రాష్ట్ర విద్యుత్‌ సంస్థలకు జాతీయ అవార్డులు | National Awards for State Power Corporations | Sakshi
Sakshi News home page

రాష్ట్ర విద్యుత్‌ సంస్థలకు జాతీయ అవార్డులు

Feb 28 2024 5:14 AM | Updated on Feb 28 2024 5:14 AM

National Awards for State Power Corporations - Sakshi

స్టేట్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌కు స్కోచ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ అవార్డు 

ఉత్తమ నోడల్‌ ఏజెన్సీగా నెడ్‌కాప్‌కు బిజినెస్‌ కనెక్ట్‌ అవార్డు 

సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు మరోసారి తమ ప్రతిభను నిరూపించాయి. రెండు ప్రతిష్టాత్మక అవా­ర్డులను కైవసం చేసుకుని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. ఇంట్రా స్టేట్‌ ఓపెన్‌ యాక్సెస్‌ సెటిల్‌మెంట్‌ (ఐఎస్‌ఓఏ) అప్లికేషన్‌కుగానూ స్కోచ్‌ సెమీ ఫైనలిస్ట్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ అవార్డును ఆంధ్రప్రదేశ్‌ ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌(ఏపీ ట్రాన్స్‌కో) దక్కించుకుంది.

ఈ అప్లికేషన్‌ను ఏపీ స్టేట్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఏపీఎస్‌ఎల్‌డీసీ) అభివృద్ధి చేసింది. అలాగే పంప్డ్‌ స్టోరేజ్‌ పవర్‌ (పీఎస్‌పీ) ప్రాజెక్ట్‌లను ప్రోత్సహించినందుకుగానూ ఉత్తమ నోడల్‌ ఏజెన్సీగా బిజినెస్‌ కనెక్ట్‌ అవార్డును ఏపీ నూతన పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ) కైవసం చేసుకుంది. 

అవార్డులు వచ్చాయి ఇలా.. 
డిస్కంలు ఓపెన్‌ యాక్సెస్‌ (ఓఏ) వినియోగదారులకు విద్యుత్‌ సరఫరా చేసేందుకు రాష్ట్రంలో వివిధ పవర్‌ డెవలపర్లు అనేక పవర్‌ ప్లాంట్‌లను స్థాపించారు. ఓఏ వినియోగదారులలో వేగవంతమైన పెరుగుదల కారణంగా, నోడల్‌ ఏజెన్సీ అయిన ఏపీఎస్‌ఎల్‌డీసీ, ఎనర్జీ బిల్లింగ్‌ సెంటర్‌ (ఈబీసీ) సకాలంలో నెలవారీ విద్యుత్, డిమాండ్‌ సెటిల్‌మెంట్లు చేయటం కష్టంగా మారింది. దీంతో బహుళ ఓపెన్‌ యాక్సెస్‌ వినియోగదారులు వివిధ ఓపెన్‌ యాక్సెస్‌ జనరేటర్ల నుంచి విద్యుత్‌ సరఫరాను పొందడంలో జాప్యం జరిగేది.

దీంతో ఏపీఎస్‌ఎల్‌డీసీ అంతర్గత ఐటీ బృందం ఓపెన్‌ యాక్సెస్‌ సెటిల్మెంట్‌ల ఆలస్యాన్ని తగ్గించేందుకు ఇంట్రా స్టేట్‌ ఓపెన్‌ యాక్సెస్‌ సెటిల్‌మెంట్‌ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసింది. దీనివల్ల ఈ ప్రక్రియ సులభం అయ్యింది. ఇక పంప్డ్‌ స్టోరేజీ హైడ్రో పవర్‌ను ప్రోత్సహించడానికి అనువుగా ఉన్న ప్రదేశాలను గుర్తించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో ఉంది. 44.79 గిగావాట్ల పునరుత్పాదక సామ­ర్థ్యం ఉన్న 39 అనువైన ప్రదేశాల్లో టెక్నో–కమర్షియల్‌ ఫీజి­బి­లిటీ రిపోర్ట్స్‌ (టీసీఎఫ్‌ఆర్‌)ను నెడ్‌కాప్‌ తయారు చేసింది.

అలాగే 1,680 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజి ప్రాజెక్ట్, 2,300 మెగావాట్ల సోలార్, 250 మెగావాట్ల పవన విద్యుత్‌ సామర్థ్యాలతో కూడిన 4,280 మెగావాట్ల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్ట్‌ (ఐఆర్‌ఈపీఎస్‌) పాణ్యం మండలం పిన్నాపురం వద్ద నిర్మాణం పూర్తయ్యే దశలో ఉంది. ఈ చర్యలు జాతీయ స్థాయిలో అవార్డులు రావడానికి కారణమయ్యాయి.

సీఎం సహకారంతోనే.. 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సహకారంతోనే రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు జాతీయ స్థాయిలో అనేక అవార్డులు సాధిస్తున్నాయని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ అన్నారు. జాతీయ అవార్డులు వరించిన సందర్భంగా స్థానిక విద్యుత్‌ సౌధలో అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మార్గదర్శకంలో విద్యుత్‌ శాఖ ఉద్యోగుల అలుపెరగని కృషితో ఏపీ విద్యుత్‌ సంస్థలు భవిష్యత్తులో కూడా మరెన్నో అవార్డులు సాధించగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

జాతీయ అవార్డులు సాధించిన ఏపీ ట్రాన్స్‌కో, నెడ్‌కాప్‌ను అభినందించారు. ఈ సమావేశంలో ఏపీజెన్‌కో ఎండీ, ట్రాన్స్‌కో జేఎండీ కేవీఎన్‌ చక్రధర్‌ బాబు, నెడ్‌కాప్‌ వీసీ, ఎండీ ఎస్‌.రమణారెడ్డి, ట్రాన్స్‌కో విజిలెన్స్‌ జేఎండీ బి. మల్లారెడ్డి, డైరెక్టర్‌ (గ్రిడ్‌) ఏకేవీ భాస్కర్,  డైరెక్టర్‌ (ఫైనాన్స్‌) టీ వీరభద్రారెడ్డి, సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement