సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోందని.. ఇప్పటిదాకా ప్రజలకు ఒక్క మంచైనా జరిగిందా? అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల హామీల పేరిట అన్నివర్గాలను మోసం చేశారని.. దుర్మార్గమైన పాలనతో ఆటవిక రాజ్యం నడుస్తోందని ధ్వజమెత్తారు. బుధవారం భీమవరం నియోజకవర్గ కేడర్‌తో భేటీ అయిన వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఈ బడ్జెట్‌తో కలిపి మూడు బడ్జెట్లు పెట్టినట్టు అవుతుంది. ఈరెండేళ్లలో చంద్రబాబునాయుడు వల్ల ప్రజలకు ఒక్క మంచైనా జరిగిందా?. గతంలో ఒక మాట చెప్తే.. ఆమాటమీద నిలబడే ప్రభుత్వం ఉండేది. మేనిఫెస్టోను పవిత్రగ్రంధంగా భావించాం. మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవాలన్న తప, తాపత్రయం ఉండేది. క్రమం తప్పకుండా ప్రతినెలా ప్రజలను ఆదుకున్నాం. కోవిడ్ లాంటి సంక్షోభం ఉన్నా.. ఏ పథకాన్ని ఎగరగొట్టలేదు. ప్రతి హామీని నిలబెట్టుకున్నాం. ప్రభుత్వ సమస్యలకన్నా ప్రజల సమస్యలనే ప్రాధాన్యతగా తీసుకున్నాం. ఎన్ని సమస్యలున్నా చిరునవ్వుతో ప్రజలను ఆదుకున్నాం. ఇవాళ్టికీ సగర్వంగా చెప్పగలం.
👉చంద్రబాబు వచ్చాక మన ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దైపోయాయి. చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అబద్ధాలుగా తేలిపోయాయి. చంద్రబాబుగారిలో ప్రజలను మోసం చేయడం ఇంకెవ్వరికీ సాధ్యంకాదు. ఇలాంటి మాటలు చెప్తే.. వేరొకరిపైన 420 కేసులు పెడతారు. చివరకు గ్యాస్ సిలెండర్లలోకూడా చంద్రబాబు మోసాలు చేశారు.
మన హయాంలో ఐదేళ్లలో, కోవిడ్ ఉన్నా దాదాపు రూ. 3.32 లక్షల కోట్లు అప్పులు చేశాం. అందులో 2.73లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో వేశాం. ఎవరికి డబ్బులు వెళ్లాయో వారి బ్యాంకు ఖాతాలు, ఆధార్ కార్డుల పరంగా చూపగలం. రెండేళ్లు తిరక్కముందే చంద్రబాబు రూ. 3లక్షల కోట్లు అప్పు చంద్రబాబు చేశాడు. మరి ఆ డబ్బు ఎక్కడకు పోయింది? ఎవరికి పోయింది?. దోచుకో.. పంచుకో.. తిను.. పద్ధతి జరుగుతోంది. ప్రతిచోటా విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రావడంలేదు. చంద్రబాబుగారు, ఆయన మనుషుల జేబుల్లోకి ఆదాయాలు పోతున్నాయి..
👉మద్యంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది. మద్యం షాపులన్నీ.. చంద్రబాబుగారి మనుషులే. బెల్టుషాపులు కూడా వారివే. దగ్గరుండి బెల్టుషాపులు నడిపిస్తున్నారు. ఎమ్మార్పీ రేట్లకు లిక్కర్ అమ్మడం లేదు. బెల్టుషాపులు దగ్గరకు వెళ్లేసరికి రూ. 20-30లు పెంచి అమ్ముతున్నారు. నాలుగైదు బాటిళ్లకు ఒక కల్తీ బాటిల్ అమ్ముతున్నారు:
👉మన హయాంలో ఇసుక నుంచి ప్రభుత్వానికి రూ.750 కోట్లు ఆదాయం వచ్చేది. ఐదేళ్లపాటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఎక్కడైనా ఇసుక ఉచితంగా వస్తోందా?. డబుల్ రేట్లకు ఇసుక అమ్ముతున్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం సున్నా. సిలికా, క్వార్ట్జ్, లెటరైట్.. ఏ ఖనిజాన్నైనా కొల్లగొడుతున్నారు.
మొన్న సంక్రాంతిరోజు చూస్తే.. ప్రభుత్వమా? జంగిల్‌రాజ్ అన్నట్లు అనిపించింది. సోషల్‌మీడియాలో వీడియోలు చూస్తే ఆశ్చర్యం వేసింది. మొబైల్ రికార్డింగ్ డ్యాన్స్‌లు నడిపారు. తాగరా.. తాగి చిందేయరా.. అన్న రీతిలో జరిగాయి. ఆటవిక రాజ్యంలో ఉన్నామా? అనిపిస్తోంది. కోడిపందాలు నడపడానికి వేలం పాటలు నిర్వహించారు:
పులివెందులలోనూ కోడిపందాలకు వేలంపాటలు పెట్టారు. ప్రభుత్వమే దగ్గరుండి చేయిస్తోంది. ఎమ్మెల్యేలు, చంద్రబాబు, లోకేష్, పోలీసు అధికారులు పంచుకున్నారు:
భీమవరం డీఎస్పీమాటలు వింటే ఆశ్చర్యం వేసింది. ‘‘ఊపేయ్.. కుదిపేయ్..’’ అని అంటున్నాడాయన. మనం ఏ సమాజంలో ఉన్నామో.. అర్థంకావడంలేదు. రాష్ట్రం జంగిల్ రాజ్ అయ్యింది. బరితెగింపునకు అడ్డులేకుండా పోయింది. విచ్చలవిడి తనం ఊహించని స్థాయికి వెళ్లిపోయింది.
మహిళలపై అఘాయిత్యాలు
👉చంద్రబాబుగారు, ఆయనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు ఏస్థాయికి వెళ్లారో తెలియడంలేదు. రైల్వేకోడూరు ఎమ్మెల్యే ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళను బెదిరించి, భయపెట్టాడు. ఆముదాలవలస అమ్మెల్యే కూనరవికుమార్ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసుకుంది. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మహిళను బలాత్కారం చేసి చివరకు అధికార దుర్వినియోగం కేసును క్లోజ్ చేయించుకున్నాడు. మంత్రి సంధ్యారాణి పీఏపై ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ ఫిర్యాదు చేస్తే.. అరెస్టు చేయాల్సిందిపోయి, బాధిత మహిళను జైలుకు పంపారు. మరో మంత్రి వాసంశెట్టి సుభాష్ రికార్డింగ్ డ్యాన్సులు వేశాడు.
👉రాష్ట్రం జంగిల్ రాజ్‌లా మారిపోయింది. విచ్చలవిడి తనం కనిపిస్తోంది. మరోవైపు రాజకీయ కక్షలకు పాల్పడుతున్నారు. తప్పుడు కేసులు పెట్టి, తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేస్తున్నారు. వ్యవస్థలన్నీ కుదేలైపోయాయి. గత 8 త్రైమాసికాలుగా ఫీజు రియింబర్స్ మెంట్ రావడంలేదు. పిల్లలు చదువులు మానేస్తున్న పరిస్థితి:
ఆస్తులు అమ్ముకుంటే తప్ప పిల్లలను చదివించుకోలేని పరిస్థితి. వసతి దీవెనకింద డబ్బులు ఇవ్వలేదు.
మన ప్రభుత్వంలో క్రమం తప్పకుండా డబ్బులు ఇచ్చాం. ఇప్పుడున్న ప్రభుత్వపు గోరుముద్దలో నాణ్యత లేదు. హాస్టళ్లలో కల్తీ ఆహారం తిని ప్రాణాలు పోగొట్టుకుంటున్న పరిస్థితి. ఆరోగ్యశ్రీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఏ రైతుకూ ఏ పంటకూ గిట్టుబాటు ధరలేదు. యూరియాకూడా రైతులకు దొరకడంలేదు. రైతులకు రెండేళ్లలో రూ.40వేలు ఇవ్వాలి. రూ.10వేలు ఇచ్చారు. ఆక్వారైతులకు మనం రూ.1.5కే కరెంటు ఇచ్చాం. రూ.3600 కోట్లు సబ్సిడీ ఇచ్చాం. ఇవాళ ఒక్కపైసాకూడా ఇవ్వలేదు. వ్యవసాయం, వైద్యం, చదువులు ఇవ్వలేకపోతే ప్రభుత్వ ఉండి ఎందుకు?:
దుర్మార్గ పాలనలో వైయస్సార్‌సీపీ కార్యకర్తలు ప్రజల తరఫున గట్టిగా నిలబడుతున్నారు. ప్రజలు ఈసారి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఫుట్‌బాల్‌లా తంతారు. ఒకటిన్నర సంవత్సరం నేను పాదయాత్రలో ప్రజలమధ్యే ఉంటాం. మొత్తం 150 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తాను. భీమవరంలో క్యాడర్ చెక్కుచెదరలేదు. గ్రామ స్థాయిలో కమిటీ నిర్మాణం బలంగా జరగాలి. జగన్ 2.Oలో కార్యకర్తలకు పెద్దపీట ఉంటుంది. నేను కూడా పాలన మీద ఎక్కవ దృష్టిపెట్టాను. కార్యకర్తలకు చేయాల్సింది చేయలేకపోయి ఉండొచ్చు. రాబోయే కాలంలో కార్యకర్తలకే పెద్దపీట ఉంటుంది. కార్యకర్తల ద్వారా ప్రజలకు మరింత మంచి జరుగుతుంది’’ అని జగన్ అన్నారు.


