గిరిజన అభివృద్ధిలో కొత్త శకం

New era in tribal development in Andhra Pradesh - Sakshi

ఏజెన్సీలో రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యత 

డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర 

రూ.8 వేల కోట్లతో సంక్షేమ పథకాలు : మంత్రి అమర్‌నాథ్‌ 

వేడుకగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

సాక్షి, పాడేరు/సాక్షి ప్రతినిధి, విజయనగరం: రాష్ట్రంలో గిరిజనాభివృద్ధిలో నవ శకం మొదలైందని డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో గిరిజనుల పక్షపాతిగా వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. పాడేరులోని తలారిసింగి ఇండోర్‌ స్టేడియంలో మంగళవారం ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అధ్యక్షతన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ సీఎం రాజన్న దొర, మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ గిరిజన సంప్రదాయ తుడుమును మోగించి, విల్లంబులు ఎక్కుపెట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాజన్నదొర మాట్లాడుతూ.. వాతావరణం అనుకూలించక ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ముఖ్యమంత్రి జగన్‌ రాలేకపోయారని, కొద్దిరోజుల్లో ఈ ప్రాంతంలో సీఎం పర్యటిస్తారన్నారు. రాష్ట్రంలో గిరిజన మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం తోడ్పాటునందిస్తోందన్నారు. ఎస్టీ సబ్‌ ప్లాన్‌ కింద రాష్ట్రంలో రూ.14 వేల కోట్లను ఖర్చు పెట్టిందన్నారు. ఏజెన్సీలో ప్రతి గ్రామానికి రహదారులు నిర్మిస్తున్నామన్నారు. గిరిజనులకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు.

పాడేరులో రూ.500 కోట్లతో మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని 1.5 లక్షల కుటుంబాలకు 2 లక్షల 50 వేల ఎకరాల అటవీ భూములను పంపిణీ చేసి, సీఎం జగన్‌ సర్వ హక్కులు కల్పించారని చెప్పారు. రాష్ట్రంలో ఇంత వరకు రూ.8 వేల కోట్లతో సంక్షేమ పథకాలను ప్రభుత్వం గిరిజనులకు అందించిందన్నారు. బాక్సైట్‌ జీవోలన్నింటిని రద్దు చేయడం చరిత్రాత్మకమన్నారు. అంతకు ముందు పలు అభివృద్ధి పనుల నిర్మాణాలకు మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కుంబా రవిబాబు, ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ పాల్గొన్నారు. 
 
సీతంపేట, పార్వతీపురం ఐటీడీఏల పరిధిలో ఉత్సవాలు 
పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట, పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో వేర్వేరుగా ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు. పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అధ్యక్షతన సీతంపేటలో నిర్వహించిన బహిరంగ సభకు భారీ సంఖ్యలో గిరిజనులు హాజరయ్యారు. విజయనగరం జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌ నిషాంత్‌కుమార్, సీతంపేట ఐటీడీఏ పీవో నవ్య, ఆర్డీవో హేమలత తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురంలో ఐటీడీఏ పీవో ఆనంద్‌ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ఎమ్మెల్యే అలజంగి జోగారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

గిరిపుత్రుల జీవనశైలిని కాపాడుతూ.. సంక్షేమాభివృద్ధి 
సీఎం జగన్‌ 
సాక్షి, అమరావతి: కొండకోనల్లో ఉంటూ ప్రకృతిని కాపాడుతున్న గిరి పుత్రులకు సీఎం వైఎస్‌ జగన్‌ మంగళవారం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గిరిపుత్రుల జీవనశైలిని కాపాడుతూ సంక్షేమాభివృద్ధికి మన ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గిరిజనులకు ప్రాధాన్యమిస్తూ కొత్తగా రెండు జిల్లాలను ఏర్పాటు చేశామని ఆయన ట్వీట్‌ చేశారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top