సంపాదించలేని అమ్మ అనాథయ్యింది..!

A Mother Is Alone Due To Left Their Children In Srikakulam - Sakshi

ఇచ్ఛాపురం: సంపాదించలేని అమ్మ అనాథయ్యింది. పని చేసే శక్తి కోల్పోయిన తల్లి ఒంటరిదైపోయింది. డబ్బు లేని ఆ మాతృమూర్తి కన్నబిడ్డలకు బరువైంది. 85 ఏళ్ల కాలాన్ని తన రెక్కల కష్టంతో గడిపిన ఆ మనిషి ఇప్పుడు అలసిపోయింది. పేగు తెంచుకు పుట్టిన వారు బంధాలు తెంచుకుని వెళ్లిపోతుంటే కన్నీరు పెట్టడం తప్ప ఇంకేమీ చేయలేకపోయింది. ఇచ్ఛాపురం పట్టణంలోని గొల్లవీధికి చెందిన నీలాపు అచ్చమ్మ అందరూ ఉండి అనాథలా మారింది. అచ్చమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిని తన రెక్కలు ముక్కలు చేసుకుని అచ్చమ్మ పెంచింది.

అందరికీ పెళ్లిళ్లు చేసింది. వారిలో ఒక కుమారుడు చనిపోగా మరో కుమారుడు మున్సిపాలిటీలోని బెల్లుపడ కాలనీలో చిన్నదుకాణం పెట్టుకొని బతుకుతున్నాడు. అచ్చమ్మ తన కుమార్తెతో కలసి తోటవీధిలోని ఓ అద్దె ఇంటిలో ఉండేది. అచ్చమ్మ తనకు వచ్చే పింఛన్‌ డబ్బును కుమార్తెకే ఇచ్చేసి అక్కడే ఉండేది. సోమవారం అచ్చమ్మ కూతురు తల్లి వద్ద ఉన్న కాస్త బంగారాన్ని తీసుకుని ఆమెను గొల్లవీధి మండపం వద్ద విడిచిపెట్టేసింది. 85 ఏళ్ల వయసులో ఎక్కడకు వెళ్లాలో తెలీక, ఏం చేయాలో పాలుపోక అక్కడే తడికళ్లతో బిత్తర చూపులు చూసుకుంటూ ఉండిపోయింది. ఆమెను ఆ పరిస్థితుల్లో చూసిన స్థానికులు కంటతడి పెట్టారు. అధికారులు స్పందించి ఆమెకు న్యాయం చేయాలని వారు కోరారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top