‘పొట్టేళ్లు కోసింది మేమే.. వంట వండింది మేమే ’
వంటవాళ్ల సంభాషణ సోషల్ మీడియాలో వైరల్
ఇక్కడ తాగి అక్కడ యాక్సిడెంట్ చేశారంటున్న గ్రామస్తులు
కారు ప్రమాదంలో వెలుగు చూస్తున్న నిజాలు
బ్లూ బ్యాగులో గ్రానైట్ డీల్‌కు సంబంధించిన భారీ నగదు ఉన్నట్లు ప్రచారం
ఎస్సైలను కాపాడుతున్నదెవరనే అంశంపై చర్చోపచర్చలు
అద్దంకి ఘటన నుంచి బయట పడేందుకు ప్రభుత్వం ఆపసోపాలు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పోలీసుల కారులో గంజాయి, మద్యం బాటిళ్లు దొరికిన ఘటనలో తవ్వుతున్న కొద్దీ విస్మయం కలిగించే వాస్తవాలు బయటపడుతున్నాయి. గ్రానైట్ మాఫియా, పోలీసుల మధ్య గల సంబంధాలు కూడా వెలుగులోకి వచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారింది. మద్యం మత్తులో ఆటోను ఢీకొన్న కారులోంచి బయటపడిన ఇద్దరు ఎస్సైలను ఎవరు తప్పించారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కారు డిక్కీలో ఏముందో అద్దంకి సీఐకు ముందే సమాచారం ఉందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కారు ప్రమాదానికి కారణమైన ఎస్సైలను సేఫ్‌గా తప్పించడం వెనుక ఉన్న పెద్దలు ఎవరన్న దానిపై రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
టీడీపీ నేత కారులోనే తప్పించుకున్న ఎస్సైలు
ఈర్ల గంగమ్మ గుడి వెనుక కొత్తగా నిర్మించిన ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు భారీ పార్టీ జరిగింది. బల్లికురవ నుంచి దాచేపల్లి, గురజాల వరకు ఉన్న పోలీసు స్టేషన్ల ఎస్సైలతో పాటు ఒక సీఐ, ఓ మంత్రి పీఏ, అతడి అనుచరులు, గ్రానైట్ వ్యాపారులు హాజరైనట్లు ప్రచారం జరుగుతోంది. గ్రానైట్ డీల్‌లో భాగంగానే ఈ పార్టీ జరిగిందని, పార్టీ ముగిసిన తరువాత డీల్‌లో చేతులు మారిన నగదును తీసుకుని బల్లికురవ ఎస్సై నాగరాజు, సంతమాగులూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు కారులో బయలుదేరినట్లు ఆరోపణలున్నాయి.
కారులో కూడా ఎస్సైలు మద్యం తాగుతూనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే అద్దంకి మండలం శంఖవరప్పాడు వద్ద కారు అదుపుతప్పి మొదట ఒక బైక్ మీదకు పోయిందని, దాన్ని తప్పించబోయే క్రమంలో వెనుక వస్తున్న ఆటోను ఢీకొట్టిందని గ్రామస్తులు చెబుతున్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో కారు ప్రమాదానికి గురికాగా.. వెంటనే అద్దంకి సీఐ సుబ్బరాజు అప్రమత్తమయ్యారు. ఆగమేఘాల మీద ఘటనా స్థలానికి చేరుకుని ఎస్సైలను కాపాడే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. గ్రామస్తుల కళ్లుగప్పి ఒక టీడీపీ నేత కారులో ఎస్సైలను తప్పించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక్కడే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ టీడీపీ నేతకు ఎవరు సమాచారం ఇచ్చారనే దానిపై చర్చ నడుస్తోంది. అద్దంకి పోలీసులే ఆ టీడీపీ నాయకుడిని పురమాయించినట్లు ప్రచారం జరుగుతోంది.
డిక్కీలో ఏముందో సీఐకి ముందే తెలుసా?
కారులో మద్యం బాటిళ్లతో ఉన్న వ్యక్తులను చూసిన గ్రామస్తులు కారు డిక్కీ తెరవాలని పట్టుబట్టారు. అయితే కారు డిక్కీని తెరవకుండా సీఐ సుబ్బరాజు తీవ్రంగా ప్రయతి్నంచారు. ఒకదశలో గ్రామస్తులతో దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. కారు డిక్కీలో ఏమీ లేకపోతే సీఐ సుబ్బరాజు ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేశారని, గ్రామస్తులపై ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారన్న చర్చ సాగుతోంది. కారు డిక్కీలో గంజాయి, మద్యంతో పాటు పెద్ద మొత్తంలో నగదు ఉన్నట్లు సీఐ సుబ్బరాజుకు ముందే సమాచారం ఉందని, అందుకే ఆయన గ్రామస్తులు దాన్ని తెరవకుండా అడ్డుకునేందుకు ప్రయతి్నంచాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. కారు డిక్కీ తెరవకుండా చూడడంలో విఫలం చెందారని ప్రభుత్వ పెద్దలు సీఐని తలంటినట్లు ప్రచారం జరుగుతోంది.
పొట్టేళ్లు కోశాం.. వంట చేశాం
కారు ప్రమాదం వెనుక ఈర్ల గంగమ్మ గుడి వద్ద పార్టీ జరిగిన విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు దాస్తున్నారో అర్థం కావడం లేదని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గంగమ్మ తల్లిని దర్శించుకుని వస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్లు దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ వివరణ ఇచ్చారు. ఆదివారం అద్దంకి పోలీసు స్టేషన్‌లో మాట్లాడిన ఎస్పీ మాత్రం ఈ విషయాన్ని అసలు ప్రస్తావించలేదు. కానీ.. బల్లికురవ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వారు తామే పొట్టేళ్లు కోశామని చెబితే, తామే వంట చేశామని మరికొందరు చెప్పుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కొందరు మహిళలు మాట్లాడుకుంటున్న ఆడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఆడియోలో గంగమ్మ తల్లి గుడి వెనుక ఉన్న ఫంక్షన్ హాల్‌లో పోలీసుల పార్టీ జరిగిందని, ఇక్కడ తాగి వెళ్లిన పోలీసులు అక్కడ యాక్సిడెంట్ చేశారని చెప్పుకోవడం వినిపించింది. పోలీసు పార్టీలో బల్లికురవ, అద్దంకి, సంతమాగులూరు ఎస్సైతోపాటుగా అనేకమంది పోలీసులు పాల్గొన్నట్లు చెప్పుకోవడం వినిపిస్తోంది. ఈ పార్టీకి ఎల్లో మీడియాకు చెందిన ప్రతినిధులు కూడా హాజరైనట్లు తెలుస్తోంది. పార్టీ జరిగిన విషయం బహిర్గతమైతే గ్రానైట్ డీల్ విషయం బయట పడుతుందని, ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసు అధికారులు ఈ విషయాన్ని దాటవేస్తున్నారని చెప్పుకుంటున్నారు.
బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు ఎందుకు చేయలేదు?
కారు ప్రమాదానికి కారణమైన పోలీసులు మద్యం మత్తులో ఉన్నారని గ్రామస్తులు ఆరోపిస్తుండగా.. ఎస్సైలు ఆస్పత్రిలో ఉన్నట్లు పోలీసు అధికారే చెప్పారని, అయితే మద్యం తాగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సైలకు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు.
ఆస్పత్రిలో రాజీ యత్నాలు
పోలీసుల కారు ఢీకొన్న ఘటనలో గాయపడిన కొందరు అద్దంకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పాలని బాధితులపై పోలీసులు ఒత్తిడి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ యాక్సిడెంట్ విషయాన్ని ఇంతటితో వదిలి పెట్టాలని, ఎంత ఖర్చయినా పెట్టుకుంటామని బలవంతం చేస్తున్నట్లు బాధిత కుటుంబ సభ్యుల ద్వారా తెలుస్తోంది. బాధితులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా స్టేట్‌మెంట్ మీద పోలీసులు సంతకాలు తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. పోలీసు అధికారులెవరూ ఘటనా స్థలాన్ని పరిశీలించలేదని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


