2023–24 నుంచి కొత్త పాఠ్యపుస్తకాలు

New textbooks from 2023-2024 - Sakshi

నేషనల్‌ కరిక్యులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ ప్రకారం మార్పులు 

ప్రస్తుత సిలబస్‌లో మార్పులు చేర్పుల దిశగా ఎన్‌సీఈఆర్టీ కసరత్తు 

విద్యార్థులపై భారం తగ్గేలా చర్యలు 

నూతన విద్యా విధానం ప్రకారం ఇవి అవసరం 

ఇంటర్, టెన్త్‌ తరగతులపై ఎన్‌సీఈఆర్టీ సమీక్ష 

వచ్చే విద్యా సంవత్సరంలో ఇప్పటి సిలబస్సే

సాక్షి, అమరావతి: జాతీయ నూతన విద్యావిధానం–2020లో పేర్కొన్న మేరకు విద్యావ్యవస్థలో చేపడుతున్న మార్పుల్లో భాగంగా నూతన పాఠ్యపుస్తకాలను కొత్త కరిక్యులమ్‌ ప్రకారం అందుబాటులోకి తీసుకురావాలని జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) నిర్ణయించింది. ఇప్పటికే కరిక్యులమ్‌లో మార్పులు చేర్పులకు సంబంధించి నేషనల్‌ కరిక్యులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ను ఎన్‌సీఈఆర్టీ ఏర్పాటుచేసింది. దీని ఆధారంగా కొత్త పాఠ్యపుస్తకాలను 2023–24 విద్యాసంవత్సరం నుంచి ప్రవేశపెట్టేలా కార్యాచరణ రూపొందించింది. ఇప్పటికే 25 థీమ్‌లతో కూడిన పొజిషన్‌ పేపర్లను రూపొందిస్తోంది. జిల్లాల స్థాయిలో నిపుణులతో పాటు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం కొత్త కరిక్యులమ్‌తో కూడిన పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి వస్తాయి. 

అధ్యాయాలను తగ్గించకుండా మార్పులు 
ఇక హయ్యర్‌ సెకండరీ తరగతులకు సంబంధించి సిలబస్‌ భారం తగ్గించేందుకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో సబ్జెక్టు నిపుణులు, పలువురు అధ్యాపకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. హయ్యర్‌ సెకండరీ విద్యార్థులు 12 తరువాత ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశానికి వివిధ జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలు రాయవలసి ఉంటుందని గుర్తుచేస్తున్నారు. వాటిని దృష్టిలో పెట్టుకుని సిలబస్‌పై నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని చెబుతున్నారు. ఆయా అధ్యాయాలను పూర్తిగా తీసివేయకుండా కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరముందంటున్నారు. సిలబస్‌ను తగ్గించడంవల్ల విద్యార్థుల్లో ఆ మేరకు ప్రమాణాలు దెబ్బతింటాయని, కనుక ప్రమాణాలు తగ్గని విధంగా సిలబస్‌ను పెట్టాల్సిన అవసరముందని చెబుతున్నారు.

విద్యార్థులు ఆయా తరగతులకు నిర్దేశించిన సామర్థ్యాలు, నైపుణ్యాలు అలవర్చుకునేందుకు వీలుగా సిలబస్‌ ఉండాలని సూచిస్తున్నారు. వాస్తవానికి ఐఐటీ, ఎన్‌ఐటీతోపాటు మెడికల్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ, నీట్‌ పరీక్షలకు విద్యార్థులు ఇంటర్మీడియెట్‌ తరగతుల్లో ఇప్పుడున్న పాఠ్యపుస్తకాల్లోని సిలబస్‌కు మించి చ దువుతున్నారని గుర్తుచేస్తున్నారు. ఈ తరుణంలో హయ్యర్‌ సెకండరీలో సిలబస్‌ తగ్గింపు ప్రభావం ఆ పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులపై పడుతుందని చెబుతున్నారు. హయ్యర్‌ సెకండరీలో సిలబస్‌ను తగ్గిస్తే ఆ మేరకు జేఈఈ, నీట్‌ సిలబస్‌లోనూ మార్పులు చేయవలసి ఉంటుందన్నారు. 

విద్యార్థులపై భారం తగ్గించేలా.. 
కోవిడ్‌ కారణంగా రెండేళ్లుగా విద్యారంగం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే కరోనా కాస్త తగ్గుముఖం పడుతుండడంతో  ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో.. వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రస్తుత పాఠ్యప్రణాళికలోని అంశాలవల్ల విద్యార్థులపై అధికభారం పడకుండా చర్యలు తీసుకునేందుకు ఎన్‌సీఈఆర్టీ చర్యలు చేపట్టింది.

కోవిడ్‌ సమయంలో కొన్ని తరగతులకు కుదించిన 30శాతం సిలబస్‌ను పునరుద్ధరిస్తూనే పలు మార్పులు చేర్పులు చేసేందుకు ఉన్నతస్థాయి కమిటీని కూడా ఏర్పాటుచేసింది. కొత్త కరిక్యులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌కు సంబంధించిన నివేదికలు ఇంకా రావలసి ఉన్నందున 2022–23 విద్యాసంవత్సరానికి అధిక భారంగా ఉన్న అంశాలను తగ్గించి విద్యార్థులకు బోధన చేసేందుకు అనుగుణంగా మార్పులు చేస్తోంది.  ఇప్పటికే ఆయా అంశాలపై నిపుణుల కమిటీ నివేదికలు అందించినందున వాటి ఆధారంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను ఇవ్వనున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top