
ఈసారి పూర్తి భిన్నంగా ఫలితాలు
సాక్షి, అమరావతి: జాతీయ స్థాయిలో 2025–26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ–2025 ఫలితాలు చర్చోపచర్చలకు దారితీశాయి. జాతీయ స్థాయి ర్యాంక్‌ల ఆధారంగా ఎంబీబీఎస్ సీట్లు ఏ మేరకు వస్తాయన్న అంచనాలు వేసుకోవడంలో విద్యార్థులు, తల్లిదండ్రులు తలమునకలయ్యారు. ఈసారి రాష్ట్రం నుంచి 57,934 మంది పరీక్ష రాయగా 36,776 మంది అర్హత సాధించారు.
గతేడాదితో పోలిస్తే ఈ దఫా జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో నీట్ రాసిన, అర్హత సాధించిన విద్యార్థుల సంఖ్య తగ్గింది. అదే విధంగా పేపర్ ఎంతో కఠినంగా ఉండటంతో గతేడాదికి పూర్తి భిన్నమైన ఫలితాలు వెలువడ్డాయి. తక్కువ మార్కులు వచ్చినప్పటికీ మంచి ర్యాంక్‌లు దక్కాయి. దీంతో ఎంబీబీఎస్ అడ్మిషన్లలో కటాఫ్ మార్కులు బాగా తగ్గుతాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
గతేడాది ఏయూ రీజియన్‌లో ఓపెన్ కేటగిరిలో 601 మార్కులతో 75,427 ర్యాంక్ (నేషనల్) సాధించిన విద్యార్థికి ప్రభుత్వ (కన్వీనర్) కోటా చివరి సీటు దక్కింది. బీసీ, మైనార్టీల్లో 482 స్కోర్ వచ్చిన విద్యార్థుల వరకు సీట్లు వచ్చాయి. ఎస్‌వీయూ రీజియన్‌లో జనరల్ కేటగిరిలో 583 స్కోర్‌తో 93,186 ర్యాంకర్‌కు, బీసీల్లో 502 స్కోర్‌తో 2,01,883 ర్యాంకర్‌కు, ఎస్సీల్లో 500 స్కోర్‌తో 2,05,164, ఎస్టీల్లో 458 స్కోర్‌తో 2,69,020 ర్యాంక్ సాధించిన విద్యార్థులకు మెడిసిన్ సీటు వచ్చింది.
గత ఏడాది ఉన్న సీట్లలోనే..
రాష్ట్రంలో 2025–26 విద్యా సంవత్సరంలో కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించడం లేదని కూటమి ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వ పరిధిలో ఒక్క సీటు పెరిగే అవకాశం లేదు. ఇక ప్రైవేట్‌లో కొత్త కళాశాలలు, సీట్ల పెరుగుదల లేదని తెలుస్తోంది. దీంతో 2024–25 విద్యా సంవత్సరంలో అందుబాటులో ఉన్న 6,510 సీట్లలోనే 2025–26 విద్యా సంవత్సరంలోనూ అడ్మిషన్లు చేపట్టనున్నారు.
ప్రస్తుత నీట్ ఫలితాల సరళి, ఆల్ ఇండియా ర్యాంక్‌ల సరళిని ఓసారి గమనిస్తే.. నీట్ 2024లో టాప్ 100లోపు విద్యార్థులు 715–720 మధ్య స్కోర్ చేశారు. ఏకంగా 80,117 మంది విద్యార్థులు దేశ వ్యాప్తంగా 600పైబడి స్కోర్ చేశారు. ఈసారి జాతీయ స్థాయిలో టాప్ స్కోర్ 686 దగ్గరే ఆగిపోయింది. 651 నుంచి 686 మధ్య 73 మంది, 601–650 మధ్య 1259 మంది, 551–600 మధ్య 10,658 మంది చొప్పున విద్యార్థులు నిలిచారు.
ఈసారి టాప్ స్కోరర్‌ల సంఖ్య గణనీయంగా పడిపోయింది. 400 నుంచి 500 మధ్య ఎక్కువ మంది స్కోర్ చేశారు. దీంతో 2025–26 ఎంబీబీఎస్ అడ్మిషన్లలో కటాఫ్‌లు 100 మార్కులకు పైబడి దిగిరానున్నాయి. ఇదిలా ఉండగా నీట్ అర్హత సాధించిన రాష్ట్ర విద్యార్థుల సమాచారం ఎన్టీఏ నుంచి ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఇంకా అందాల్సి ఉంది. ఎన్టీఏ నుంచి పిలుపు వస్తే విశ్వవిద్యాలయం ప్రతినిధి ఢిల్లీకి వెళ్లి నీట్ అర్హుల సమాచారాన్ని తీసుకురానున్నారు. ఇందుకు వారం రోజులు సమయం పట్టనుంది.
కన్వీనర్ కోటాలో 4,046 సీట్లు
ప్రస్తుతం రాష్ట్రంలో 18 ప్రభుత్వ, 18 ప్రైవేట్ వైద్య కళాశాలలు ఉన్నాయి. 2024–25 సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం ఈ కళాశాలల్లో 6,510 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 475 సీట్లు ఆల్ ఇండియా కోటా కింద భర్తీ అవుతాయి. మిగిలిన సీట్లలో 4046 రాష్ట్ర స్థాయిలో కన్వీనర్ కోటాలోకి, 1,989 సీట్లు యాజమాన్య (బీ, సీ) కోటాలోకి వస్తాయి. ఇక బీడీఎస్‌లో ప్రభుత్వ, ప్రైవేట్‌లో కలిపి 1,540 సీట్లుండగా, ఆల్ ఇండియా కోటాలో 21, రాష్ట్ర కన్వీనర్ కోటాలో 818, యాజమాన్య కోటాలో 700 సీట్లు భర్తీ చేస్తారు.