Turntable Ladder: ఫైర్‌ ఫైటర్‌.. 55 మీటర్ల ఎత్తుకు వెళ్లి.. టీటీఎల్‌ ప్రత్యేకతలివే

Most Advanced Disaster Response Vehicle In AP Fire Department - Sakshi

గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): అగ్నిమాపక శాఖ అమ్ముల పొదిలో అత్యాధునిక వాహనం చేరింది. టర్న్‌ టేబుల్‌ లేడర్‌ (టీటీఎల్‌)గా పిలిచే ఈ వాహనం బహుళ అంతస్తుల భవనాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ వాహనంపై ఉండే ల్యాడర్‌ (నిచ్చెన) 55 మీటర్ల ఎత్తుకు వెళ్తుంది. 18వ అంతస్తు వరకు వెళ్లి అగ్ని ప్రమాదాన్ని నివారించేందుకు దోహదం చేస్తుంది. ఈ ఫైర్‌ ఫైటర్‌ను జపాన్‌ నుంచి కొనుగోలు చేశారు. రాష్ట్రంలోనే ఇది మొదటిది.  విజయవాడ, తిరుపతి, విశాఖ వంటి నగరాల్లో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు ఊపందుకున్నాయి.
చదవండి: వీటిని ఎక్కువ కాలం వాడుతున్నారా?.. అయితే డేంజర్‌లో పడ్డట్టే!

జనాభా పెరగడం, నగరం ఎక్కువ విస్తరిస్తుండడంతో బహుళ అంతస్తుల నిర్మాణాలు అనివార్యంగా మారాయి. ఈ భవనాల్లో అగ్ని ప్రమాదాలు జరిగితే నివారించడం కష్ట సాధ్యంగా ఉంటోంది. వీటి నివారణకు అగ్నిమాపక శాఖ వద్ద అధునాతన యంత్రాలు లేవు. కొద్దిపాటి అపార్టుమెంట్లు, మాల్స్‌ వంటి వాటిలో ప్రమాదాలు జరిగినప్పుడు ఫైరింజన్ల సహాయంతో మంటలు ఆర్పేవారు. 5 అంతస్తులు, అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న భవనాల్లో ప్రమాదాలు జరిగితే కొంత ఇబ్బందిగా ఉండేది. బ్రాంటో స్కై లిఫ్ట్‌ అందుబాటులో ఉన్నప్పటికీ దాని పనితీరు పరిమితంగా ఉండేది.

టీటీఎల్‌ ప్రత్యేకతలివీ..
టర్న్‌ టేబుల్‌ ల్యాడర్‌ 18 అంతస్తుల భవనాల్లో సైతం ప్రమాదాలను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించి, మంటలను ఆర్పడం దీని ప్రత్యేకత. ల్యాడర్‌ 360 డిగ్రీల వరకు తిరుగుతూ మంటల్ని ఆర్పుతుంది. 75 డిగ్రీల వాలుగా నిలవగలదు. సిబ్బంది ఓ వైపు మంటలు ఆర్పుతూనే మరో వైపు మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించి ల్యాడర్‌కు అనుసంధానంగా ఉన్న లిఫ్ట్‌ ద్వారా కిందికి పంపుతారు.

ల్యాడర్‌ చివర ఉన్న క్యాబిన్‌లో ఎల్‌ఈడీ స్క్రీన్‌ అమర్చి ఉంటుంది. ల్యాడర్‌ ఎంత ఎత్తులో ఉంది, గాలి వేగం ఎంత ఉంది, గాలి ఎటు వీస్తోంది వంటి విషయాలను స్క్రీన్‌ ఆధారంగా తెలుసుకుంటూ సిబ్బంది ఫైర్‌ ఫైటింగ్‌ చేస్తారు. టర్న్‌ టేబుల్‌ ల్యాడర్‌ను మూడుచోట్ల నుంచి ఆపరేట్‌ చేసే అవకాశం ఉంది. ల్యాడర్‌ చివర క్యాబిన్, లిఫ్టర్, వాహనం ఇలా 3 చోట్ల నుంచి దీన్ని ఆపరేట్‌ చేస్తూ మంటలు ఆర్పే అవకాశం ఉంది. ల్యాడర్‌లో పైకి వెళ్లిన సిబ్బంది అక్కడి పరిస్థితిని బట్టి ల్యాడర్‌ను తమకు అనుకూలంగా తిప్పుకునే అవకాశం ఉండటం ఈ వాహనం ప్రత్యేకత.   

రాష్ట్రంలోనే ఇది మొదటిది
అగ్నిమాపక శాఖకు అధునాతన వాహనాలను సమకూర్చుకుంటున్నాం. ఇందులో భాగంగా టీటీఎల్‌ను జపాన్‌ నుంచి దిగుమతి చేసుకున్నాం. రాష్ట్రంలోనే ఇది మొదటిది. ఇదొక ప్రత్యేకమైన ఫైర్‌ ఫైటర్‌. ఇప్పటివరకు బాధితులను రక్షించడం, మంటలను ఆర్పడం వేర్వేరుగా జరిగేవి. దీని సహాయంతో ఏకకాలంలో రెండు పనులు చేయొచ్చు. 
– జి.శ్రీనివాసులు, ప్రాంతీయ అగ్నిమాపక అధికారి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top