్లా మోమిడి గ్రామంలో సిలికా మైనింగ్ విషయంలో శ్రీకుమారస్వామి మైనింగ్ సంస్థకు పర్యావరణ అనుమతులు మంజూరు చేసే విషయంలో సుప్రీంకోర్టు తాజా తీర్పును, చట్ట నిబంధనలను పరిగణనలోకి తీసుకుని, వాటికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది.
పర్యావరణ అనుమతులను తాత్కాలికంగా నిలిపేస్తూ ఎన్‌జీటీ ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. ఎన్‌జీటీ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ శ్రీకుమారిస్వామి మైనింగ్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ కుంచెం మహేశ్వరరావు ధర్మాసనం ఇటీవల కీలక తీర్పు వెలువరించింది.


