అర్ధచంద్రాకారంలో తీసిన నీటికుంట
దేశంలోనే రెండో నీటి సంరక్షణ పంచాయతీగా మురుగమ్మి
నేడు రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డు అందుకోనున్న సర్పంచ్ సుబ్బరత్నమ్మ
మాజీ సీఎం వైఎస్ జగన్ సహకారంతోనే సాకారమైందన్న సర్పంచ్
పీసీ పల్లి: నిత్యం కరువు కాటకాలతో అల్లాడే ప్రాంతం. అరకొరగా అందే భూగర్భ జలాలూ ఫ్లోరైడ్‌తో నిండిపోయి తాగేందుకు పనికిరాని దుస్థితి. గుక్కెడు నీటి కోసం మైళ్ల దూరం వెళ్లాల్సిందే. ఇలాంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్న ప్రకాశం జిల్లా పీసీ పల్లి మండలం మురుగమ్మి(Murugammi) గ్రామం వైఎస్ జగన్ ప్రభుత్వ సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులతో వర్షపు నీటిని ఒడిసిపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచింది. దేశంలోనే 2వ ఉత్తమ నీటి సంరక్షణ పంచాయతీగా ఎంపికైంది. సర్పంచ్ సుబ్బరత్నమ్మ మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు.
వైఎస్ జగన్ సహకారంతో కల సాకారం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2021–24 మధ్య మురుగమ్మి పంచాయతీ సర్పంచ్ సుబ్బరత్నమ్మ అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా, ఆయన సహకారంతో గ్రామంలో 47కుపైగా వాటర్òÙడ్ పథకాలను చేపట్టారు. పంచాయతీలో సుమారు రూ.కోటికి పైగా నిధులు వెచి్చంచి నీటికుంటలు, ఊట కుంటలు, చెక్ డ్యాంలు నిర్మించారు. కొండ చుట్టూ కందకాలు తీయించారు. కొండ మీద పడిన వర్షపు నీరు ఎక్కడికి అక్కడ ఆగి భూమిలోకి ఇంకేటట్లు రెండు కందకాలు రూ.2 లక్షలతో తవ్విచారు.
వర్షం నీరు ఎటువైపు వాలు ఉంటే అటు ప్రవహిస్తూ ఒకచోట ఇంకేటట్టు రూ.27 లక్షలు వెచ్చించి 16 చిన్న ఊట కుంటలు తీశారు. 21 డక్ అవుట్ పాండ్‌లు ఏర్పాటు చేశారు. ఇందుకోసం రూ.35 లక్షలు ఖర్చు చేశారు. ‘అమృత సరోవర్’ పేరిట నీరు ఎక్కువగా ప్రవహించే ఏటవాలు ప్రాంతంలో కుంటతీసి చుట్టూ పెద్ద కందకం ఏర్పాటు చేశారు. ఈ చర్యల వల్ల వర్షాకాలంలో వాటర్ షెడ్ పథకాల్లో గణనీయంగా నీరు చేరింది. దీంతో చుట్టుపక్కల ఉన్న పంట పొలాల బోర్లలో భూగర్భ నీటిశాతం గణనీయంగా పెరిగింది. దీంతో రైతులు వరి, శనగ, పొగాకు వంటి పంటలు సాగు చేశారు. అంతేకాకుండా కొత్త నీరు చేరడంతో నీటిలో గతంలో అధికంగా ఉండే ఫ్లోరైడ్ శాతం తగ్గుముఖం పట్టింది.
నా కష్టం.. జగనన్న ఆశయం ఫలించాయి
2021–24 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతులు సంతోషంగా ఉండాలని, పల్లెలు పంటలతో కళకళలాడాలని కోరుకునేవారు. ఆయన ఆశయానికి అనుగుణంగా ప్రభుత్వం ఇచ్చిన నిధులను దుర్వినియోగం కాకుండా పంచాయతీల్లో వాటర్ షెడ్ పథకాలు పెద్ద ఎత్తున నిర్మించాను. నా కష్టం.. జగనన్న ఆశయం నెరవేరి పంచాయతీ పరిధిలోని గ్రామాల్లోని బోర్లలో నీటిమట్టం గణనీయంగా పెరిగింది. నా కష్టాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. – సుబ్బరత్నమ్మ, సర్పంచ్, అవార్డు గ్రహీత, మురుగమ్మి


