Har Ghar Tiranga: ఇంటింటా ‘తిరంగ’  | National flag on every house across Andhra Pradesh | Sakshi
Sakshi News home page

Azadi Ka Amrit Mahotsav: ఇంటింటా ‘తిరంగ’ 

Published Sun, Aug 14 2022 3:24 AM | Last Updated on Sun, Aug 14 2022 2:57 PM

National flag on every house across Andhra Pradesh - Sakshi

ఎటు చూసినా మువ్వన్నెలే.. అన్ని వైపులా త్రివర్ణ పతాక రెపరెపలే..ప్రముఖులే కాదు ప్రతి ఒక్కరి ఇంటిపై జాతీయ జెండా కనిపిస్తోంది. ‘హర్‌ ఘర్‌ తిరంగా’ అంటూ దేశం నినదిస్తోంది. 75 వసంతాల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని అన్ని రాష్ట్రాల లోనూ అమృత మహోత్సవాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూడు రంగుల విద్యుద్దీపాలంకరణలతో తళుకులీనుతున్నాయి. ప్రధాన కూడళ్లన్నీ జెండాలతో, స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలతో ముస్తాబయ్యాయి... ప్రతి భారతీయుని గుండెలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తి ఉప్పొంగుతోంది..అందరినోటా ఒకటే నినాదం.. జయహో భారత్‌.. 

‘విజయీ విశ్వ తిరంగా ప్యారా.. జెండా ఊంఛా రహే హమారా..’ అనే గీతం వీనుల విందుగా వినిపిస్తోంది. ‘నా దేశం భగవద్గీత.. నా దేశం అగ్ని పునీత సీత.. నా దేశం కరుణాంతరంగ.. నా దేశం సంస్కార గంగ..’ అన్న డాక్టర్‌ సినారే మాటలు చెవుల్లో మారుమోగుతున్నాయి. అందరి గుండెల నిండుగా దేశ భక్తి తాండవిస్తోందని ప్రతి ఊరు, వాడ, ఇల్లు.. త్రివర్ణ శోభితమై ప్రకాశిస్తూ స్పష్టం చేస్తున్నాయి. స్వతంత్ర భారతావనికి కారకులైన మహోన్నతులందరికీ జయహో అంటూ పౌరులు శిరస్సు వంచి నమస్కరిస్తుండటం సాక్షాత్కరిస్తోంది.   

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: దేశ గౌరవం ప్రతి ఇంటిపై స్వేచ్ఛా విహంగమై త్రివర్ణ పతాకం రూపంలో రెపరెపలాడుతోంది. రాష్ట్ర ప్రజలంతా మువ్వన్నెల జాతీయ జెండాకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు. బానిస సంకెళ్ల నుంచి భారతావనికి విముక్తి లభించి ఈ నెల 15 నాటికి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ – హర్‌ ఘర్‌ తిరంగా’ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా జరుపుతోంది.

గవర్నర్‌ బంగ్లాలో ఈ వేడుకలను వైభవంగా నిర్వహిస్తుండగా, తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాసంపై శనివారం త్రివర్ణ పతాకాన్ని సగౌరవంగా ఆవిష్కరించారు. సామాన్యులు మొదలు.. సీఎం వరకు ప్రతి ఒక్కరూ తమ నివాస గృహాలపై, వ్యాపార, వాణిజ్య భవనాల సముదాయాల వద్ద.. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కార్యాలయాల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేస్తున్నారు. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు కోటి జాతీయ పతాకాలను ఉచితంగా పంపిణీ చేసింది. ఇంతటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.  

అందరిలోనూ ‘అమృత్‌’ పండుగ 
రాష్ట్ర వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, విద్యా సంస్థల్లో జరుపుతున్నారు. నగరాలు, పట్టణాల్లో వందల అడుగుల పొడవున్న జాతీయ జెండాలతో భారీ ర్యాలీలు నిర్వహిస్తూ ఈ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేలా వ్యాస రచన, వక్తృత్వ, నృత్య పోటీలు నిర్వహిస్తున్నారు. స్వాతంత్య్ర సమర యోధుల వేష ధారణలో పలువురు వేడుకల్లో పాల్గొంటున్నారు.

అన్ని జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇప్పటి వరకు లక్షకు పైగా అవగాహనా కార్యక్రమాలను గ్రామ, వార్డు సచివాలయాలు మొదలుకొని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పాలు పంచుకొనేలా నిర్వహించారు. ఎందరో వీరుల త్యాగ ఫలం మన ఈ స్వాతంత్య్రం. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 278 మంది స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబాలను సన్మానించారు. మనిషి మనుగడకు మూలాధారమైన 399 చెరువులను ఆధునీకరించి అమృత్‌ సరోవర్‌ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  


అంతటా జెండా స్ఫూర్తి 
అమృత్‌ ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ చారిత్రక కట్టడాలు, విగ్రహాలు, ప్రభుత్వ భవనాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. మరింత ప్రచారం కల్పించడం కోసం మూడు లఘు చిత్రాలను నిర్మించారు. ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నిర్మించిన లఘు చిత్రంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నవరత్నాలు’ సంక్షేమ పథకాల ద్వారా స్వాతంత్య్ర స్ఫూర్తితో పేదలకు జరుగుతున్న మంచిని వివరించారు.

అన్ని సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేస్తూ అన్ని వర్గాల ప్రజలను ఈ త్రివర్ణ పతాక పండగలో మమేకం చేస్తూ, సమైక్య భావాన్ని చాటుతున్నారు. తద్వారా ప్రజల్లో ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యాక్రమం బాగా చొచ్చుకువెళ్లింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇళ్లు.. వీధులు.. సామాజిక వేదికలు ఇలా సర్వం త్రివర్ణ శోభితమై ప్రకాశిస్తూ స్వతంత్ర భారతావనికి జయహో అంటున్నాయి. 

ఊరూరా సందడే సందడి 
కర్నూలు నగరానికి తలమానికమైన జగన్నాథగట్టుపై మొదటిసారి 10 అడుగుల వెడల్పు, 30 అడుగుల పొడవున్న జాతీయ పతాకం రెపరెపలాడింది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. ఒంగోలులో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ బాలినేని శ్రీనివాసరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. నెల్లూరు జిల్లాలో మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు తమ నివాసాలపై జాతీయ జెండాను ఎగుర వేశారు.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా శనివారం మువ్వన్నెలతో మెరిసింది. ఏలూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 2కే రన్‌ నిర్వహించారు. కైకలూరులో నేషనల్‌ హైస్కూల్‌ ఆధ్వర్యంలో ఒక కిలోమీటర్‌ పొడవున జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. పాలకొల్లులో వేలాది మంది విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత ర్యాలీలో పాల్గొన్నారు.

కోనసీమ జిల్లా అల్లవరంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, అమలాపురం ఎంపీ చింతా అనురాధ పాల్గొన్నారు. కాకినాడలో మూడు వేల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళంలో 105 అడుగుల ఎత్తున ఏర్పాటు చేసిన జాతీయ జెండాను శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆలయాల్లో సైతం జాతీయ జెండాలు రెపరెపలాడాయి.  

3.5 కి.మీ పొడవైన జాతీయ పతాకంతో మానవహారం  
ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలో శనివారం మూడున్నర కిలోమీటర్ల పొడవున్న జాతీయ పతాకంతో మానవహారం నిర్వహించారు. మహాత్మాగాంధీ రోడ్డులో బెంజిసర్కిల్‌ నుంచి పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో 20 వేల మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జోగి రమేష్, విడదల రజని, నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.   

జెండా రూపకర్త నివాసం నుంచే మొదలు 
75వ స్వాతంత్య్ర దినోత్సవానికి 75 వారాల ముందు.. అంటే 2021 మార్చి 12న ప్రారంభమైన ఈ  సంబరాలు.. 2023 ఆగస్టు 15 వరకు కొనసాగేలా కార్యక్రమాలను రూపొందించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సంబరాల్లో భాగంగా ‘‘ఇంటింటా జాతీయ జెండా’’ (హర్‌ ఘర్‌ తిరంగా) అనే కార్యక్రమాన్ని ఆగస్టు 13 నుంచి 15 వరకు దేశమంతటా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులను కోరింది. గతేడాది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమం నుండి ఈ వేడుకలను ప్రారంభించారు.

అదే రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. స్వాతంత్య్ర సమర యోధుడు, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను సత్కరించడం ద్వారా రాష్ట్రంలో ఈ వేడుకలకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి పౌరులలో దేశభక్తిని, జాతీయ భావాన్ని పెంపొందించేలా ‘‘ఇంటింటా జాతీయ జెండా’’ నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఈ వేడుకలను ప్రజల పండుగగా నిర్వహిస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement