
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి బుధవారం కలిశారు. కడపలోని రాయచోటి రోడ్డులో ఊటుకూరు, ప్రకృతినగర్ తదితర ప్రాంతాల వాసుల రాకపోకలకు రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఆయా ప్రాంతాల ప్రజలు, విద్యార్థుల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని రైల్వే శాఖ దృష్టికి తీసుకొచ్చిన అవినాష్ రెడ్డి.. ఎల్‌సీ 122 వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి మంజూరు చేయాల్సిందిగా వినతించారు.
చెన్నై- అహ్మదాబాద్ మధ్య నడిచే హంసఫర్ ఎక్స్‌ప్రెస్‌ను కడపలో స్టాపింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తిరుపతి - షిర్డీ మధ్య వారానికి ఒక రోజు మాత్రమే రైలు నడుస్తోందని.. అది కూడా మల్టీ చేంజ్ రూట్లుగా వెళ్లడం వల్ల 126 గంటల ప్రయాణ సమయం పడుతోందన్నారు. అదే తిరుపతి నుంచి షిర్డీకి నేరుగా ఒక రైలును ప్రతి రోజు నడపాలని కేంద్ర మంత్రిని వైఎస్ అవినాష్‌రెడ్డి కోరారు. తద్వార ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర భక్తులకు ఉపయోగంగా ఉంటుందని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.