
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న వేధింపులపై స్పందించాల్సిన బాధ్యత మీకు లేదా చంద్రబాబు అని ప్రశ్నించారు నందమూరి లక్ష్మీపార్వతి(Lakshmi Parvathi). మీరు అనుకున్నా.. అనుకోకున్నా మీ అత్తగారిని కదా చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. అలాగే, ఎన్టీఆర్ గౌరవం కాపాడేలా తాను బ్రతుకుతున్నట్టు తెలిపారు.
నేడు దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు (NTR) వర్ధంతి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు నందమూరి లక్ష్మీపార్వతి. ఇదే సమయంలో ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడ లక్ష్మీపార్వతి మాట్లాడుతూ..‘29 ఏళ్లుగా ఎన్టీఆర్‌కు దూరమై మనోవేదనకు గురవుతున్నాను. నా ఫోన్ నెంబర్‌ను ఎవరో టీడీపీ వాళ్లు సోషల్ మీడియాలో పెట్టారు. నిన్నటి నుంచి వరుసగా వెయ్యికిపైగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.
మీరు అనుకున్నా.. అనుకోకున్నా మీ అత్తగారిని కదా చంద్రబాబు. ఇలాంటి అవమానం నాకు జరుగుతుంటే మీరు చూస్తూ ఉంటారా?. ఇన్నేళ్లు డబ్బులు ఉన్నా లేకున్నా ఎవరినీ చేయిచాచి అడగలేదు. ఎన్టీఆర్ గౌరవం కాపాడేలా బ్రతుకుతున్నాను. నామీద ఎందుకు మీకు కక్ష.. నేనేం తప్పు చేశాను. ఎన్టీఆర్ పేరుతో మీరంతా లక్షల కోట్లు సంపాదించారు. అలాగే పెద్దాయన్న సాగనంపారు. నాపై జరుగుతున్న వేధింపులపై స్పందించాల్సిన బాధ్యత మీకు లేదా చంద్రబాబు’ అని ప్రశ్నించారు.

ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా ఆయనకు కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), కల్యాణ్ రామ్ (Kalyan Ram) పుష్ఫగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. వారితో పాటు నందమూరి బాలకృష్ణ (Nandmuri Bala Krishna), రామకృష్ణ (Rama Krishna)లు కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి నటుడిగా, నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ (NTR) ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. చంద్రబాబు కూడా ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించనున్నారు.