తండ్రి లేని కూతురి భవిష్యత్‌ను ఆ తల్లి ఊహించుకోలేకపోయింది. తన బిడ్డకు రక్షణ ఇవ్వగలనో లేదో అని భయపడింది. సమాజం తన కన్నపేగును ఏం చేసేస్తుందో అని కంగారుపడింది. నిలువెల్లా ఆవహించిన ఆందోళన ఆ తల్లి మెదడును చెడగొట్టింది. బంగారం లాంటి బిడ్డను బయట ప్రపంచానికి చూపించకుండా మూడేళ్లు చీకటి చెరలో దాచేలా చేసింది. ఇన్నేళ్ల పాటు గది తప్ప బయట లోకం చూడకుండా గడిపిన బాలిక ఎట్టకేలకు అధికారుల దయతో వెలుగు చూసింది.
ఇచ్ఛాపురం/ఇచ్ఛాపురం రూరల్: పట్టణమంతా మంగళవారం కలకలం రేగింది. మూడేళ్ల తర్వాత ఓ బాలిక సూరీడిని చూడడంతో ఊరుఊరంతా ఈ విషయంపైనే చర్చ జరిగింది. వివరాల్లోకి వెళితే.. రైల్వేస్టేషన్ రోడ్డు చక్రపాణి వీధికి చెందిన ఊళ్ల భాగ్యలక్ష్మి అనే మహిళకు 2007లో ఒడిశా కటక్‌కు చెందిన వ్యక్తితో వివాహమైంది. 2009లో వీరికి ఓ బాలిక జన్మించింది. అక్కడకు ఐదారేళ్ల వ్యవధిలో భాగ్యలక్ష్మి భర్త చనిపోయారు. దీంతో భాగ్యలక్ష్మి కన్నవారింటిలోనే అన్నయ్య వద్ద ఉండిపోయారు. పెళ్లయిన కొన్నాళ్లకే భర్త చనిపోవడంతో భాగ్యలక్ష్మి మానసికంగా బాగా కృంగిపోయారు. బిడ్డ మౌనిక ను ఓ ప్రైవేటు పాఠశాలలో చదివించారు. 2022లో మౌనిక రజస్వల అయ్యింది. అప్పటి నుంచి ఆ తల్లి లో భయం పెరిగిపోయింది. పెరిగి పెద్దయిన బి డ్డకు రక్షణ కల్పించగలనో లేదో అని లేనిపోని భయాలు పెట్టుకుంది. సమాజంలో జరుగుతున్న ప్రతి సంఘటన ఆమెను తీవ్రంగా కలవరపరిచేది. దీంతో కుమార్తెను బయటకు పంపించకుండా ఇంటిలో ఉంచడం మొదలుపెట్టింది. అలా ఏకంగా మూడేళ్ల పాటు బిడ్డను ఇల్లు దాటనీయకుండా చీకటి గదిలోనే ఉంచేసింది.
నిత్యం కనిపించే అమ్మాయి బయటకు రాకపోవడంతో చుట్టుపక్కల వారు ఆ తల్లిని ప్రశ్నించేవారు. అలా అడిగే వారిపై భాగ్యలక్ష్మి విరుచుకుపడేది. దీంతో ఆమెతో ఎవరూ పెట్టుకునేవారు కాదు. ప్రభు త్వం ఇచ్చే పెన్షన్‌తోనే వీరు బతికేవారు. ఇంటిలో ఉన్నప్పుడు కూడా అన్ని దీపాలు ఆర్పేసి చీకటిలోనే గడిపేవారు. మూడేళ్లుగా ఆ అమ్మాయి జాడ తెలీక పోవడంతో స్థానికులు అంగన్‌వాడీ కార్యకర్తకు స మాచారం అందజేశారు. ఆమె అంగన్‌వాడీ సీడీపీఓకు మంగళవారం విషయం చెప్పారు. దీంతో అధికార యంత్రాంగం జూనియర్ సివిల్ జడ్జి పి.పరేష్ కుమార్, స్థానిక తహసీల్దార్ వెంకటరావు, ఐసీడీఎస్ సీడీపీఓ రాజేశ్వరి, మండల విద్యాశాఖాధికారి అప్పారావు, న్యాయవాదులు ఉలాల భారతిదివ్య, ప్రేమలత పోలీసు బృందం, అంగన్‌వాడీ అధ్యక్షురాలు బి.హైమావతి అంగన్‌వాడీ కార్యకర్తలంతా కలిసి ఆ ఇంటికి వచ్చారు.
ఎంత తలుపు కొట్టినా ఎవరూ తీయలేదు. దీంతో కోర్టు కానిస్టేబుల్ సర్వే కోసం వచ్చామని చెప్ప డంతో తలుపు తీసింది. అప్పటికే ఇల్లంతా చీకటిగా ఉంది. అధికారులు సెల్ లైట్ వేసి పరిశీలించగా బాత్ రూమ్ వద్ద కుమార్తె, తల్లి ఉన్నారు. వారి పరిస్థితిని చూసి అధికారులు నిశ్చేషు్టలైపోయారు. వెంటనే ఇద్దరినీ బయటకు తీసుకువచ్చి కౌన్సెలింగ్ చేశారు. ఆ సమయంలో జడ్జితో బాలిక ఇంగ్లిష్ లో నూ మాట్లాడడంతో ఆయన ఆశ్చర్యపోయారు. ఇన్నేళ్లుగా ఆమె గదిలో ఉండిపోవడంతో నడవలేకపోతోంది. తల్లి మానసిక ఆరోగ్యం కూడా సరిగా లే దు. కుమార్తె పేరును మౌనిక అని మోనిక అని రోజా అని చెబుతోంది. దీంతో బాలికను శ్రీకాకుళం బాలికాసంరక్షణా గృహానికి తరలించాలని, అదేవిధంగా తల్లిని వైజాగ్ కేజీహెచ్ ఆస్పత్రికి తరలించా లని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం వీరిని ఆదర్శపాఠశాల పురుషోత్తపురం హాస్టల్‌లో ఉంచారు.


